కాంగ్రెస్‌కు జయంతి షాక్ | Jayanthi Natarajan quits Cong, says she was only doing Rahul’s bidding | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు జయంతి షాక్

Published Sat, Jan 31 2015 2:58 AM | Last Updated on Sat, Aug 25 2018 4:39 PM

కాంగ్రెస్‌కు జయంతి షాక్ - Sakshi

కాంగ్రెస్‌కు జయంతి షాక్

* నాయకత్వంపై తీవ్ర ఆరోపణలు.. పార్టీకి రాజీనామా
* పర్యావరణ అనుమతుల్లో రాహుల్ జోక్యం చేసుకునేవారు
* కీలక ప్రాజెక్టులపై ‘సూచనలు’ పంపేవారు
* పార్టీ సేవల కోసమని మంత్రి పదవికి రాజీనామా చేయించారు

 
చెన్నై/న్యూఢిల్లీ: కేంద్ర పర్యావరణ శాఖ మాజీ మంత్రి జయంతి నటరాజన్ కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చారు! కాంగ్రెస్ అగ్రనాయకత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తూ పార్టీ నుంచి వైదొలిగారు. ఏకంగా పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. యూపీఏ హయాంలో కీలకమైన ప్రాజెక్టులకు పర్యావరణ, అటవీ అనుమతుల విషయంలో రాహుల్ జోక్యం చేసుకునేవారని గుట్టును బయటపెట్టారు. దీంతో అటు కాంగ్రెస్ గొంతులో పచ్చివెలక్కాయ పడగా.. ఇటు అధికార బీజేపీ చేతికి కొత్త అస్త్రాలు అందాయి. యూపీఏ హయాంలో ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులపై సమీక్ష జరుపుతామని కేంద్రం సంకేతాలు పంపగా.. సరిగ్గా ఢిల్లీ ఎన్నికల ముంగిట జయంతి ఈ ఆరోపణలు చేయడంలో ఆంతర్యమేంటని కాంగ్రెస్ ప్రశ్నించింది.
 
 రాహుల్ వల్లే తప్పుకుంటున్నా...
 రాహుల్‌గాంధీ తీరు వల్లే మనస్తాపానికి గురై పార్టీ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని జయంతి నటరాజన్ చెప్పారు. అనుమతులపై రాహుల్ నుంచి వచ్చిన ‘సూచనలు’ పాటించానని, అయినా పార్టీ తనను అవమానాలకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపినట్లుగా తెలిపారు. శుక్రవారం ఆమె చెన్నైలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘ఇబ్బందికర పరిస్థితుల్లో కొనసాగలేకే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశా. తమిళనాడు కాంగ్రెస్ ట్రస్టీ పదవి నుంచి కూడా తప్పుకుంటున్నా. నేను మంత్రిగా ఏ తప్పూ చేయలేదు. దీనిపై ఎలాం టి విచారణ ఎదుర్కొనడానికైనా సిద్ధంగా ఉన్నా. తప్పు చేసినట్టు తేలితే జైలుకెళ్లడానికైనా, ఉరిశిక్షకైనా సిద్ధమే’’ అని స్పష్టంచేశారు.
 
 తాను ఏ పార్టీలో చేరబోవడం లేదని చెప్పారు. కొందరు బీజేపీ నేతలను కలిసినట్టు వచ్చిన వార్తలను ఖండించారు. యూపీఏ-2 లో పర్యావరణ, అటవీశాఖ మంత్రి(ఇండిపెండెంట్)గా పనిచేసిన జయంతి, 2013, డిసెంబర్‌లో రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ‘పర్యావరణ అనుమతులపై నేను చట్టాలు, పార్టీ సిద్ధాంతానికి అనుగుణంగా వ్యవహరించా. నావైపు నుంచి ఎలాంటి తప్పులేదు. వేదాంత ప్రాజెక్టు విషయంలో ఆదివాసీల హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకున్నా. ముఖ్యమైన ప్రాజెక్టులకు అనుమతుల విషయంలో స్వచ్ఛంద సంస్థలు లేవనెత్తిన అభ్యం తరాలను ప్రముఖంగా పేర్కొంటూ రాహుల్ నుంచి సందేశాలు అందాయి’’ అని జయంతి నటరాజన్ వివరించారు. పార్టీ ఆదేశాల మేర కు మంత్రి పదవికి రాజీనామా చేసిన వెంటనే రాహుల్ కార్యాలయం కేంద్రంగా తనను ఇబ్బంది పెట్టే చర్యలు కొనసాగాయన్నారు. కొందరు బడా పారిశ్రామిక వేత్తల ఒత్తిళ్లకు తలొగ్గి రాహుల్ ఫిక్కీలో తనకు వ్యతిరేక  వ్యాఖ్యలు చేశారన్నారు. తన తప్పేంటో తెలుసుకునేందుకు సోనియాను, రాహుల్‌ను కలిసేం దుకు అనేకసార్లు ప్రయత్నించినా వారు భేటీకి నిరాకరించారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌తో మూడు దశాబ్దాల అనుబంధం ఉన్న తనను... పార్టీ సేవల పేరుతో మంత్రి పదవి నుంచి తొలగించారని, తర్వాత 11 నెలలపాటు పార్టీకి దూరంపెట్టడం ఆవేదనకు గురిచేసిందన్నారు.
 
 రాహుల్‌ను వెనకేసుకొచ్చిన కాంగ్రెస్

 జయంతి ఆరోపణల నేపథ్యంలో రాహుల్‌ను కాంగ్రెస్ వెనకేసుకొచ్చింది. అమె అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆ పార్టీ నేతలు విమర్శించారు. ఆమె అవినీతికి పాల్పడ్డారంటూ ‘జయంతి ట్యాక్స్’ పేరుతో లోక్‌సభ ఎన్నికల ముంగిట బీజేపీ విమర్శలు గుప్పించడంతోనే రాజీనామా చేయించాల్సి వచ్చిందన్నారు. పర్యావరణ శాఖలో రాహుల్ జోక్యం చేసుకునేవారన్న ఆరోపణలను జయంతి నటరాజన్‌కు ముందు అదే శాఖకు మంత్రిగా పనిచేసిన జైరాం రమేశ్, ఆమె తర్వాత మంత్రి గా కొనసాగిన ఎం.వీరప్పమొయిలీ ఖండించారు.
 
 రాహుల్‌గానీ, సోనియాగానీ ఏనాడూ తమ విధులు, నిర్ణయాల్లో జోక్యం చేసుకునేవారు కాదని వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముంగిట ‘కొత్త రాజకీయ బాసులు’ చెప్పినట్టు ఆమె నడుచుకుంటున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ మండిపడ్డారు. ఆమెపై చట్టపరం గా చర్యలు తీసుకునేందుకు తగిన సాక్ష్యాలు లేనందునే చివరికి మంత్రి పదవి నుంచి తొలగించాల్సి వచ్చిందన్నారు. దురుద్దేశంతోనే రాహుల్‌పై జయంతి ఆరోపణలు చేశారని, ఈ అంశాలను ఏడాది కాలంగా పార్టీ వేదికలపై ఎందుకు ప్రస్తావించలేదని అధికార ప్రతినిధి పీసీ చాకో ప్రశ్నించారు.
 
 సోనియాకు జయంతి రాసిన లేఖలోని ముఖ్యాంశాలివీ..
పర్యావరణాన్ని పరిరక్షించాలి, పర్యావరణం-పరిశ్రమల మధ్య సమతూకం పాటించాలన్న దివంగత ఇందిర, రాజీవ్‌ల స్ఫూర్తికి అనుగుణంగానే నేను నా శాఖ విధులు నిర్వర్తించాను. ఎన్‌ఏసీ చైర్‌పర్సన్‌గా  ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు తదితర అంశాలపై మీరు లేఖలు రాశారు. ప్రాజెక్టులకు అనుమతుల విషయంలో రాహుల్‌గాంధీ కార్యాలయం నుంచి ‘ప్రత్యేక వినతులు’ వచ్చేవి. వాటిని నేను గౌరవించాను.
     పర్యావరణ, అటవీశాఖలకు స్వతంత్ర హోదాలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో.. 2013, డిసెంబర్ 20న ప్రధాని మన్మోహన్‌సింగ్ నన్ను పిలిచారు. నేను వెళ్లగానే ఆయన లేచి నిలబడ్డారు. కాస్త ఆందోళన, వ్యాకులతతో కనిపించారు. ‘జయంతి, మీ సేవలు పార్టీకి అవసరమని పార్టీ అధ్యక్షురాలు సోనియా నాతో చెప్పారు’ అని అన్నారు. నాకు అర్థం కాలేదు. ‘‘సరే సర్, అయితే నేనేమి చేయాలి’ అని అడిగా. ‘ఆమె(సోనియా) మిమ్మల్ని రాజీనామా చేయాలన్నారు’ అని ప్రధాని అన్నారు. నేను ఒక్కసారిగా షాక్‌కు గురయ్యా. ‘రాజీనామా..?ఎప్పుడు సర్?’ అని అడిగా. ‘ఈరోజే’ అని ప్రధాని బదులిచ్చారు. నేను ఒక్కమాట మాట్లాడలేదు. ‘అయితే సరే’ అని నవ్వుతూ చెప్పా. మీపై పూర్తి విశ్వాసంతో రాజీనామా చేశా.
     ఈలోగానే నాకు ఆశ్చర్యం కలిగించే విషయం తెలిసింది. నేను రాజీనామా చేసిన తర్వాత మీడియాలో నాకు వ్యతిరేకంగా వార్తలు వచ్చాయి. నేను రాజీనామా చేసిన మరుసటి రోజే రాహుల్‌గాంధీ ఫిక్కీ సమావేశంలో మాట్లాడుతూ.. పర్యావరణ అనుమతుల విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. ఫిక్కీలో రాహుల్ ఆ మాటలు చెప్పేందుకే మీతో రాజీనామా చేయించారా అని మీడియా నన్ను అడిగింది.
     అనుమతుల విషయంలో నేను ఎప్పుడూ అవరోధంగా నిలవలేదు. ముఖ్యమైన ప్రాజెక్టులకు అనుమతుల  జాప్యంలో నేను బాధ్యురాలిని కాదు. ఈ విషయాన్ని నిరూపించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నాపై జరుగుతున్న దాడితో తీవ్రంగా కలత చెందా. నా రాజీనామా, ఫిక్కీలో ప్రసంగంపై నేను రాహుల్‌కి ఒక మెసేజ్ పంపా. ఇలా చేయడానికి నేను చేసిన తప్పేమిటని అడిగా. నేనేమైనా తప్పు చేసి ఉంటే.. వివరణ అడగాల్సిందని వేడుకొన్నా. ఆయనను కలుసుకునేందుకు సమయం కావాలని అడిగా. ‘నేను కాస్త బిజీగా ఉన్నా. మళ్లీ కలుద్దాం’ అని రాహుల్ బదులిచ్చారు.
     ‘స్నూప్‌గేట్’ విషయంలో ఇప్పటి ప్రధాని మోదీపై దాడి చేయాల్సిందిగా నాకు సూచించారు. తొలుత నేను అం దుకు నిరాకరించా. నేను అప్పడు మంత్రిగా ఉన్నందున ప్రభుత్వం తరఫున దీనిపై మాట్లాడేందుకు తిరస్కరించా.  ఇది ‘ఉన్నతస్థాయిలో తీసుకున్న నిర్ణయం’ అని పార్టీ నాయకత్వం చెప్పటంతో. తప్పనిసరై దానిపై మాట్లాడాల్సి వచ్చింది.
 (ఈ లేఖను జయంతి నటరాజన్
 2014 నవంబర్ 5న సోనియాకు రాశారు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement