విశాఖ హెచ్‌పీసీఎల్‌లో అగ్ని ప్రమాదం | Fire Breaks Out in Vizags HPCL Refinery 4 Killed | Sakshi
Sakshi News home page

Published Sat, Aug 24 2013 7:40 AM | Last Updated on Thu, Mar 21 2024 9:00 PM

విశాఖపట్నంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పెద్దఎత్తున చెలరేగిన మంటల్లో చిక్కుకొని ఒకరు అక్కడికక్కడే చనిపోగా, మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని హెచ్‌పీసీఎల్, ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. వీరిలో ఒకరు హెచ్‌పీసీఎల్ ఉద్యోగి కాగా, ఇద్దరు కార్మికులు. ప్రమాద తీవ్రత చూస్తే మృతుల సంఖ్య 15కు పైనే ఉండవచ్చని బాధితుల బంధువులు, వైద్యులు చెబుతున్నారు. శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటనలో మొత్తం 38 మంది గాయపడ్డారు. వీరిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. 50 నుంచి 80 శాతం ఒళ్లు కాలిపోయి వీరంతా నరకయాతన అనుభవిస్తున్నారు. బాధితుల్లో 16 మంది విశాఖలోని కేర్ ఆస్పత్రిలో, ఐదుగురు మణిపాల్ ఆస్పత్రిలో, 14 మంది సెవెన్‌హిల్స్ ఆస్పత్రిలో, కళ్యాణి ఆసుపత్రిలో ముగ్గురు చికిత్స పొందుతున్నారు. వీరిలో చాలామంది చికిత్సకు స్పందించడం లేదని వైద్యులు తెలిపారు. ప్రమాదం జరిగిందిలా.. హెచ్‌పీసీల్ సంస్థ ఆవరణలో కొన్నేళ్లుగా కూలింగ్ టవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. గోపాల్, జయలక్ష్మి ఇంజనీరింగ్, డ్రిజ్ అండ్ గూప్ సంస్థలు ఈ పనులు చేపడుతున్నాయి. ఇందుకు 200 మంది కార్మికులకుపైగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం కూలింగ్ టవర్ పైభాగంలో వెల్డింగ్ పనులు నిర్వహిస్తుండగా నిప్పు రవ్వలు జారి కింద ఉన్న రసాయన వ్యర్థాలపై పడడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. టవర్ చుట్టూ పనికి రాని చెక్కలు, స్టేజింగ్ కోసం ఏర్పాటు చేసిన కర్రలు, ఇతర వ్యర్థాలు ఉండడంతో మంటలు 50 మీటర్లు ఎత్తుకు వ్యాపించాయి. ఆ సమయంలో అక్కడే ఉన్న హెచ్‌పీసీఎల్ ఉద్యోగి, కూలింగ్ టవర్ ఇన్‌చార్జి మురళి అక్కడికక్కడే మృతి చెందారు. ఆస్పత్రిలో నక్కా వెంకటరమణ (ఫిట్టర్), మండల్ చనిపోయారు. టవర్ వద్ద పనిచేస్తున్న కార్మికుల్లో 50 మందికిపైగా గాయాలపాలైనట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదం చోటుచేసుకున్నప్పుడు ఆ ప్రాంగణమంతా దట్టమైన పొగలు, మంటలు అలముకోవడంతో గాయపడిన వారిని రక్షించేందుకు ఎవరూ సాహసించలేదు. అరగంట వరకు ఆ ప్రదేశానికి ఎవరూ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న కంపెనీ అధికారులు క్షతగాత్రులను తొలుత నేవీ ఆసుపత్రికి త రలించారు. వివిధ కంపెనీలకు చెందిన అగ్నిమాపక వాహనాలకు సమాచారం అందించడంతో అక్కడకు చేరుకొన్న సిబ్బంది రెండు గంటల వ్యవధిలో మంటలను అదుపు చేశారు. ప్లాంట్ పనులు నిర్వహిస్తున్న కార్మికులకు గుర్తింపుకార్డులు లేకపోవడంతో అసలు ప్రమాదంలో చిక్కుకున్న వారెవరు? వారి వివరాలు పూర్తిగా తెలియడం లేదు. శ్వాస కూడా తీసుకోలేని స్థితిలో బాధితులు.. అగ్ని ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరిస్తున్నా వీరి సంఖ్య 15 మందికిపైనే ఉండొచ్చని తెలుస్తోంది. ప్రమాద తీవ్రతను తగ్గించి చూపుతున్నారని హెచ్‌పీసీఎల్ వద్ద కార్మికుల బంధువులు ఆందోళనలకు దిగారు. చికిత్స పొందుతున్న 38 మందిలో అధికశాతం స్థానికులే. వీరిలో చాలామందికి ప్రమాదంలో కళ్లు కాలిపోయాయి. రక్తం తీవ్రంగా పోయింది. శరీర అవయవాలు కాలిపోవడంతో శ్వాస తీసుకునే పరిస్థితిలో లేరు. దీంతో ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని చెబుతున్నారు. హెచ్‌పీసీఎల్ ప్రమాద ఘటనపై విచారణ చేపట్టేందుకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్‌ఎఫ్) రంగంలోకి దిగింది. ప్రమాదంపై గుంటూరులో ఉన్న ఎన్‌డీఆర్‌ఎఫ్‌కి సమాచారమందించారు. శుక్రవారం రాత్రి ఒక బృందం విశాఖ చేరుకుంది. ప్రమాదానికి గల కారణాలతోపాటు ఘటనపై వీరు దర్యాప్తు చేపట్టనున్నారు. 50 నుంచి 80 శాతం కాలిన గాయాలతో బాధపడుతున్నవారి వివరాలు.. మామిడి శ్రీనివాస్, ఏడూరి వెంకట సత్యారావు, కృష్ణచంద్ర, ఎం.ప్రధాన్, జి.వరుణ్‌కుమార్, ఎ.అప్పలరాజు, ఎస్.సన్యాసిరావు, తోట రావు, శంకరరావు, బి.రమణ, సోమయ్య, అనంత్, ఎస్.మన్నా, అసిత్ ముండన్, మనోజిత్ ప్రధాన్, ఎన్.కొండయ్య, వై.సోములు, ఆర్.వెంకటరావు. కింద ఉన్నవారంతా మంటల బారిన పడ్డారు.. కూలింగ్ టవర్ కోసం 15 మీటర్ల ఎత్తులో ఇద్దరం పనిచేస్తున్నాం. కింద 40 మంది పనిచేస్తున్నారు. కిందన ఉన్నవారు ఒకవైపు వెల్డింగ్ పనులు చేస్తున్నారు. మరోవైపు సాల్ట్‌వాటర్ పట్టడానికి పైపింగ్ చేస్తున్నారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో ఒక్కసారిగా పైపులో నుంచి మంటలొచ్చాయి. కింద ఉన్నవారంతా మంటల బారిన పడ్డారు. ప్రమాదమెందుకు జరిగిందో తెలియదు. నేను, మరో కార్మికుడు పది నిమిషాల తర్వాత కిందకి దిగాం. చుట్టుపక్కల వారి సాయంతో కాలిపోయిన వారిని బయటికి తీసుకొచ్చాం. - ఎ.వెంకటరమణ, ప్రత్యక్ష సాక్షి, మంగళపాలెం, గాజువాక అకస్మాత్తుగా మంటలొచ్చాయి నేను గోపాల్ ఇంజనీరింగ్ కంపెనీకి చెందిన వర్కర్‌ను. 30 నుంచి 40 మంది వరకు కూలింగ్ టవర్ పనుల్లో ఉన్నాం. పైపులో నుంచి ఒక్కసారిగా మంటలొచ్చాయి. పరుగెత్తలేక మంటల్లోనే చిక్కుకుపోయాం. చివరికి ఎలాగోలా బయటపడ్డా. -ఎ.అప్పారావు, క్షతగాత్రుడు, దువ్వాడ రైల్వే స్టేషన్ ఏరియా ఎందుకు జరిగిందో తెలియదు కూలింగ్ టవర్ కోసం స్ట్రక్చర్‌పై స్ట్రక్చర్ వేస్తున్నాం. ఇంతలోనే పైపులో నుంచి మంటలొచ్చాయి. క్షణాల్లోనే వ్యాపించాయి. అసలు మంటలెందుకొచ్చాయో తెలియదు. - పి.వెంకటరావు, క్షతగాత్రుడు, బీసీ రోడ్డు, గాజువాక నిర్లక్ష్యంతోనే ప్రమాదం.. కూలింగ్ టవర్ ట్రయల్స్‌లో ఉంది. టవర్ పనులు చేస్తుండగా ఆరు నెలల క్రితం ఒకసారి, రెండు నెలల క్రితం ఒకసారి పైప్‌లైన్ లీకయింది. హై రిస్క్, హై టెంపరేచర్ గల ప్రమాదకర పరిశ్రమ ఇది. ఇక్కడ అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ముఖ్యంగా నైపుణ్యం గల సిబ్బందితో పనిచేయించాలి. కానీ యాజమాన్యం కాంట్రాక్టర్‌కు అప్పగించేసింది. నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగింది. మృతుల కుటుంబీకులకు రెగ్యులర్ ఉద్యోగమివ్వాలి. రూ.25 లక్షల నష్టపరిహారం చెల్లించాలి. గాయపడినవారికి రూ.5 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి. - అజయ్‌శర్మ, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, విశాఖపట్నం 1997 నాటి పీడకలను తలపిస్తూ.. గాజువాక, న్యూస్‌లైన్: విశాఖలోని హెచ్‌పీసీఎల్ రిఫైనరీలో శుక్రవారం చోటు చేసుకున్న ప్రమాదం పారిశ్రామిక ప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. భీతిల్లిన జనం 1997 సెప్టెంబర్ 14న జరిగిన ఘోర విస్ఫోటనాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. నాడు హెచ్‌పీసీఎల్‌లో స్పియర్ ట్యాంకులు పేలిపోవడంతో 62 మంది ఉద్యోగులు మృత్యువాత పడ్డారు. ఆ మంటలు నాలుగు రోజులకుగానీ అదుపులోకి రాలేదు. ఈ ఘటన తర్వాత యాజమాన్యం భద్రతా ప్రమాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అడపాదడపా ప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. మూడేళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో ముగ్గురు మరణించారు. చిన్నచిన్న ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా వెలుగులోకి రావడం లేదు. ప్లాంట్‌లోని సీడీ-3 యూనిట్‌లో ఈ ఏడాది మేలో జరిగిన ప్రమాదాన్ని ఇంకా మర్చిపోకముందే మళ్లీ ఇప్పుడు భారీ పేలుడు సంభవించడంతో పారిశ్రామిక ప్రాంత ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. ప్రమాదంపై విచారణకు సీఎం ఆదేశం సాక్షి, హైదరాబాద్: విశాఖపట్నం హెచ్‌పీసీఎల్ కాంప్లెక్స్‌లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక అందించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్, విశాఖ పోలీస్ కమిషనర్‌లను ఆదేశించారు. మృతులకు విజయమ్మ సంతాపం హెచ్‌పీసీఎల్ ప్రమాదంపై వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తీవ్రదిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కూడా మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement