కాంగ్రెస్‌ను గెలిపించాలి: ఎపీ మొయిలీ
ఎత్తినహొళె పథకం నిర్విఘ్నంగా సాగాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలి: ఎపీ మొయిలీ
దొడ్డబళ్లాపురం : బయలుసీమ జిల్లాలకు శాశ్వత సాగు, తాగునీరందించే ఎత్తినహొళె పథకం నిర్విఘ్నంగా సాగాలంటే జిల్లా,తాలూకా పంచాయతీ ఎన్నికల్లో తప్పనిసరిగా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని స్థానిక ఎంపీ ఎం వీరప్ప మొయిలీ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ ఆయన దొడ్డ బళ్లాపురం తాలూకాలో దొడ్డబెళవంగల, కొడిగేహళ్లి, రాజఘట్ట, బాశెట్టిహళ్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చివరగా రాజఘట్టలో ఏర్పాటు చేయబడిన కాంగ్రెస్ అభ్యర్థి శ్యామల జీ లక్ష్మిపతి ఎన్నికల ప్రచార సభలో పాల్గొని మాట్లాడారు. ఆఫ్రికన్ విద్యార్థుల పై దాడి, ప్రతిదాడుల విషయానికి సంబంధించి మాట్లాడిన ఆయన ప్రభుత్వం ఆఫ్రికన్ విద్యార్థుల విషయంలో చట్టరీత్యా చర్యలు తీసుకుంటోందని అన్నారు. కార్యక్రమంలో బయాప అధ్యక్షుడు ఆర్‌జీ వెంకటాచలయ్య, ఎమ్మెల్యే వెంకట రమణయ్య, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు.