
హెచ్‌పీసీఎల్ కూలింగ్ టవర్ పేలుడు అసలు ఎలా జరిగింది?
వారి గుండెలన్నీ కన్నీటి సంద్రాలయ్యాయి. ఎవరిని కదిపినా పెను విషాదం. ఆస్పత్రుల ఎదుట గాయపడి చికిత్స పొందిన బాధితుల ఆర్తనాదాలు, ఆవేదనలు...
వారి గుండెలన్నీ కన్నీటి సంద్రాలయ్యాయి. ఎవరిని కదిపినా పెను విషాదం. ఆస్పత్రుల ఎదుట గాయపడి చికిత్స పొందిన బాధితుల ఆర్తనాదాలు, ఆవేదనలు..శుక్రవారం జరిగినహెచ్‌పీసీఎల్ పేలుడు దుర్ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ప్రమాద స్థలంలో ఇంకెన్ని మృతదేహాలు బయట పడతాయో తెలియని అయోమయం. శనివారం కూలింగ్ టవర్ శిథిలాల కింద ఆరు మృతదేహాలు లభ్యమైనట్టు హెచ్‌పీసీఎల్ ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు మొత్తం ఎనిమిదిమంది మృతి చెందినట్టు ప్రభుత్వం, ప్లాంట్ వర్గాలు అధికారికంగా పేర్కొన్నాయి.
సాక్షి, విశాఖపట్నం : హెచ్‌పీసీఎల్ కూలింగ్ టవర్ పేలుడు అసలు ఎలా జరిగింది? ఆసమయంలో ఎంతమంది సజీవ సమాధి అయ్యారు? టవర్ నిర్మాణంలో వాడే చెక్క,దానికి రక్షణగా వాడే రసాయన షీట్లు ఎందుకు మండాయి. టవర్ పక్కనే ఉన్న కొండ ఓ వైపు భాగంలో మంటలు ఎందుకు చెలరేగాయి... పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు ఎలా సజీవసమాధి అయ్యారు? ఇవన్నీ బయట ప్రపంచానికి తెలియని వాస్తవాలు. సాక్షి వీటిని సేకరించగలిగింది. ప్లాంట్‌లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకుంది. చుట్టూ బొగ్గుగా మారిన మృతదేహాలు, ముక్కలుముక్కలుగా విడిపోతున్న వీటిని బయటకు లాగుతున్న సిబ్బందిని పలకరించింది.
ప్రమాదం నుంచి బతికి బయటపడిన ఇంజినీరింగ్ నిపుణులతో మాట్లాడగా నమ్మలేని నిజాలు వెల్లడయ్యాయి. వివరాల్లోకి వెళితే...పనులు పూర్తయిన టవర్‌లో జరిగిన హైడ్రాలిక్ టెస్ట్, వెల్డింగ్ పనులే కొంపముంచాయని ప్రాథమికంగా నిర్థారించారు. చమురుశుద్ధి ప్రక్రియలో నీరు అత్యంత ఉష్ణోగ్రతకు చేరుతుంది. ఈ నీటిని కూలింగ్ టవర్లకు పైపులైన్ల ద్వారా పంపి భారీ ఫ్యాన్లతో చల్లారుస్తారు. ఘటనా స్థలిలో ఇప్పటికే ఓ భారీ టవర్ ఉండగా దాని పక్కనే కొత్తదాన్ని నిర్మిస్తున్నారు. టవర్ నిర్మాణంలో ఇనుము వాడితే తప్పుపడుతుందన్న ఉద్దేశంతో దేవదారు చెక్కతోనే మొత్తం నిర్మిస్తారు.
భూమికి సమాంతరంగా ఐదడుగుల లోతు, నాలుగు మీటర్ల వెడల్పున ఐదు గొయ్యిలు (సంప్‌లు) తీస్తారు. ఈ సంప్‌లు కప్పి ఉంచేలా 50 అడుగుల ఎత్తున టవర్ నిర్మిస్తారు. టవర్‌పైన భారీ కూలింగ్ ఫ్యాన్ ఏర్పాటు చేస్తారు. టవర్ ఉపరితలం మొత్తాన్ని రబ్బరు, రసాయనాలు కలిపిన షీట్లతో కప్పుతారు. ప్రమాదం జరిగిన టవర్ పనులన్నీ పూర్తయ్యాయి. సంపులకు పైపులు కూడా బిగించేశారు. కొద్దిరోజుల్లో ప్రారంభించనున్నందున పైపుల్లో లీకులు కనుగొనేందుకు శుక్రవారం ఇంజినీర్లు హైడ్రాలిక్ టెస్ట్ నిర్వహిస్తున్నారు.
ఈ సమయంలో ఒత్తిడి పెరిగిపోయి మంటలు చెలరేగాయి. అదే సమయంలో టవర్‌పైన వెల్డింగ్ పనులు జరుగుతుండడంతో ఈ మంటలకు మరింత ఆజ్యం పోసినట్టయింది. మంటలు విస్తరించి కూలింగ్ ఫ్యాన్‌తోపాటు రబ్బరుతో కూడిన రసాయిన షీట్లకు అంటుకున్నాయి. టవర్‌లో ఉష్ణోగ్రత ఎక్కువై పేలుడు సంభవించింది. దీంతో పైన ఉన్న కూలింగ్‌ఫ్యాన్ ఎగిరి ముక్కలై పక్కనే ఉన్న కొండపై పడింది. దీంతో కొండప్రాంతంలో పలుచోట్ల మంటలు చెలరేగాయి. కొండభాగం కూడా ఈ కారణంగానే ధ్వంసమయింది.
ఈ దెబ్బకు టవర్‌పైన కూలింగ్ ఫ్యాన్ వద్ద పనిచేస్తున్న 12 మంది కార్మికులు నేరుగా సం ప్‌లో పడిపోయారు. మరో ముగ్గురు ఎగిరి దూరం గా పడ్డారు. పేలుడు తరువాత రసాయన షీట్లు, దేవదారు చెక్క, ఫ్యాన్ శకలాలు వీరిపై పడి అయిదడుగుల లోతున్న సంప్‌పూర్తిగా శిథిలాలతో నిండిపోయింది. ఒకటి, ఐదో నంబర్ షంపుల్లో ఎక్కువ మంది చిక్కుకున్నారు. వీటిని తొలగించేకొద్ది మృతదేహాలు బయటపడుతున్నాయి. శనివారం ఒక్కరోజే గుర్తుపట్టలేని విధంగా ఉన్న ఆరు మృతదేహాలను బయటకు తీశారు. శిథిలాలన్నీ తొలగిస్తే మరిన్ని మృతదేహాలు బయటపడే
అవకాశం ఉంది.