
కమలానికే కిరీటం!
కమలానికే కిరీటం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికల్లో అంతా ఊహించినట్లే బీజేపీ పైచేయి సాధించేట్లుంది. సోమవారం సాయంత్రం వెలువడిన పలు ఎగ్జిట్ పోల్స్ అధికార కాంగ్రెస్ కంటే ప్రతిపక్ష బీజేపీకి నాలుగైదు సీట్లు ఎక్కువగా రావచ్చని అంచనా వేశాయి. నగరానికి చెందిన క్రియేటివ్ సెంటర్ ఫర్ సోషల్ అండ్ పొలిటికల్ స్టడీస్ (సీఓపీఎస్) బీజేపీకి 14 సీట్లు, కాంగ్రెస్‌కు పది, జేడీఎస్‌కు నాలుగు సీట్లు వస్తాయని పేర్కొంది. ఆ సంస్థ విడుదల చేసిన సర్వే అంచనాల ప్రకారం.... కేంద్ర మంత్రులు వీరప్ప మొయిలీ (చిక్కబళ్లాపురం), కేహెచ్. మునియప్ప (కోలారు)ల్లో ఓడిపోతారు.
ఆ రెండు స్థానాలతో పాటు హాసన, మండ్యల్లో జేడీఎస్ అభ్యర్థులు గెలిచే అవకాశాలున్నాయి. బీజేపీ ఖాతాలో చిక్కోడి, బిజాపుర, కొప్పళ, బళ్లారి, హావేరి, ధార్వాడ, ఉత్తర కన్నడ, దావణగెరె, శివమొగ్గ, ఉడిపి-చిక్కమగళూరు, తుమకూరు, మైసూరు, బెంగళూరు ఉత్తర, దక్షిణ నియోజక వర్గాలు పడనున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థులు బెల్గాం, బాగలకోటె, గుల్బర్గ, రాయచూరు, బీదర్, దక్షిణ కన్నడ, చిత్రదుర్గ, చామరాజ నగర, బెంగళూరు గ్రామీణ, బెంగళూరు సెంట్రల్ నియోజక వర్గాల్లో గెలిచే అవకాశాలున్నాయి.
11 వేల మందికి పైగా సిబ్బంది
మొత్తం 5700 మంది వలంటీర్లు, 5,600 మంది ఫీల్డ్ సిబ్బంది, వంద మంది ఫీల్డ్ వలంటీర్లు ఈ సర్వే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక ఫీల్డ్ వలంటీరు రెండేసి బూత్‌లలో సర్వేను నిర్వహించాడు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో 50 పోలింగ్ కేంద్రాల వద్ద ఎగ్జిట్ పోల్‌ను చేపట్టారు. మొత్తం 28 పార్లమెంటరీ నియోజక వర్గాల్లో 11,200 పోలింగ్ బూత్‌లలో ఈ సర్వేను నిర్వహించారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పురుషులు, మహిళలను కలుపుకొని, ఎవరికి ఓటేశారో అడగడం ద్వారా ఈ సర్వేను నిర్వహించారు. 59 శాతం మంది ఓటర్లు సిద్ధరామయ్య ప్రభుత్వం పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. 31 శాతం మంది అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఓటర్లలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రభావం బాగా కనిపించింది.