విశాఖపట్నం-మెడికల్, న్యూస్‌లైన్: హెచ్‌పీసీఎల్ ప్రమాదంలో మృతదేహాల గుర్తింపు ప్రక్రియ గందరగోళంగా మారింది. కూలింగ్ టవర్ పేలిన ఘటనలో అక్కడ పని చేస్తున్న వారిలో కొంతమంది కార్మికులు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయారు. దేహాలు పూర్తిగా మాడిపోవడంతో గుర్తించడం కష్టంగా మారింది. ఇటువంటి ఆరు మృతదేహాలు ప్రస్తుతం మెడికల్ కాలేజీ మార్చురీలో ఉన్నాయి. ఇవి ఎవరికి చెంది నవో తెలియని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో డీఎన్‌ఏ పరీక్షలే గత్యంతరం. ఇదిలా ఉంటే ప్రమాద ఘటనలో మరి కొంతమంది గల్లంతైనట్లు వార్తలు వస్తున్నాయి. తమ వారి వివరాల కోసం పలువురు మార్చురీకి వస్తున్నారు.
గుర్తుపట్టలేని విధంగా ఉన్న మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ఫోరెన్సిక్ వైద్యులపై పోలీసులు ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. మృతుల కుటుంబాలకు హెచ్‌పీసీఎల్ యాజమాన్యం నష్టపరిహారాన్ని ప్రకటించింది. అది అందాలంటే డీఎన్‌ఏ నివేదిక తప్పనిసరి. పోలీసులు తొందరపడుతున్నప్పటికీ.. ఎవరి దేహాలను ఎవరు తీసుకువెళ్తామని, డీఎన్‌ఏ పరీక్షల్లో నిర్ధారణ అనంతరమే తీసుకువెళతామని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. పరీక్షలు జరగకుండా వేరే వారి దేహాలను తీసుకువెళ్లి దహన సంస్కారాలు చేయడం సంప్రదాయాన్ని విరుద్ధమంటున్నారు.
మార్చురీలో ఆరు దేహాలలో ఒక దాని నుంచి డీఎన్‌ఏ పరీక్ష నిమిత్తం దంతాలతో పాటు తొడ, గుండె భాగాలలో అవశేషాలను సేకరించారు. దానిని ఒక కోల్డ్ చైన్ బాక్సులో భద్రపరచి డీఎన్‌ఏ పరీక్ష నిమిత్తం పోలీసులకు అప్పగించారు. ఆరు మృతదేహాల నుంచి డీఎన్‌ఏ శ్యాంపిల్స్ సేకరిస్తేనే కానీ మృతదేహాల గుర్తింపు ఒక కొలిక్కి వచ్చే అవకాశం లేదని వైద్యులు చెబుతున్నారు. కొద్దిరోజులు వేచి చూడడం ద్వారా గల్లంతైన వారి వివరాలు లభ్యమైతే అప్పుడు ఆరు దేహాలకు సంబంధించి ఆరు కుటుంబ సభ్యుల వివరాలు లభిస్తాయని, దీంతో వారందరికీ ఒకేసారి డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఏదేమైనా హెచ్‌పీసీఎల్ యాజమాన్యం నిర్లక్ష్యం, పోలీసులు అత్యుత్సాహంతో దేహాల గుర్తింపు గందరగోళంగా మారింది.
సెవెన్‌హిల్స్ నుంచి ముంబయికి ఒకరి తరలింపు
హెచ్‌పీసీఎల్ దుర్ఘటనలో తీవ్రం గా గాయపడి నగరంలో వివిధ కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న 38 మందిలో ఒకర్ని ఆదివారం సాయంత్రం మెరుగైన చికిత్స కోసం ముంబయి తరలించారు. 45 నుంచి 50 శాతం కాలిన గాయాలకు గురై సెవెన్‌హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నగరంలోని పెదగంట్యాడ దయాల్‌నగర్‌కు చెందిన పి.వెంకట్రావ్(44)ను ఆదివారం సాయంత్రం 7.15 గంటల సమయంలో ఎయిర్ అంబులెన్స్‌లో ముం బయిలోని నేషనల్ బర్న్స్ సెంటర్‌లకు తరలించారు. సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్న 14 మందిలో ప్రత్యేక చికిత్సకు తట్టుకునే శక్తి వెంకట్రావుకు మాత్రమే ఉండడంతో అతన్ని ముంబయి పంపించాలని నిర్ణయించినట్టు హెచ్‌పీసీఎల్ అధికారి ఒకరు తెలిపారు.
ఈ సంఘటనలో గాయపడి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో ఏడుగురిని మాత్రమే ముంబయిలోని నేషనల్ బర్న్స్ సెంటర్‌కు తరలించాలని ముంబయి నుంచి విశాఖ వచ్చిన వైద్యులు నిర్థారించారని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ముంబయి ప్రత్యేక చికిత్సకు ఎంపికచేసిన ఏడుగుర్ని ఒకేసారి విశాఖ నుంచి తరలించేందుకు తగిన సామర్థ్యం ఉన్న ఎయిర్ అంబులెన్స్‌ల సదుపాయం అందుబాటులో లేదు. నగరం నుంచి ఒకరిని మాత్రమే ముంబయి తరలించే ఎయిర్ అంబులెన్స్ అందుబాటులో ఉండడంతో ఆదివారం సాయంత్రం దానిలో వెంటరావును మాత్రమే ముంబయి తరలించారు.
సం..దేహాలు
Published Mon, Aug 26 2013 3:07 AM | Last Updated on Tue, Oct 9 2018 6:57 PM
Advertisement
Advertisement