‘హెచ్‌పీసీఎల్’ దుర్ఘటనలో మరో ఆరుగురి మృతి
హెచ్‌పీసీఎల్ పేలుడు దుర్ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 8 మంది మృతి చెందినట్టు ప్రభుత్వం, ప్లాంట్ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ప్రమాదం జరిగిన శుక్రవారం నాడు ఇద్దరు మృతి చెందారని, శనివారం కూలింగ్ టవర్ శిథిలాల కింద మరో ఆరుగురి మృతదేహాలు లభ్యమైనట్టు హెచ్‌పీసీఎల్ ప్రకటించింది. మృతి చెందిన వారు పది మందికి పైగా ఉన్నారని బాధితుల బంధువులు, ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మరోపక్క కూలింగ్ టవర్ శిథిలాల కింద చిక్కుకుని సజీవ సమాధైన వారు మరో 20 మంది వరకు ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
టవర్‌లో భాగంగా 5 అడుగుల లోతున నిర్మించిన అయిదు సంప్‌లు కూలిపోయి ఆ మేర శిథిలాలు ఏర్పడ్డాయి. శనివారం రాత్రి వరకు మూడడుగుల మేర తొలగించారు. అత్యంత కష్టంగా సాగుతోన్న ఈ ప్రక్రియ పూర్తికావడానికి మరో రెండు రోజులు పట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ దుర్ఘటనలో క్షతగాత్రులు 39 మందికి 40 నుంచి 70 శాతం వరకు కాలిన గాయాలైనట్లు వైద్యులు నిర్ధారించారు. 90 శాతానికిపైగా శరీరం కాలిపోయిన 9 మంది చికిత్సకు స్పందించని స్థితిలో ఉన్నారు. వారిని మెరుగైన వైద్యం కోసం ముంబైకి తరలించాలని యోచిస్తున్నారు. మరోవైపు మృతదేహాలు ఏమాత్రం గుర్తుపట్టడానికి వీల్లేని విధంగా కాలిపోయాయి. శనివారం వెలికితీసిన కార్మికుల మృతదేహాలైతే అగ్నికీలల ధాటికి మసైపోయాయి.
గ్యాస్ లీకేజీ వల్లే ప్రమాదం...
కూలింగ్ టవర్‌లోకి గ్యాస్ లీకేజీ వల్లే భారీ అగ్ని ప్రమాదం సంభవించినట్టు హెచ్‌పీసీఎల్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్(ఈడీ) వి.వి.ఆర్.నరసింహం వెల్లడించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కూలింగ్ టవర్‌కు వెళ్లే పైపుల్లోకి గ్యాస్ (హైడ్రో కార్బన్, మీథేన్, ఈథేన్, ప్రొఫేన్) లీకేజీ కావడంతో పేలుడు సంభవించినట్టు ప్రాథమిక నిర్ధారణకొచ్చినట్లు చెప్పారు. గ్యాస్ భారీ స్థాయిలో రావడంతో అలారం పనిచేయలేదన్నారు. దీనిపై విచారణ జరపనున్నట్టు తెలిపారు. 2009లో నిర్మించిన రెండో కూలింగ్ టవర్‌ను యూరో-4 నాణ్యతాప్రమాణాల మేరకు ఆధునీకరిస్తుండగా ఈ ప్రమాదం సంభవించిందన్నారు. దుర్ఘటన సమయంలో కూలింగ్ టవర్ వద్ద సుమారు వంద మంది పనిచేస్తున్నారని చెప్పారు.
శిథిలాల కింద ఆరుగురు ఉన్నట్టు గుర్తించామన్నారు. శిథిలాల తొలగింపులో పాల్గొన్న సిబ్బంది, ప్రమాదం నుంచి బయటపడిన ఇంజనీరింగ్ నిపుణులతో ‘సాక్షి’ మాట్లాడింది. పనులు పూర్తయిన టవర్‌లో నిర్వహించిన హైడ్రాలిక్ టెస్ట్, వెల్డింగ్ పనులే కొంప ముంచాయని వారు చెబుతున్నారు. హైడ్రాలిక్ టెస్ట్ సమయంలో ఒత్తిడి పెరిగిపోయి మంటలు చెలరేగాయి. అదే సమయంలో టవర్‌పైన వెల్డింగ్ పనులు కూడా ప్రమాదానికి దోహదం చేశాయి.
టవర్‌లో ఉష్ణోగ్రత ఎక్కువై పేలుడు సంభవించింది. టవర్‌పై కూలింగ్ ఫ్యాన్ వద్ద పనిచేస్తున్న 12 మంది కార్మికులు నేరుగా సంప్‌లో పడిపోయారు. మరో ముగ్గురు ఎగిరి దూరంగా పడ్డారు. శిథిలాలన్నీ తొలగిస్తే మరిన్ని మృతదేహాలు బయటపడొచ్చని భావిస్తున్నారు. కాగా, తమ వారేమయ్యారో చెప్పాలంటూ కుటుంబసభ్యులు, బంధువులు హెచ్‌పీసీఎల్ విశాఖ రిఫైనరీ ప్రవేశద్వారం వద్ద శనివారం ఆందోళనకు దిగారు.
మంత్రుల పరామర్శ...
కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ శనివారం సాయంత్రం విశాఖ చేరుకుని హెచ్‌పీసీఎల్‌లో సంఘటన స్థలికి వెళ్లి పరిశీలించారు. ఆయన వెంట కేంద్ర మంత్రులు పనబాక లక్ష్మి, పురందేశ్వరి, ఎంపీ సుబ్బరామిరెడ్డి, మంత్రులు గంటా శ్రీనివాసరావు, బాలరాజు ఉన్నారు. అంతకుముందు టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేత యనమల రామకృష్ణుడుతో కలసి హెచ్‌పీసీఎల్ ప్లాంట్‌కు వచ్చారు. తరువాత సెవెన్‌హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ఈ సమయంలో బాధిత కుటుంబానికి చెందిన కొయ్యాన గౌరమ్మ అనే మహిళ చంద్రబాబును నిలదీశారు. అధికారులతో మాట్లాడి వెళ్లిపోవడంగాకుండా బాధితుల కష్టాలేమిటో తెలుసుకునే ప్రయత్నం చేయాలన్నారు.
దర్యాపునకు ఆదేశం... పరిహారం ప్రకటన
హెచ్‌పీసీఎల్‌లో పేలుడు ఘటనపై ప్రత్యేకంగా దర్యాప్తు జరిపి పక్షం రోజుల్లో నివేదిక ఇవ్వాలని దర్యాప్తు అధికారి వి.వి.ఆర్.నరసింహంను ఆదేశించినట్లు మొయిలీ చెప్పారు. హెచ్‌పీసీఎల్ అతిథిగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మృతి చెందిన కూలింగ్ టవర్ ఇన్‌చార్జి మురళి కుటుంబానికి రూ. కోటి నష్టపరిహారం ప్రకటించారు.
కార్మికుల కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున పరిహారం, వారి పిల్లల చదువుకయ్యే ఖర్చు మొత్తం భరిస్తామని ప్రకటించారు. సెవెన్‌హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి పనబాక లక్ష్మి అనంతరం విలేకరులతో మాట్లాడారు. నివేదిక అందాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ప్రభుత్వ ఉన్నతాధికారులను సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు.