తగలబడుతున్న ఆయిల్ ట్యాంకర్లు (ఫైల్)
సాక్షి, మల్కాపురం(విశాఖపట్టణం) : హెచ్‌పీసీఎల్‌లో ఘోర విస్ఫోటనం చోటుచేసుకుని నేటికి సరిగ్గా 23 ఏళ్లయింది. ఘోర ప్రమాదం జరిగి 23 ఏళ్లు గడుస్తున్నా నేటికీ ఆ క్షణాలు స్థానికులను వెంటాడుతూనే ఉన్నాయి. 1997 సెప్టెంబర్ 14(ఆదివారం)వ తేదీ ఉదయం.. పారిశ్రామిక ప్రాంతవాసులు ఇంకా నిద్రలేవలేదు. తెల్లవారుజాము 5.40 గంటల సమయంలో ఒక్కసారిగా పెద్ద భూకంపం వచ్చినట్టు ఆ ప్రాంతంలో భూమి కదిలింది. పెద్దగా శబ్ధం రావడంతో.. ఏం జరిగిందా? అనుకుంటూ కళ్లు నులుముతూ జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ఇంతలో ఎదురుగా ఉన్న హెచ్‌పీసీఎల్ సంస్థ నుంచి పెద్ద ఎత్తున మంటలు, శబ్ధాలు రావడంతో జనం పరుగులు తీశారు. ఎవరికి వారు చెల్లాచెదురయ్యారు. భార్య ఒకచోట అయితే, భర్త మరో చోటుకు పరుగులు తీసి కొండలను లెక్కచేయక.. తెలియని ప్రాంతం అయినా ఎక్కిపోయారు. రెండు రోజులు గడిచినా వారు ఆ కొండల వద్దే కాలం గడపాల్సిన పరిస్థితి నెలకొంది. తిండి, నిద్రలేక అల్లాడి పోయారు.
ప్రమాదం జరిగిందిలా..
పోర్టు జెట్టీ వద్ద నిలిపి ఉంచిన ఓ నౌక నుంచి హెచ్‌పీసీఎల్‌కు గ్యాస్‌ను పైపులైన్ల ద్వారా అన్‌లోడ్ చేస్తున్నారు. సంస్థలో ఓ చోట గ్యాస్ లీక్ కావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో 61 మంది కార్మికులు మృతి చెందారు.
నష్ట నివారణ చర్యలు
1997 ముందు ఎప్పుడూ ఇటువంటి సంఘటన జరగలేదు. దీనికి తోడు సంస్థలో ప్రమాదం చోటుచేసుకుంటే అదుపు చేసే పరికరాలు తక్కువే. నేడు టెక్నాలజీతో పోల్చి చూసుకుంటే నాడు తక్కువ. అప్పట్లో చాలా సేపటికి గానీ మంటలు అదుపులోకి రాలేదు. ఈ ప్రమాదంలో చాలా మంది మృతి చెందిన తర్వాత హెచ్‌పీసీఎల్ సంస్థ జాగ్రత్తలు చేపట్టింది. భవిష్యత్‌లో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఎక్కడ గ్యాస్ లీకయినా ఆ వాల్వ్ కట్ అయిపోయేటట్టు.. ఆటోమెటిక్ వాల్వ్‌లను బిగించారు. అంతేకాకుండా ప్రమాదాలను ముందుగా గుర్తించేలా పరికరాలను అందుబాటులో ఉంచారు. పొరపాటున ప్రమాదం జరిగితే వెంటనే మంటలను ఆపేందుకు నీటి వాల్వ్‌లను ఏర్పాటు చేశారు. సంస్థలో ఏ చిన్న ప్రమాదం జరిగినా క్షణాల్లో సైరన్ మోగేలా చర్యలు తీసుకున్నారు. ఇలా నష్ట నివారణకు చర్యలు తీసుకున్నారు. హెచ్‌పీసీఎల్‌లో ఆ తర్వాత కొన్ని ప్రమాదాలు జరిగినా.. ఈ ఘోర ప్రమాదం తలచుకుంటే స్థానికులు ఇప్పటికీ గగుర్పాటుకు గురవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment