cooling tower
-
పాల్వంచ KTPS కూలింగ్ టవర్ల కూల్చివేత
-
కేటీపీఎస్ 7వ దశలో అరుదైన రికార్డు
పాల్వంచ(భద్రాద్రి కొత్తగూడెం): కేటీపీఎస్ ఏడో దశ పనుల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఏడాదిన్నరలోనే కూలింగ్ టవర్‌ను పూర్తి చేసి ఈ రికార్డును సాధించారు. దేశంలోని 800 మెగావాట్ల విద్యుత్ కర్మాగారాల్లో కూలింగ్ టవర్‌ను ఇంత తక్కువ వ్యవధిలో నిర్మించడం విశేషం. రూ.5,200కోట్ల వ్యయంతో 800 మెగావాట్ల విద్యుత్ కర్మాగార పనులను బీహెచ్ఈఎల్ కంపెనీ నిర్వహిస్తోంది. కర్మాగారంలో ప్రాధాన్యత కలిగిన కూలింగ్ టవర్‌ను బీహెచ్ఈఎల్ సంస్థ పహార్పూర్ కంపెనీకి సబ్ కాంట్రాక్ట్ కింద అప్పగించింది. వాస్తవంగా కేటీపీఎస్ 7వ దశ పనులు 2015 జనవరిలో ప్రారంభం కాగా ఏడాదిన్నర ఆలస్యంగా కూలింగ్ టవర్ పనులు ప్రారంభించారు. ఆలస్యంగా పనులు చేపట్టడంతో కూలింగ్ టవర్ నిర్మాణం వెనుకబడుతుందని అధికారులు ఆందోళన చెందారు. కానీ,2016 జూలై 12న పనులు ప్రారంభించి డిసెంబర్ 30 నాటికి పూర్తి చేశారు.175 మీటర్ల ఎత్తులో విశాలమైన ఈ కట్టడాన్ని ఏడాదిన్నరలోనే పూర్తి చేసి రికార్డ్ సాధించడంతో అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఆగని మరణ మృదంగం
మల్కాపురం, న్యూస్‌లైన్: హెచ్‌పీసీఎల్ దుర్ఘటనలో మరణమృదంగం కొనసాగుతోంది. కూలింగ్ టవర్ కూలి తీవ్రంగా గాయపడిన కూలీల్లో మరో నలుగురు ఆదివారం మృత్యువాతపడ్డారు. దీంతో బాధిత కుటుంబాల్లో విషాదం అలముకుంది. ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 23కి చేరింది. ఒడిశా రాష్ట్రానికి చెందిన సుభాష్లోహ్రా (25) సంస్థలో భారత్ ఎనర్జీస్ సిస్టమ్‌లో కాంట్రాక్టు కార్మికునిగా పనిచేస్తున్నారు. ప్రమాదంలో 60 శాతం గాయాలైన ఇతన్ని సెవెన్‌హిల్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం కన్నుమూశాడు. పాతగాజువాక ఎంఎంటీసీ కాలనీకి చెందిన ఎం.వి.రమణ (45) డ్రిజ్జన్ ట్రూప్ సంస్థలో కళాసీగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతన్ని న్యూకేర్ ఆస్పత్రిలో చేర్పించగా మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు. కంచరపాలెం వివేకానంద వీధి ప్రాంతానికి చెందిన కె.తాతారావు (60) మణిపాల్ ఆస్పత్రిలో చనిపోయాడు. మరో బాధితుడు, పశ్చిమబెంగాల్‌కి చెందిన సంబుమన్నా (55) ముంబయి నేషనల్ బర్న్సెంటర్లో చికిత్స పొందుతూ శనివారం రాత్రి చనిపోయాడు. ఘటన జరిగినప్పటి నుంచి తమ వారి కోసం ఎదురు చూస్తున్న వీరి కుటుంబ సభ్యులకు చివరికి విషాదవార్తే మిగిలింది. ఒకే రోజు నలుగురు కార్మికులు మృత్యువాత పడడంతో మిగిలిన వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన ఎక్కువవుతోంది. నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో మరో పది మంది, ముంబయిలోని బర్న్ ఆస్పత్రిలో ఎనిమిది మంది చికిత్స పొందుతున్నారు. శిథిలాల తొలగింపు పూర్తి: కాగా, కూలింగ్ టవర్ ఐదు సంప్ల వద్ద శిథిలాల తొలగింపు పూర్తయిందని సంస్థ పీఆర్ఓ శర్మ ఓ ప్రకటనలో తెలిపారు. డెబ్రిస్‌ను వేరేచోటుకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడిన వారిలో సిహెచ్.అప్పలరెడ్డి, ఇ.ఈశ్వరరావు, దిలీప్ చక్రవర్తిల ఆరోగ్యం మెరుగు పడడంతో ఆదివారం వీరిని డిశ్చార్జి చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో మరో పది మంది చికిత్స పొందుతున్నారని, ముంబయిలోని బర్న్సెంటర్లో మరో ఎనిమిది మంది చికిత్స పొందుతున్నారని పీఆర్ఓ తెలిపారు. బాధిత కుటుంబాలకు చెల్లించాల్సిన రూ.3.6 కోట్ల నష్టపరిహారాన్ని కలెక్టర్‌కు ఇప్పటికే అందించినట్లు పేర్కొ న్నారు. -
హెచ్పీసీఎల్లో శిథిలాల తొలగింపు
మల్కాపురం, న్యూస్‌లైన్: హెచ్పీసీఎల్లో కూలింగ్ టవర్ వద్ద జరిగిన సంఘటనకు సంబంధించిన శిథిలాల తొలగింపు ప్రక్రియ ఆదివారం కూడా కొనసాగించారు. ఇందులో భాగంగా సంఘటన స్థలం వద్ద ఐదు సంప్పుల్లో ఉన్న వ్యర్థాలను క్రేన్, కాంట్రాక్ట్ కార్మికుల సాయంతో తొలగించారు. శుక్రవారం రాత్రి నుంచి శిథిలాల తొలగింపు ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. శనివారం తొలగింపు కార్యక్రమంలో భాగంగా సుమారు ఐదు మృతదేహాలను వెలికితీయగా, ఆదివారం తొలగింపులో మరో రెండు మృతదేహాలను గుర్తించినట్టు సమాచారం. కానీ దీనిని సంస్థ యాజమాన్యం నిర్థారించడం లేదు. అటువంటిదేమి లేదని శనివారంతోనే శిథిలాల కింద ఉన్న మృతదేహాలను తొలగించినట్టు వివరించారు. ఆదివారం తొలగింపు చేపట్టిన కార్యక్రమంలో ఎటువంటి మృతదేహాలు లభ్యం కాలేదని, కేవలం సంప్‌లో ఉన్న వ్యర్థాలను తొలగించామన్నారు. సోమవారం కూడా తొలగింపు ప్రక్రియ కొనసాగే అవకాశముంది. సంప్ల చుట్టూ చెక్కలు, ఇతర వ్యర్థాలు మండి భారీగా ఆ ప్రాంగణమంతా చెల్లాచెదురై వ్యర్థాలతో నిండిపోవడంతో ఆ వ్యర్థాలను తొలగింపు ప్రక్రియ కొనసాగిస్తారు. అధికారుల సమక్షంలో శిథిలాల తొలగింపు ప్రక్రియ చేపడుతున్నారు. మరికొందరు గల్లంతు ఒడిశా ప్రాంతానికి చెందిన కొంత మంది కార్మికులు హెచ్పీసీఎల్లో జరిగిన సంఘటనలో గల్లంతైనట్లు తెలుస్తోంది. వీరంతా పారిశ్రామిక ప్రాంతంలో శ్రీహరిపురం, గుల్లలపాలెం, రామ్‌నగర్, ములగాడ ప్రాంతాలకు చెందిన వారని స్థానికులు చెబుతున్నారు. శుక్రవారం ఉదయం విధులకు వెళ్లిన వీరు ఇంత వరకు తిరిగి రాలేదని వారు పేర్కొంటున్నారు. కానీ వీరు ప్రమాదంలో గాయపడ్డారో, లేదా సంఘటన గుర్తించి భయంతో ఎక్కడికైనా పారిపోయారో అర్థం కావడం లేదని స్థానికులు తెలుపుతున్నారు. దీనిపై సంస్థ యాజమాన్యం వద్దగాని, పోలీసుల వద్దగాని సమాచారం లేదని వారు తెలుపుతున్నారు. -
సం..దేహాలు
విశాఖపట్నం-మెడికల్, న్యూస్‌లైన్: హెచ్‌పీసీఎల్ ప్రమాదంలో మృతదేహాల గుర్తింపు ప్రక్రియ గందరగోళంగా మారింది. కూలింగ్ టవర్ పేలిన ఘటనలో అక్కడ పని చేస్తున్న వారిలో కొంతమంది కార్మికులు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయారు. దేహాలు పూర్తిగా మాడిపోవడంతో గుర్తించడం కష్టంగా మారింది. ఇటువంటి ఆరు మృతదేహాలు ప్రస్తుతం మెడికల్ కాలేజీ మార్చురీలో ఉన్నాయి. ఇవి ఎవరికి చెంది నవో తెలియని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో డీఎన్ఏ పరీక్షలే గత్యంతరం. ఇదిలా ఉంటే ప్రమాద ఘటనలో మరి కొంతమంది గల్లంతైనట్లు వార్తలు వస్తున్నాయి. తమ వారి వివరాల కోసం పలువురు మార్చురీకి వస్తున్నారు. గుర్తుపట్టలేని విధంగా ఉన్న మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ఫోరెన్సిక్ వైద్యులపై పోలీసులు ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. మృతుల కుటుంబాలకు హెచ్‌పీసీఎల్ యాజమాన్యం నష్టపరిహారాన్ని ప్రకటించింది. అది అందాలంటే డీఎన్ఏ నివేదిక తప్పనిసరి. పోలీసులు తొందరపడుతున్నప్పటికీ.. ఎవరి దేహాలను ఎవరు తీసుకువెళ్తామని, డీఎన్ఏ పరీక్షల్లో నిర్ధారణ అనంతరమే తీసుకువెళతామని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. పరీక్షలు జరగకుండా వేరే వారి దేహాలను తీసుకువెళ్లి దహన సంస్కారాలు చేయడం సంప్రదాయాన్ని విరుద్ధమంటున్నారు. మార్చురీలో ఆరు దేహాలలో ఒక దాని నుంచి డీఎన్ఏ పరీక్ష నిమిత్తం దంతాలతో పాటు తొడ, గుండె భాగాలలో అవశేషాలను సేకరించారు. దానిని ఒక కోల్డ్ చైన్ బాక్సులో భద్రపరచి డీఎన్ఏ పరీక్ష నిమిత్తం పోలీసులకు అప్పగించారు. ఆరు మృతదేహాల నుంచి డీఎన్ఏ శ్యాంపిల్స్ సేకరిస్తేనే కానీ మృతదేహాల గుర్తింపు ఒక కొలిక్కి వచ్చే అవకాశం లేదని వైద్యులు చెబుతున్నారు. కొద్దిరోజులు వేచి చూడడం ద్వారా గల్లంతైన వారి వివరాలు లభ్యమైతే అప్పుడు ఆరు దేహాలకు సంబంధించి ఆరు కుటుంబ సభ్యుల వివరాలు లభిస్తాయని, దీంతో వారందరికీ ఒకేసారి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఏదేమైనా హెచ్‌పీసీఎల్ యాజమాన్యం నిర్లక్ష్యం, పోలీసులు అత్యుత్సాహంతో దేహాల గుర్తింపు గందరగోళంగా మారింది. సెవెన్‌హిల్స్ నుంచి ముంబయికి ఒకరి తరలింపు హెచ్‌పీసీఎల్ దుర్ఘటనలో తీవ్రం గా గాయపడి నగరంలో వివిధ కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న 38 మందిలో ఒకర్ని ఆదివారం సాయంత్రం మెరుగైన చికిత్స కోసం ముంబయి తరలించారు. 45 నుంచి 50 శాతం కాలిన గాయాలకు గురై సెవెన్‌హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నగరంలోని పెదగంట్యాడ దయాల్నగర్కు చెందిన పి.వెంకట్రావ్(44)ను ఆదివారం సాయంత్రం 7.15 గంటల సమయంలో ఎయిర్ అంబులెన్స్‌లో ముం బయిలోని నేషనల్ బర్న్స్ సెంటర్లకు తరలించారు. సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్న 14 మందిలో ప్రత్యేక చికిత్సకు తట్టుకునే శక్తి వెంకట్రావుకు మాత్రమే ఉండడంతో అతన్ని ముంబయి పంపించాలని నిర్ణయించినట్టు హెచ్‌పీసీఎల్ అధికారి ఒకరు తెలిపారు. ఈ సంఘటనలో గాయపడి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో ఏడుగురిని మాత్రమే ముంబయిలోని నేషనల్ బర్న్స్ సెంటర్‌కు తరలించాలని ముంబయి నుంచి విశాఖ వచ్చిన వైద్యులు నిర్థారించారని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ముంబయి ప్రత్యేక చికిత్సకు ఎంపికచేసిన ఏడుగుర్ని ఒకేసారి విశాఖ నుంచి తరలించేందుకు తగిన సామర్థ్యం ఉన్న ఎయిర్ అంబులెన్స్‌ల సదుపాయం అందుబాటులో లేదు. నగరం నుంచి ఒకరిని మాత్రమే ముంబయి తరలించే ఎయిర్ అంబులెన్స్ అందుబాటులో ఉండడంతో ఆదివారం సాయంత్రం దానిలో వెంటరావును మాత్రమే ముంబయి తరలించారు. -
మళ్లీ మృత్యుజ్వాల
శుక్రవారం సాయంత్రం 4.15 గంటలు. హెచ్పీసీఎల్లో ఎప్పటిలాగే నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సముద్రం నుంచి నీరు పైపుల ద్వారా తోడి దాన్ని శుద్ధిచేసే కూలింగ్ టవర్ నిర్మాణ పనుల్లో పెద్ద సంఖ్యలో కార్మికులు తలమునకలై ఉన్నారు. ఉన్నట్టుండి ఆ సమయంలో ఒక్కసారిగా పేలుడు. ఆకాశాన్ని తాకి ఎగసిపడుతున్న అగ్నికీలలు... పనిచేస్తున్న కార్మికులు ఉన్నట్టుండి అల్లంతదూరం ఎగిరిపడ్డారు. ప్రమాద ఘటనాస్థలి రక్తంతో నిండిపోయింది. అరగంట తర్వాత చూస్తే చుట్టూ చెల్లాచెదురుగా పడిఉన్న క్షతగాత్రులు..వారి ఆర్తనాదాలు...పేకమేడలా కూలి కిందపడ్డ కూలింగ్ టవర్. ఇదీ శుక్రవారం సాయంత్రం హెచ్పీసీఎల్లో సంభవించిన భయానక ఘట్టం. మల్కాపురం/గాజువాక న్యూస్‌లైన్:హెచ్పీసీఎల్లో పేలుడుతో పరిసరాలు దద్దరిల్లిపోయాయి. క్షతగాత్రుల హాహాకారాలతో భయానక వాతావరణం నెలకొంది. ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు అంబులెన్సులు పిలిపించి వెనువెంటనే క్షతగాత్రులను విశాఖనగరంలోని పలు ఆస్పత్రులకు తరలించారు. అయిదు అంబులెన్స్‌లు బాధితులను తీసుకెళ్లాయి. ఈ వాహనాలు వెళ్లేటప్పుడు కార్మికుల కుటుంబాలు తమ వారి గురించి ఆరాతీస్తూ వాటి వెనుక పరుగులు తీశారు. కొన్ని అంబులెన్స్‌లు అయితే వేగంగా వెళ్లడంతో వాటివెనుక తలుపులు తెరుచుకుని అందులో పూర్తిగా కాలిపడి ఉన్న కార్మికులు కనిపించారు. దీంతో బాధితుల బంధువులు బోరున విలపించారు. మరోపక్క ప్రమాద ఘటనతో ప్లాంట్చుట్టూ పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. దీంతో వారిని చెదరగొట్టడానికి అధికారులు పెద్ద ఎత్తున పోలీసులను తీసుకువచ్చారు. ఆగ్రహించిన బాధితుల బంధువులు తమను లోపలకు పంపాలంటూ యాజమాన్యం,భద్రతా సిబ్బందితో గొడవకు దిగారు. దానివల్లేనా ప్రమాదం? కూలింగ్ టవర్ నిర్మాణ పనుల్లో భాగంగా సముద్రం నుంచి తోడిన నీటినుంచి నాఫ్తా వేపర్స్ కలిసి ఉంటాయని, అందువల్లే నిప్పురవ్వ పడిన వెంటనే మంటలు వ్యాపించాయని అక్కడ పనిచేస్తోన్న సైట్ ఇంజనీర్లు చెబుతున్నారు. అయితే మరికొందరు మాత్రం టవర్ పైభాగంలో ఎల్పీజీ సిలెండర్‌తో విధులు నిర్వహించడం వల్ల నిప్పురవ్వలు పడి సిలెండర్ దగ్ధమై మంటలు తీవ్రస్థాయికి చేరుకున్నాయని ప్రత్యక్ష సాక్షులు వివరిస్తున్నారు. అయితే 4.15 గంటల సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుందని, అప్పటికే కొంతమంది కార్మికులు విధుల నుంచి దిగిపోవడం వల్ల సురక్షితంగా బయటపడ్డారని భావిస్తున్నారు. ఈ ఏడాదిలో రెండోసారి ... : ఈ ఏడాదిలో హెచ్పీసీఎల్లో ఇది రెండో ప్రమాదం కావడంతో కార్మికులు భయాందోళన చెందుతున్నారు. నవరత్న హోదా కలిగిన సంస్థలోనే కార్మికుల ప్రాణాలకు భద్రత లేదని వారంతా ఆవేదన చెందుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో సంస్థలో సీడీ-3 విభాగంలో ప్లాజ్ లీకు కారణంగా పెద్ద శబ్దం వ్యాపించి అకాశాన్నంటే మంటలు వ్యాపించాయి. అదృష్టవశాత్తూ ఈ సంఘటన అర్థరాత్రి చోటు చేసుకోవడంతో ప్రాణనష్టం తప్పింది. 1997 సెప్టెంబర్ 14న జరిగిన విస్ఫాటన సంఘటన ఇప్పటికీ ఈ ప్రాంతానికి పీడకలగా మారింది. తాజా ప్రమాదం ప్రజల్లో మరింత భయాందోళనలను రేకెత్తించింది. పరిశ్రమల్లో ఉత్పత్తులను మరింతగా అధికం చేసేందుకు సంస్థలో పలు నూతన యూనిట్లను ఇరుకు ప్రదేశంలో నిర్మించడం వల్లే ఇటువంటి ప్రమాదాలు చోటుచేసుకుంటాయని పలు యూనియన్ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. సంస్థ ఉత్పత్తులపై ఉన్న శ్రద్ధ కార్మికుల ప్రాణ రక్షణపై లేదని వారు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. క్షతగాత్రులు వీరే... ప్రమాద ఘటనలో నలుగురు మృతి చెందినట్టు అనుమానిస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఒకరి మృతదేహం మాత్రమే లభ్యమయింది. 20 ఏళ్లుగా హెచ్పీసీఎల్లో షిప్ట్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న చండా మురళి(40) మృతదేహంగా గుర్తించారు. ఆయన ముంచింగిపుట్ మండలం కిలగాడ గ్రామానికి చెందినవారు మురళి ప్రహ్లాదపురంలో నివసిస్తున్నారు. ఆయన భార్య జయలక్ష్మి పోర్ట్ ఉద్యోగి. నాలుగో తరగతి చదువుతున్న కూతురు. యూకేజీ చదువుతున్న కుమారుడు ఉన్నారు. ఈ ఘటనలో 39మంది గాయపడ్డారు. వీరిలో 28మంది నగరంలోని న్యూ కేర్, ఓల్డ్ కేర్, మణిపాల్, సివెన్‌హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. న్యూ కేర్ ఆసుపత్రి ట్రామా సెంటర్లో మామిడి శ్రీనివాస్ (22), ఎదూరి వెంకట సత్యారావు(27), కృష్ణ చంద్ర (35), గున్నాబత్తుల వరుణ్‌కుమార్(20) ఉన్నారు. పాత గాజువాకకు చెందిన ఎం.వి.రమణ(45), శ్రీహరిపురానికి చెందిన పసంగి శ్రీనివాస్(23), రాయిగడకు చెందిన అనంత్(21),అజిత్ ముండన్ (20), పెదగంట్యాడకు చెందిన ఎస్.సోమయ్య (50), కోల్‌కత్తాకు చెందిన సంబు మన్నా (55) ఉన్నారు. వీరంతా గోపాల్ ఇంజనీరింగ్ కంపెనీకి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగులుగా చెబుతున్నారు. పాత కేర్ ఆసుపత్రిలో కోల్‌కత్తాకు చెందిన మురాఠి ప్రధాన్ (30), విశాఖకు చెందిన ఎ.అప్పలరాజు(21) మిందికి చెందినఎస్.సన్యాసిరావు (40), తోటరావు (40), శంకరరావు(40), బొడ్డపల్లి రమణ(40) చికిత్స పొందుతున్నారు. వీరంతా కాంట్రాక్ట్ ఉద్యోగులే. మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఎం.కొండలరావు(గొంతువానిపాలెం, గాజువాక), జి.మన్మధరెడి(బీసీ రోడ్డు, గాజువాక)్డ,మనోజిత్ ప్రధాన్(పశ్చిమబెంగాల్), కె.తాతారావు(కంచరపాలెం), వై.సోములు(చుక్కవానిపాలెం,గాజువాక, ఆర్.వెంకటరావు(మింది) ఉండగా, సెవెన్‌హిల్స్ ఆసుపత్రిలో సుబాష్ మాజి (32) (కాశీపూర్, ఒడిషా), ఎ.అప్పారావు(48)(దువ్వాడ రైల్వే స్టేషన్ ఏరియా), కె.రమణ(27)(కోరమండల్ గేట్), ఎ.శ్రీనివాసరావు(39)(బీసీ రోడ్డు, గాజువాక) పి.వెంకటరావు( దయాల్ నగర్, గాజువాక), ఎం.డి.ఇలియాస్(34) ఉన్నారు.