
‘ఆధార్’ లేదని వంట గ్యాస్ నిరాకరించొద్దు: మొయిలీ
బెంగళూరు: దేశం 2030 నాటికి ఇంధన స్వావలంబన సాధిస్తుందని పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ తెలిపారు. బెంగళూరులోని జ్ఞాన జ్యోతి ఆడిటోరియంలో శనివారం జరిగిన అఖిల భారత వాణిజ్య సమ్మేళనంలో మొయిలీ ప్రసంగించారు. 2020 నాటికి చమురు దిగుమతులు 50 శాతం తగ్గుతాయని అంచనా వేశారు. 2025 నాటికి 75 శాతం తగ్గుతాయని చెప్పారు. దేశంలో సహజ వాయువు, చమురు వనరులను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కెనడా, అమెరికా ఇలానే ఇంధన స్వావలంబన సాధించాయని తెలిపారు.
భారత విశిష్ట గుర్తింపు సంఖ్య (ఆధార్) లేదనే సాకుతో గ్యాస్ ఏజెన్సీలు వినియోగదారులకు వంట గ్యాస్ ఇవ్వడానికి నిరాకరించరాదని మొయిలీ అన్నారు. ప్రభుత్వ సబ్సిడీలను పొందడానికి ఆధార్‌ను నిర్బంధం చేయరాదని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో వంట గ్యాస్‌కు కూడా ఆ నిబంధన ఉండబోదని స్పష్టం చేశారు.