మల్కాపురం, న్యూస్‌లైన్: హెచ్‌పీసీఎల్ దుర్ఘటనలో మరణమృదంగం కొనసాగుతోంది. కూలింగ్ టవర్ కూలి తీవ్రంగా గాయపడిన కూలీల్లో మరో నలుగురు ఆదివారం మృత్యువాతపడ్డారు. దీంతో బాధిత కుటుంబాల్లో విషాదం అలముకుంది. ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 23కి చేరింది. ఒడిశా రాష్ట్రానికి చెందిన సుభాష్‌లోహ్రా (25) సంస్థలో భారత్ ఎనర్జీస్ సిస్టమ్‌లో కాంట్రాక్టు కార్మికునిగా పనిచేస్తున్నారు.
ప్రమాదంలో 60 శాతం గాయాలైన ఇతన్ని సెవెన్‌హిల్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం కన్నుమూశాడు. పాతగాజువాక ఎంఎంటీసీ కాలనీకి చెందిన ఎం.వి.రమణ (45) డ్రిజ్జన్ ట్రూప్ సంస్థలో కళాసీగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతన్ని న్యూకేర్ ఆస్పత్రిలో చేర్పించగా మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు. కంచరపాలెం వివేకానంద వీధి ప్రాంతానికి చెందిన కె.తాతారావు (60) మణిపాల్ ఆస్పత్రిలో చనిపోయాడు.
మరో బాధితుడు, పశ్చిమబెంగాల్‌కి చెందిన సంబుమన్నా (55) ముంబయి నేషనల్ బర్న్‌సెంటర్‌లో చికిత్స పొందుతూ శనివారం రాత్రి చనిపోయాడు. ఘటన జరిగినప్పటి నుంచి తమ వారి కోసం ఎదురు చూస్తున్న వీరి కుటుంబ సభ్యులకు చివరికి విషాదవార్తే మిగిలింది. ఒకే రోజు నలుగురు కార్మికులు మృత్యువాత పడడంతో మిగిలిన వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన ఎక్కువవుతోంది. నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో మరో పది మంది, ముంబయిలోని బర్న్ ఆస్పత్రిలో ఎనిమిది మంది చికిత్స పొందుతున్నారు. శిథిలాల తొలగింపు పూర్తి: కాగా, కూలింగ్ టవర్ ఐదు సంప్‌ల వద్ద శిథిలాల తొలగింపు పూర్తయిందని సంస్థ పీఆర్‌ఓ శర్మ ఓ ప్రకటనలో తెలిపారు. డెబ్రిస్‌ను వేరేచోటుకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రమాదంలో గాయపడిన వారిలో సిహెచ్.అప్పలరెడ్డి, ఇ.ఈశ్వరరావు, దిలీప్ చక్రవర్తిల ఆరోగ్యం మెరుగు పడడంతో ఆదివారం వీరిని డిశ్చార్జి చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో మరో పది మంది చికిత్స పొందుతున్నారని, ముంబయిలోని బర్న్‌సెంటర్‌లో మరో ఎనిమిది మంది చికిత్స పొందుతున్నారని పీఆర్‌ఓ తెలిపారు. బాధిత కుటుంబాలకు చెల్లించాల్సిన రూ.3.6 కోట్ల నష్టపరిహారాన్ని కలెక్టర్‌కు ఇప్పటికే అందించినట్లు పేర్కొ న్నారు.