మళ్లీ మృత్యుజ్వాల | HPCL terrible event occurred | Sakshi
Sakshi News home page

మళ్లీ మృత్యుజ్వాల

Published Sat, Aug 24 2013 3:11 AM | Last Updated on Fri, Sep 1 2017 10:03 PM

మళ్లీ మృత్యుజ్వాల

మళ్లీ మృత్యుజ్వాల

శుక్రవారం సాయంత్రం 4.15 గంటలు. హెచ్‌పీసీఎల్‌లో ఎప్పటిలాగే నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సముద్రం నుంచి నీరు పైపుల ద్వారా తోడి దాన్ని శుద్ధిచేసే కూలింగ్ టవర్ నిర్మాణ పనుల్లో పెద్ద సంఖ్యలో కార్మికులు తలమునకలై ఉన్నారు.  ఉన్నట్టుండి ఆ సమయంలో ఒక్కసారిగా పేలుడు. ఆకాశాన్ని తాకి ఎగసిపడుతున్న అగ్నికీలలు... పనిచేస్తున్న కార్మికులు ఉన్నట్టుండి అల్లంతదూరం ఎగిరిపడ్డారు. ప్రమాద ఘటనాస్థలి రక్తంతో నిండిపోయింది. అరగంట తర్వాత చూస్తే చుట్టూ చెల్లాచెదురుగా పడిఉన్న క్షతగాత్రులు..వారి ఆర్తనాదాలు...పేకమేడలా కూలి కిందపడ్డ కూలింగ్ టవర్. ఇదీ శుక్రవారం సాయంత్రం హెచ్‌పీసీఎల్‌లో సంభవించిన భయానక ఘట్టం.
 
మల్కాపురం/గాజువాక న్యూస్‌లైన్:హెచ్‌పీసీఎల్‌లో పేలుడుతో పరిసరాలు దద్దరిల్లిపోయాయి. క్షతగాత్రుల హాహాకారాలతో భయానక వాతావరణం నెలకొంది. ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు అంబులెన్సులు పిలిపించి వెనువెంటనే క్షతగాత్రులను విశాఖనగరంలోని పలు ఆస్పత్రులకు తరలించారు. అయిదు అంబులెన్స్‌లు బాధితులను తీసుకెళ్లాయి. ఈ వాహనాలు వెళ్లేటప్పుడు కార్మికుల కుటుంబాలు తమ వారి గురించి ఆరాతీస్తూ వాటి వెనుక పరుగులు తీశారు. కొన్ని అంబులెన్స్‌లు అయితే వేగంగా వెళ్లడంతో వాటివెనుక తలుపులు తెరుచుకుని అందులో పూర్తిగా కాలిపడి ఉన్న కార్మికులు కనిపించారు. దీంతో బాధితుల బంధువులు బోరున విలపించారు. మరోపక్క ప్రమాద ఘటనతో ప్లాంట్‌చుట్టూ పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. దీంతో వారిని చెదరగొట్టడానికి అధికారులు పెద్ద ఎత్తున పోలీసులను తీసుకువచ్చారు. ఆగ్రహించిన బాధితుల బంధువులు తమను లోపలకు పంపాలంటూ యాజమాన్యం,భద్రతా సిబ్బందితో గొడవకు దిగారు.
 
 దానివల్లేనా ప్రమాదం?
 కూలింగ్ టవర్ నిర్మాణ పనుల్లో భాగంగా సముద్రం నుంచి తోడిన నీటినుంచి నాఫ్తా వేపర్స్ కలిసి ఉంటాయని, అందువల్లే నిప్పురవ్వ పడిన వెంటనే మంటలు వ్యాపించాయని అక్కడ పనిచేస్తోన్న సైట్ ఇంజనీర్లు చెబుతున్నారు. అయితే మరికొందరు మాత్రం టవర్ పైభాగంలో ఎల్‌పీజీ సిలెండర్‌తో విధులు నిర్వహించడం వల్ల నిప్పురవ్వలు పడి సిలెండర్ దగ్ధమై మంటలు తీవ్రస్థాయికి చేరుకున్నాయని ప్రత్యక్ష సాక్షులు వివరిస్తున్నారు. అయితే 4.15 గంటల సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుందని, అప్పటికే కొంతమంది కార్మికులు విధుల నుంచి దిగిపోవడం వల్ల సురక్షితంగా బయటపడ్డారని భావిస్తున్నారు.
 
ఈ ఏడాదిలో రెండోసారి ... : ఈ ఏడాదిలో హెచ్‌పీసీఎల్‌లో ఇది రెండో ప్రమాదం కావడంతో కార్మికులు భయాందోళన చెందుతున్నారు. నవరత్న హోదా కలిగిన సంస్థలోనే కార్మికుల ప్రాణాలకు భద్రత లేదని వారంతా ఆవేదన చెందుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో సంస్థలో సీడీ-3 విభాగంలో ప్లాజ్ లీకు కారణంగా పెద్ద శబ్దం వ్యాపించి అకాశాన్నంటే మంటలు వ్యాపించాయి. అదృష్టవశాత్తూ ఈ సంఘటన అర్థరాత్రి చోటు చేసుకోవడంతో ప్రాణనష్టం తప్పింది.

1997 సెప్టెంబర్ 14న జరిగిన విస్ఫాటన సంఘటన ఇప్పటికీ ఈ ప్రాంతానికి పీడకలగా మారింది. తాజా ప్రమాదం ప్రజల్లో మరింత భయాందోళనలను రేకెత్తించింది.  పరిశ్రమల్లో ఉత్పత్తులను మరింతగా అధికం చేసేందుకు సంస్థలో పలు  నూతన యూనిట్లను ఇరుకు ప్రదేశంలో నిర్మించడం వల్లే ఇటువంటి ప్రమాదాలు చోటుచేసుకుంటాయని పలు యూనియన్ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. సంస్థ ఉత్పత్తులపై ఉన్న శ్రద్ధ కార్మికుల ప్రాణ రక్షణపై లేదని వారు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
 
క్షతగాత్రులు వీరే...
 ప్రమాద ఘటనలో నలుగురు మృతి చెందినట్టు అనుమానిస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఒకరి మృతదేహం మాత్రమే లభ్యమయింది. 20 ఏళ్లుగా హెచ్‌పీసీఎల్‌లో షిప్ట్ ఇన్‌ఛార్జిగా పనిచేస్తున్న చండా మురళి(40) మృతదేహంగా గుర్తించారు. ఆయన ముంచింగిపుట్ మండలం కిలగాడ గ్రామానికి చెందినవారు మురళి ప్రహ్లాదపురంలో నివసిస్తున్నారు. ఆయన భార్య జయలక్ష్మి పోర్ట్ ఉద్యోగి. నాలుగో తరగతి చదువుతున్న కూతురు. యూకేజీ చదువుతున్న కుమారుడు ఉన్నారు. ఈ ఘటనలో 39మంది గాయపడ్డారు. వీరిలో 28మంది నగరంలోని న్యూ కేర్, ఓల్డ్ కేర్, మణిపాల్, సివెన్‌హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

న్యూ కేర్ ఆసుపత్రి ట్రామా సెంటర్‌లో మామిడి శ్రీనివాస్ (22), ఎదూరి వెంకట సత్యారావు(27), కృష్ణ చంద్ర (35), గున్నాబత్తుల వరుణ్‌కుమార్(20) ఉన్నారు. పాత గాజువాకకు చెందిన ఎం.వి.రమణ(45), శ్రీహరిపురానికి చెందిన పసంగి శ్రీనివాస్(23), రాయిగడకు చెందిన అనంత్(21),అజిత్ ముండన్ (20), పెదగంట్యాడకు చెందిన ఎస్.సోమయ్య (50), కోల్‌కత్తాకు చెందిన సంబు మన్నా (55) ఉన్నారు. వీరంతా గోపాల్ ఇంజనీరింగ్ కంపెనీకి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగులుగా చెబుతున్నారు.  పాత కేర్ ఆసుపత్రిలో కోల్‌కత్తాకు చెందిన మురాఠి ప్రధాన్ (30), విశాఖకు చెందిన ఎ.అప్పలరాజు(21) మిందికి చెందినఎస్.సన్యాసిరావు (40), తోటరావు (40), శంకరరావు(40), బొడ్డపల్లి రమణ(40) చికిత్స పొందుతున్నారు.

వీరంతా కాంట్రాక్ట్ ఉద్యోగులే. మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఎం.కొండలరావు(గొంతువానిపాలెం, గాజువాక),  జి.మన్మధరెడి(బీసీ రోడ్డు, గాజువాక)్డ,మనోజిత్ ప్రధాన్(పశ్చిమబెంగాల్), కె.తాతారావు(కంచరపాలెం), వై.సోములు(చుక్కవానిపాలెం,గాజువాక, ఆర్.వెంకటరావు(మింది) ఉండగా, సెవెన్‌హిల్స్ ఆసుపత్రిలో సుబాష్ మాజి (32) (కాశీపూర్, ఒడిషా), ఎ.అప్పారావు(48)(దువ్వాడ రైల్వే స్టేషన్ ఏరియా), కె.రమణ(27)(కోరమండల్ గేట్), ఎ.శ్రీనివాసరావు(39)(బీసీ రోడ్డు, గాజువాక) పి.వెంకటరావు( దయాల్ నగర్, గాజువాక), ఎం.డి.ఇలియాస్(34) ఉన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement