సంపాదకీయం: సందేహాలనూ, శంకలనూ రేకెత్తించడం తప్ప దేనికీ జవాబివ్వకుండా గుట్టుగా సాగిపోతున్న ఆధార్ కార్డు వ్యవహారంలో తొలిసారి స్పష్టత వచ్చింది. ఈ కార్డు ఏ సంక్షేమ పథకానికైనా, మరే ఇతర అవసరానికైనా తప్పనిసరి చేయడం తప్పని సుప్రీంకోర్టు సోమవారం ఒక పిటిషన్ విచారణ సందర్భంలో తేల్చిచెప్పింది. అటు కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ మోహన్ పరాశరన్ ఈ కార్డు తీసుకోవడం ఐచ్ఛికం మాత్రమేనని చెప్పారు.
ఆ మర్నాడే యూపీఏ ప్రభుత్వం మనసు మార్చుకుంది. ఆధార్‌పై సవరణలు కోరుతూ మళ్లీ సుప్రీం కోర్టును ఆశ్రయించబోతున్నట్టు చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ ప్రకటించారు. ఆధార్‌కోసం ఒక చట్టం కూడా తీసుకురావాలన్న యోచన ఉన్నదని చెప్పారు. ఆ చట్టంలో ఉండే నిబంధనలేమిటో తెలిసేవరకూ ఈ గందరగోళం సమసిపోయే అవకాశం లేనట్టే. మనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలున్నాయి. వాటికి మారుమూల పల్లెలవరకూ విస్తరించిన యంత్రాంగం ఉంది. కానీ, ఆధార్ సంగతేమిటో చెప్పే నాథుడే ఇన్నాళ్లూ కరువయ్యాడు. మూడేళ్లక్రితం ఈ కార్యక్రమం ప్రారంభించినప్పుడు చెప్పినదానికీ, ఇప్పుడు చేస్తున్నదానికీ ఎక్కడా పొంతనలేదు. ఏకులా వచ్చి మేకు అయినట్టు ఈ కార్డు సాధారణ ప్రజల్లో కల్లోలం సృష్టిస్తోంది. ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరువల్ల దేశంలో ఇప్పుడున్న కుల,మత అంతరాలకు...ధనిక, పేద తేడాలకు తోడు ఆధార్ కార్డున్నవారు, లేనివారనే కొత్త రకం వర్గీకరణ ఒకటి మొదలైంది. ప్రభుత్వం అందించే ఏ పథకమైనా ఆధార్ ఉంటేనే సాధ్యమని అధికారులు చెబుతున్నారు. మన రాష్ట్రంలో పేద విద్యార్థులకిచ్చే ఫీజు రీయింబర్స్‌మెంటు అయినా, వారికిచ్చే స్కాలర్‌షిప్‌లైనా, వంటగ్యాస్ అయినా ఆధార్ కార్డుతో ముడిపెట్టారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినరోజున ప్రధాని మన్మోహన్‌సింగ్ అరచేతిలో వైకుంఠం చూపారు.‘పేదలకు గుర్తింపు కోసం ఎలాంటి ఆధారాలూ లేకుండా పోతున్నాయి. వారు బ్యాంకు ఖాతా ప్రారంభించాలన్నా, రేషన్ కార్డు పొందాలనుకున్నా అసాధ్యమవుతున్నది. ఆధార్ కార్డు అలాంటి సమస్యలను పోగొడుతుంది’ అని చెప్పారు. తీరా రోజులు గడిచేకొద్దీ దాన్ని అన్నింటితోనూ ముడిపెట్టే ధోరణి పెరిగిపోయింది. వీలు కాలేదు గానీ... ప్రభుత్వాలు ‘ఆధార్ ఉంటే తప్ప గాలి పీల్చడానికి వీల్లేదు’అనే షరతు కూడా పెట్టేవి!
అసలు ఈ ఆధార్ కార్డు ప్రారంభించాలన్న ఆలోచన వెనకున్న ఆంతర్యమేమిటో ఎవరికీ అర్ధంకాదు. కేవలం పౌరులకు గుర్తింపునివ్వడమే దీని ఉద్దేశమనుకుంటే పొరపాటు. ఇప్పటికే పౌరులకు రేషన్ కార్డు, డ్రైవింగ్ లెసైన్స్, ఓటరు గుర్తింపు కార్డు, పాన్ కార్డు... ఇలా ఎన్నెన్నో గుర్తింపు కార్డులున్నాయి. వీటన్నిటి బదులూ ఇకపై ఈ కార్డునే ఉపయోగిస్తారా అనేది తేల్చిచెప్పరు. ఇప్పటికే ఉన్న సవాలక్ష కార్డుల పక్కకు ఇది కూడా వచ్చిచేరింది. అసలు ఇది కార్డా లేక విశిష్ట గుర్తింపు సంఖ్యా అన్న సంగతినే కేంద్ర ప్రభుత్వం తేల్చుకోలేదు. పార్లమెంటులో ఇంతవరకూ దీనిపై చర్చలేదు. ఇందుకు సంబంధించిన ఎలాంటి చట్టమూ తీసుకురాలేదు.
దాదాపు 75,000 కోట్ల రూపాయలు వ్యయమయ్యే ఈ కార్యక్రమం మాత్రం అవిచ్ఛిన్నంగా సాగిపోతోంది. ప్రతిదానికీ దాన్ని ముడిపెట్టి, కార్డు లేకపోతే ప్రభుత్వంనుంచి పొందే అన్ని రకాల సౌకర్యాలనూ నిలిపేస్తామన్న బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా కొన్ని జిల్లాల్లో వంటగ్యాస్ సబ్సిడీ మొత్తాన్ని వ్యక్తుల బ్యాంకు ఖాతాల్లో జమచేయడం కూడా మొదలైంది. ఆధార్ కార్డు లేనివారు రెట్టింపుపైగా చెల్లించి గ్యాస్ సిలెండర్ కొనుగోలు చేయాల్సివస్తోంది. భవిష్యత్తులో రేషన్ సరుకుల పంపిణీకి కూడా నగదు బదిలీ వర్తింపజేస్తారని, అందుకు ఆధార్ కార్డు వివరాలు అడుగుతారని తెలిసి ప్రజలు ఆందోళన పడుతున్నారు. ఇప్పుడున్న ప్రజా పంపిణీ వ్యవస్థలో లొసుగులున్నాయని, పేదలకు చేరాల్సిన ఆహార ధాన్యాలన్నీ దళారులపరమవుతున్నాయని అందరూ ఒప్పుకుంటున్నారు. కానీ, ఆ లోపాలను సవరించడానికి ఇది ఎలా తోడ్పడుతుందో అనూహ్యం. ఎందుకంటే, ఆధార్ కార్డుల జారీలో సైతం ఎన్నో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. నమోదు చేయించుకున్నవారికి కార్డులు రాకపోగా... కుక్క పేరునో, పిల్లి పేరునో కార్డులు జారీ అయిన సందర్భాలున్నాయి.
అసలు వ్యక్తుల వేలిముద్రలు, ఐరిస్ గుర్తింపు, బ్యాంకు ఖాతాలు, ఈమెయిల్, సెల్‌ఫోన్ వివరాలు సేకరించడం ఎందుకో, వాటి అవసరమేమిటో ప్రభుత్వం ఇంతవరకూ అధికారికంగా చెప్పలేదు. ఆధార్ నమోదు కేంద్రాలకు వెళ్లినప్పుడు ఒక నేరస్తుడినుంచి సేకరించే తరహాలో ఇవన్నీ తీసుకుంటున్నారు. నిజానికి ఇలా పౌరులనుంచి వివరాలు సేకరించడం మన దేశంలో మాత్రమే ప్రారంభం కాలేదు. లోగడ బ్రిటన్, ఆస్ట్రేలియా, అమెరికా కూడా ఈ తరహా కార్యక్రమాన్ని మొదలుపెట్టాయి. అయితే, హ్యాకింగ్ సర్వసాధారణంగా మారిన ఈ కాలంలో సర్వర్లలో నిక్షిప్తమైన పౌరుల డేటా ఉగ్రవాదులకు లేదా అసాంఘిక శక్తులకు చేరే ప్రమాదం ఉంటుందని గుర్తించి మధ్యలోనే అలాంటి ప్రయత్నాలను విరమించుకున్నాయి. ఇది పౌరుల వ్యక్తిగత వ్యవహారాల్లోకి జొరబడటమేనని, వారి ప్రాథమిక హక్కుల్లో జోక్యం చేసుకోవడమేనని గుర్తించినట్టు బ్రిటన్ ప్రధాని కామెరాన్ ప్రకటించారు. సేకరించిన డేటానంతా ధ్వంసం చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వానికి పౌరుల హక్కులపైనా, వారి క్షేమంపైనా ఏమాత్రం శ్రద్ధ ఉన్నా ఆ దేశాలు ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవాల్సివచ్చిందో ఆరా తీసేది. తన కార్యక్రమాన్ని సమీక్షించుకునేది. కానీ, ఆ పని చేయలేదు. పారదర్శకత పూర్తిగా కొరవడిన ఈ కార్యక్రమంపై సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతోనైనా యూపీఏ ప్రభుత్వం ఆలోచించాలి. దేశ ప్రజలకు ఇది చేసే మేలేమిటో తేల్చాలి. అవసరమైతే ప్రతిష్టకు పోకుండా ఆ కార్యక్రమాన్ని విరమించుకోవాలి.
ఆధార్ చుట్టూ ఎందుకీ గోప్యత?!
Published Thu, Sep 26 2013 12:50 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement