బ్రహ్మాండమైన పనితీరును ప్రదర్శిస్తున్న తొమ్మిది ప్రభుత్వరంగ సంస్థలను ‘నవరత్నా’లుగా వర్గీకరించడం పదిహేనేళ్లక్రితం మొదలైంది. అటు తర్వాత ‘మినీ రత్న’లు, ‘మహారత్న’లు పుట్టుకొచ్చాయి. ఈ జాబితాలన్నీ నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. పేరుకు నవరత్నాలే అయినా ఆ జాబితాలో ఇప్పుడు 14 సంస్థలున్నాయి. ఎటుచూసినా రత్నాలే కనిపిస్తుండటాన్నిబట్టి అవన్నీ కార్మికులను, ఇతర సిబ్బందిని బాగా పట్టించుకుంటున్నాయని, వారి భద్రతకు గట్టి చర్యలు తీసుకుంటున్నాయని అనుకోవడానికి లేదు. నికర లాభార్జన, ఉత్పాదకత వంటివన్నీ పరిగణించి ఈ వర్గీకరణలు చేస్తున్నారు. వాటిని ప్రపంచస్థాయి మహాసంస్థలుగా రూపుదిద్దడానికి అవసరమైన నిర్ణయాలను సొంతంగా తీసుకోవడానికి ఆ సంస్థలకు అధికారాలివ్వడమే ఈ వర్గీకరణల అంతరార్థం. అయితే, ఈ రత్నాలను నిర్ధారించే కొలమానాల్లో భద్రతా ప్రమాణాలు మాత్రం లేవు. విశాఖపట్నంలోని హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) రిఫైనరీలో శుక్రవారం చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాదానికి ఇలాంటి నిర్లక్ష్యమే కారణమని వేరే చెప్పనవసరంలేదు. ఈ ప్రమాదంలో ఇప్పటికి 8 మంది మరణించగా, దాదాపు 90 మంది గాయపడ్డారు. వీరిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నదని చెబుతున్నారు. వీరంతా 50 నుంచి 80 శాతం ఒళ్లు కాలిపోయి నరకయాతన అనుభవిస్తున్నారు. అనేక మందికి కళ్లు కాలిపోయాయి. శ్వాస తీసుకోవడమే కష్టంగా మారిందని బాధితులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన అరగంట వరకూ ఆ సమీప ప్రాంతంలోకి ఎవరూ వెళ్లలేకపోయారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉన్నదో ఊహించుకోవచ్చు. పనిచేస్తున్నవారిలో ఎక్కువ మంది కాంట్రాక్టు కార్మికులైనందువల్ల గల్లంతయినవారెందరో తెలియడంలేదని సమాచారం. హెచ్‌పీసీఎల్‌లో ఇది మొదటి ప్రమాదం కాదు. అడపాదడపా అవి చోటు చేసుకుంటూనే ఉన్నాయి. 1997లో అయితే భారీ ప్రమాదం సంభవించి 62 మంది ఉద్యోగులు మృత్యువాతపడ్డారు. మూడేళ్లక్రితం ఒక ప్రమాదం జరిగి ముగ్గురు మరణించారు. మూడునెలల క్రితం కూడా అక్కడి ఒక ప్లాంట్‌లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ సందర్భాలన్నిటా ప్రమాద హెచ్చరికలు చేయడమనేదే జరగలేదని కార్మికులు చెబుతున్నారు.
హెచ్‌పీసీఎల్ సంస్థ వార్షిక టర్నోవర్ లక్షా 90 వేల కోట్ల రూపాయలు. దీనికి ముంబై, విశాఖల్లో రిఫైనరీలుండగా విశాఖలోని యూనిట్ చాలా పెద్దది. ఇక్కడి రిఫైనరీ వార్షిక సామర్థ్యం 8.3 మిలియన్ టన్నులు. యూరో ప్రమాణాలకు అనుగుణంగా డీజిల్, పెట్రోల్ సరఫరా చేయడానికి కోట్లాది రూపాయలు వ్యయం చేస్తున్న సంస్థ సాధారణ కార్మికుల భద్రత విషయంలో ఏపాటి చర్యలు తీసుకుంటున్నదో చెప్పడానికి తరచు జరుగుతున్న ప్రమాదాలు, వాటిపై అది స్పందిస్తున్న తీరే నిదర్శనం. కూలింగ్ టవర్ పైభాగంలో వెల్డింగ్ పనులు నిర్వహిస్తుండగా వచ్చిన నిప్పురవ్వలు కిందనున్న రసాయన వ్యర్థాలపై పడటం వల్లే మంటలు వ్యాపించాయని అంటున్నారు. అత్యంత ప్రమాదకరమైన రసాయన వ్యర్థాలు ఎక్కడబడితే అక్కడ పడి ఉన్నాయంటేనే సంస్థలో భద్రతా చర్యలు ఎలా ఉన్నాయో అర్థమవుతుంది. బాధితుల్లో చాలామంది ఉద్యోగ భద్రతలేని కాంట్రాక్టు కార్మికులే. వారిలో తాము చేస్తున్న పనికి సంబంధించి, అందులో ఇమిడి ఉన్న ప్రమాదాల గురించి... అనుకోని ఘటనలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఏమేరకు అవగాహన ఉంది? అందుకోసం యాజమాన్యం ఆ కాంట్రాక్టు కార్మికులకు ఇప్పించిన తర్ఫీదు ఏమిటి? నిజంగా అలాంటి అవగాహనే కల్పించినట్టయితే, పనులు జరుగుతున్న చోట ప్రమాదకర వ్యర్థాలు ఎందుకున్నట్టు? ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకో గల అవకాశాలున్నాయో, వాటికి వెనువెంటనే స్పందించాల్సిన తీరేమిటో తెలిసిన ప్రత్యేక బృందం ఏమైనా ఉన్నదా? ఇవన్నీ తేలవలసిన ప్రశ్నలు. అంతేకాదు, కూలింగ్ టవర్ కిందన ఉన్న నాఫ్తా పైప్‌లైన్ గత కొన్ని రోజులుగా లీకవుతున్నదని తెలిసినా దాన్ని చక్కదిద్దడంలో గానీ, వెల్డింగ్ పనులు ఆపడంలోగానీ అధికారులు శ్రద్ధ పెట్టలేదంటున్నారు. అక్కడ తరచు జరుగుతున్న ప్రమాదాల ధోరణి గమనిస్తే లాభార్జనపైనా, టర్నోవర్‌పైనా ఉండే దృష్టి భద్రతాపరమైన జాగ్రత్తలపై అసలే లేదని అర్ధమవుతుంది.
ఒక్క హెచ్‌పీసీఎల్ మాత్రమే కాదు... విశాఖలో ఉండే ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా భద్రత అంతంతమాత్రంగానే ఉంది. గత ఏడాది విశాఖ ఉక్కు కర్మాగారంలో సంభవించిన రెండు పేలుళ్లలో 22 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో కూడా ఎక్కువ మంది కాంట్రాక్టు కార్మికులే. విశాఖ చుట్టు పట్ల 50 రసాయనిక, ఫార్మా కంపెనీలు, 40 ఇతరత్రా పరిశ్రమలు ఉన్నాయి. ఇందులో చాలా పరిశ్రమల్లో కనీసం ఫస్ట్ ఎయిడ్ కూడా లేదని చెబుతున్నారు. ఇవి నిర్వహణకే పనికిరావని అంటున్నారు. వీటన్నిటినుంచీ నిత్యమూ వెలువడే రసా యనిక వ్యర్థాలు ఆ నగర ప్రజలను ఊపిరాడనివ్వకుండా చేస్తున్నాయి. హఠాత్తుగా మంటలు కనబడితే, పీల్చేగాలి విషవాయువులు మోసుకొస్తే ప్రజలు ప్రాణ భయంతో సతమతమవుతున్నారు. లాభార్జన కోసం సాగించే వెంపర్లాటలో వెయ్యోవంతైనా భద్రతపై ఉన్నట్టయితే సాధారణ కార్మికులు, ఆ ప్రాంతంలోని లక్షలాది మంది ప్రజలు క్షేమంగా ఉండగలుగుతారు. నవరత్నంగా భుజకీర్తులు తగిలించుకున్న ప్రభుత్వరంగ సంస్థల్లోనే భద్రత ఇంత నాసిరకంగా ఉంటే, ఇక మిగిలిన సంస్థల పరిస్థితి చెప్పేదేముంది? ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెర వాలి. కార్మికుడి భద్రతకు అత్యంత ప్రాముఖ్యమిచ్చేలా పీఎస్‌యూలను తీర్చిదిద్ది, మిగిలిన సంస్థలకు అవి మార్గదర్శకంగా ఉండేలా చూడాలి. మనిషి ప్రాణానికి, క్షేమానికి విలువనివ్వని రత్నాలు గులకరాళ్లతో సమానమని గ్రహించాలి.