వీరప్ప మొయిలీని కలిసిన విజయశాంతి
న్యూఢిల్లీ: మెదక్ ఎంపి విజయశాంతి ఈ రోజు కేంద్ర మంత్రి, ఆంటోనీ కమిటీ సభ్యుడైన వీరప్ప మొయిలీని కలిశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై ఆమెను జూలై 31న టీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఆమె ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతోపాటు కాంగ్రెస్ పెద్దలను కలుస్తున్నారు. దాంతో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే భావన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో గత సోమవారం ఆమె రాష్ట్ర వ్యవహారాల సలహాదారు దిగ్విజయ్ సింగ్‌ని కలిశారు. ఆమెతో పాటు అంతకు ముందు టిఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన రఘునందన్ కూడా దిగ్విజయ్ సింగ్ను కలిశారు. వీరిద్దరూ కలిసి కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో విజయశాంతి ఈరోజు వీరప్ప మొయిలీని కలవడం చర్చనీయాంశమైంది.
రాజ్యసభ సభ్యురాలు, ఏఐసీసీ అధికార ప్రతినిధి రేణుకాచౌదరి మధ్యవర్తిత్వంతో విజయశాంతి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సోనియాను కలిసినప్పుడు మెదక్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసే అంశాన్ని కూడా ఆమె ఎదుట ప్రస్తావించినట్లు సమాచారం.