జయంతి రాజీనామా
పార్టీ సేవ కోసం కేంద్ర మంత్రి పదవికి గుడ్‌బై
ఆమె రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి
జయంతి బాటలో మరికొందరు మంత్రులు...?
త్వరలో ఏఐసీసీలోనూ మార్పులు
రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ అధిష్టానం చేపట్టిన సన్నాహకాల్లో భాగం గా కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సహాయమంత్రి (స్వతంత్ర హోదా) జయంతి నటరాజన్ (59) శనివారం తన పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నుంచి వచ్చిన సూచనల ప్రకారమే ఆమె పార్టీ కోసం పనిచేసేందుకు మంత్రి పదవిని వదులుకున్నట్టు తెలుస్తోంది. జయంతి రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారని, ఆమె పర్యవేక్షించిన మంత్రిత్వశాఖ బాధ్యతలను పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీకి అదనంగా అప్పగించారని రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో తెలిపింది. రాజీనామా అనంతరం జయంతి మీడియాతో మాట్లాడుతూ ‘‘లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా పార్టీ కోసం పనిచేయడానికి నా అభీష్టాన్ని వ్యక్తీకరించాను. ఏ స్థాయిలో నా సేవలను ఉపయోగించుకుంటారనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. తమిళనాడుకు చెందిన రాజ్యసభ సభ్యురాలైన జయంతిని రెండేళ్ల క్రితం కేబినెట్‌లోకి తీసుకున్నారు. అయితే పలు భారీ పరిశ్రమలకు పర్యావరణ అనుమతుల మంజూరులో జయంతి జాప్యం చేయడంపై పరిశ్రమ వర్గాల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడమే ఆమె రాజీనామాకు దారితీసినట్లు వార్తలు గుప్పుమన్నాయి.
అదే బాటలో మరికొందరు...
ఇక జయంతి బాటలోనే మంత్రివర్గం నుంచి మరి కొందరు కూడా తప్పుకుని పార్టీ పనుల్లో చురుగ్గా పాల్గొనడానికి సిద్ధమవుతున్నారని కాంగ్రెస్ వర్గాల్లో గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఈ జాబితాలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేశ్, కార్పొరేట్ వ్యవహారాల సహాయమంత్రి (స్వతంత్ర హోదా) సచిన్ పైలట్, రక్షణ శాఖ సహాయ మంత్రి జితేందర్‌సింగ్, హోంశాఖ సహాయమంత్రి ఆర్.పి.ఎన్.సింగ్ తదితరులున్నారు.
ఏఐసీసీ పునర్వ్యవస్థీకరణపైనా దృష్టి
ప్రభుత్వం నుంచి మంత్రులను పార్టీకి తీసుకురావడంతోపాటు... పార్టీలోనూ ప్రక్షాళనకు రంగం సిద్ధమవుతోందని, ఇందులో భాగంగా పనిచేయని నేతలకు ఉద్వాసన పలుకుతారని తెలుస్తోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ త్వరలోనే ఏఐసీసీ పునర్వ్యవస్థీకరణ జరగవచ్చని పార్టీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సచిన్ పైలట్‌ను రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడిగా పంపవచ్చని ఊహాగానాలు సాగుతున్నాయి. రాహుల్ కోటరీలో ఒకరైన జితేందర్ సింగ్‌కు త్వరలో జరిగే పార్టీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రధాన కార్యదర్శి బాధ్యతలను అప్పగిస్తారని అంటున్నారు. ఆయన గతంలో ఏఐసీసీ కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్న అశోక్ తన్వర్‌ను హర్యానా పీసీసీ అధ్యక్షుడిగా పంపుతారని ప్రచారం సాగుతోంది.