కాంగ్రెస్ కు జయంతి నటరాజన్ గుడ్బై!
న్యూఢిల్లీ : కేంద్ర మాజీమంత్రి జయంతి నటరాజన్ కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పనున్నారు. శుక్రవారం సాయంత్రం ఆమె కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నారు. జయంతి నటరాజన్ తన నిర్ణయాన్ని ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు మీడియా సమావేశంలో వెల్లడించనున్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
రాహుల్ గాంధీ సూచనలు పాటించినా 2013లో కేబినెట్ నుంచి తనను బలవంతంగా తప్పించారని జయంతి నటరాజన్ విమర్శించారు. రాహుల్ కార్యాలయంలోనే తనపై కుట్ర పథకం సిద్ధమైందని ఆమె ఆరోపించారు. వివిధ సందర్భాల్లో పార్టీ అగ్ర నాయకత్వం వేధించిందని జయంతి నటరాజన్ వ్యాఖ్యానించారు.
కాగా గత ఏడాది నవంబర్లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఆమె లేఖ రాశారు. ఆ లేఖ తాజాగా మీడియాకు లీకైంది. పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి తనను తప్పించడానికి కారణాలు వెల్లడించలేదని, సోనియాగాంధీ, రాహుల్ గాంధీని కలిసేందుకు ప్రయత్నించినా అపాయింట్ మెంట్ ఇవ్వలేదని జయంతి ఈ సందర్భంగా ఆ లేఖలో ఘాటుగా విమర్శలు చేసినట్లు తెలుస్తోంది.