ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లతో కాంగ్రెస్ పార్టీకి దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క రాష్ట్రంలో మినహా ఎక్కడ సోదిలో కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది. దక్కుతుందనుకున్న ఢిల్లీ శాసన సభ కూడా అరవింద్ కేజ్రీవాల్ చీపురుతో ఊడ్చిపెట్టుకుని పోయే సరికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షరాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు తలలు పట్టుకున్నారు. దాంతో రానున్న లోక్సభ ఎన్నికలలోపు కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసేందుకు చేపట్టవలసిన చర్యల కోసం అత్యంత సన్నిహితులతో తల్లికొడుకులు సమావేశమై చర్చించారు. దీంతో కేంద్ర మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పలువురు కీలక వ్యక్తులను మంత్రి పదవులకు రాజీనామా చేయించాలని నిర్ణయించారు.
అందులోభాగంగానే కేంద్ర అడవులు, పర్యావరణ శాఖ మంత్రి జయంతి నటరాజన్ శనివారం రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను రాష్ట్రపతి వెంటనే ఆమోదించారు. ఆ శాఖ బాధ్యతలు వీరప్ప మొయిలీకి అప్పగించారు. అంతా చకచకా జరిగిపోయాయి. అయితే జయంతిని అనుసరించి మరో 10 మంది కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. కేంద్ర మంత్రులు తమ జేబుల్లో రాజీనామా పత్రాలను పెట్టుకుని తిరుగుతున్నట్లు 10 జనపథ్ రోడ్డులో సమాచారం. ఇంతకు రాజీనామా బాట పట్టనున్న 10 మంది కేంద్ర మంత్రులు గులాం నబీ ఆజాద్, జై రాం రమేష్, ఏ కే ఆంటోనీ, సల్మాన్ ఖుర్షీద్ లాంటి వాళ్లు కూడా ఉన్నట్లు సమాచారం.