
ప్రధాని కోసం దుబారా ఖర్చులు
కేంద్ర మాజీ మంత్రి వీరప్పమొయిలీ
దొడ్డబళ్లాపురం, న్యూస్‌లైన్ : ప్రధాన మంత్రి నరేంద్రమోదీనికి రక్షణ పేరుతో బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం దుబారా ఖర్చులు చేస్తోందని మాజీ కేంద్రమంత్రి స్థానిక ఎంపీ ఎం వీరప్పమొయిలీ మండిపడ్డారు. వీరప్పమొయిలీ చిక్కబళ్లాపురం లోక్‌సభ స్థానానికి మళ్లీ ఎంపీగా ఎన్నికైన నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఇక్కడి ప్రభుత్వ అతిథి గృహం ఆవరణలో ఏర్పాటు చేసిన అభినందన సభలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా పాత్రికేయుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
యూపీఏ ప్రభుత్వం హయాంలో దుబారా ఖర్చులు చేశారని ఆరోపిస్తున్న బీజేపీ ప్రధానమంత్రి నివాసం నుంచి ఎయిర్‌పోర్టు వరకూ సొరంగ మార్గం నిర్మించే దిశలో కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని ఇందుకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కావాలంటే యూపీఏ హయాంలో ఖర్చులపై విచారణ చేయించుకోవచ్చని మొయిలీ సవాల్ చేశారు.
కాంగ్రెస్ పార్టీలో పలువురు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని మార్పు చేసి ప్రియాంక గాంధీకి పార్టీ పగ్గాలు ఇవ్వాలని డిమాండు చేస్తున్నారని ప్రశ్నించగా, అవి వారి వ్యకిగత అభిప్రాయాలు... వారు ప్రచారం కోసం ఇలా స్టేట్‌మెంట్లు ఇస్తుంటారు... పార్టీ ఓటమికి కేవలం రాహుల్ గాంధీ ఒక్కరే కారణం కాదన్న ఆయన, నాయకత్వ మార్పు అవసరం ఏమాత్రం లేదు. ఈ విషయాలు మా పార్టీ వ్యకిగత విషయాలు. ఇవన్నీ అధినేత్రి సోనియా చూసుకుంటారన్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటమిపాలైందని, పార్టీ భవిష్యత్ ఏంటని అడగ్గా కాంగ్రెస్ పార్టీ గతంలో అనేక ఓటములను చవి చూసిందని. ఇలాంటి వాటిని అధిగమించి మళ్లీ అధికారంలోకి రావడం కాంగ్రెస్‌కు కొత్తేమీ కాదన్నారు. పార్లిమెంట్‌లో ఉన్న 44 మంది ఎంపీలు సమర్థవంతంగా ప్రతిపక్ష పార్టీగా వ్యవహరిస్తామన్నారు.
కుమారస్వామి నన్ను ఓడించడానికే పోటీ :
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తనను ఓడించడానికే మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి చిక్కబళ్లాపురం స్థానం నుంచి పోటీ చేశారని వీరప్ప మొయిలీ ఆరోపించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యరి బచ్చేగౌడ, జేడీఎస్ అభ్యర్థి కుమారస్వామి కుమ్మక్కయ్యారని, తన ఓటమే లక్ష్యంగా పని చేశారన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తనను మోసం చేయలేదన్నారు.
ఓట్లు తక్కువగా వచ్చాయని తాను బాధపడడం లేదని, ఏది ఏమైనా గెలిచినందుకు తృపిగా ఉందన్నారు. శాయశక్తులా ప్రజలకు సేవచేస్తానని, జక్కల మడుగు పథకం పూర్తిచేసేవరకూ నిర్విరామంగా పని చేసానన్నారు. రాష్ట్రంలో ఏడీజీపీ, కమిషనర్ల మధ్య రాజుకుంటున్న వివాదాన్ని ముఖ్యమంత్రి క్షణం ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని మొయిలీ సీఎం సిద్ధరామయ్యకు సూచించారు. ఈ సందర్భంగా వీరప్పమొయిలీని స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే వెంకటరమణయ్య, మాజీ ఎమ్మెల్యే వెంకటాచలయ్య, నేతలు లింగనహళ్లి లక్ష్మిపతి, రంగరాజు, సత్యనారాయణ, శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.