రాహుల్ కారణంగానే...జయంతి నటరాజన్
చెన్నై : ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో విలువలు లేవని కేంద్ర మాజీమంత్రి, పార్టీ సీనియర్ నేత జయంతి నటరాజన్ వ్యాఖ్యానించారు. ఆమె శుక్రవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఒకప్పటి కాంగ్రెస్ వేరు...ఇప్పటి కాంగ్రెస్ వేరు అని అన్నారు. కాంగ్రెస్లో కొనసాగడంపై పునరాలోచన చేయాల్సి వచ్చిందన్నారు. మనకు తెలిసిన కాంగ్రెస్ ఇది కాదని... చాలా మరిపోయిందని జయంతి నటరాజన్ అన్నారు.
గత 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నానని, తన నరనరానా కాంగ్రెస్ రక్తం ప్రవహిస్తోందని జయంతి నటరాజన్ అన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీని వీడటం బాధాకరమన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయటం భావోద్వేగంతో కూడిన నిర్ణయమని ఆమె అన్నారు. కాంగ్రెస్ పార్టీ తనకు ఇచ్చిన అవకాశాలకు జయంతి నటరాజన్ కృతజ్ఞతలు తెలిపారు.
పర్యావరణ అనుమతుల విషయంలో రాహుల్ గాంధీ చెప్పిన సూచనలు చేసినా కేబినెట్ నుంచి తనను బలవంతంగా తొలగించటం ఆవేదన కలిగించిందన్నారు. మంత్రివర్గం నుంచి తప్పించే ముందు తన తప్పేంటో చెబితే బాగుండేదన్నారు. నిజంగా తాను పర్యావరణ అనుమతులు ఇచ్చే విషయంలో తప్పు చేసి ఉంటే ఉరి తీసినా అందుకు సిద్ధంగా ఉన్నానని జయంతి నటరాజన్ అన్నారు.
ఈ సందర్భంగా జయంతి నటరాజన్ ...రాహుల్ గాంధీపై విమర్శలు ఎక్కుపెట్టారు. తాను పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో వివిధ ప్రాజెక్టులకు అనుమతుల మంజూరు చేసే విషయంలో రాహుల్ సిఫార్సులు చేసేవారని ఆమె ఆరోపించారు. ఈ విషయంలో రాహుల్ ద్వంద్వ ప్రమాణాలు పాటించారన్నారు. రాహుల్ కార్యాలయంలోని ఓ వర్గం తనను మంత్రి పదవి నుంచి తప్పించేందుకు కుట్ర పన్నిందన్నారు.
ఆ కారణంగానే తనను కేబినెట్ నుంచి బలవంతంగా తప్పించాన్నారు. కేబినెట్ నుంచి తప్పించిన అనంతరం కాంగ్రెస్లోని ఓ వర్గం తనపై మీడియాలో అసత్య ప్రచారం చేసిందన్నారు. అలాగే 'స్పూప్ గేట్' వివాదంపై ప్రధాని మోదీపై విమర్శలు చేయాలని అధిష్టానం ఆదేశిస్తే...అందుకు తాను నిరాకరించాన్నారు.
ఆ కారణంగానే తనపై కక్ష కట్టారని, అనంతరం జరిగిన పరిణామాణ వల్లే తాను కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందన్నారు. గతంలో పలు సంస్థలకు అనుమతులు ఇచ్చేందుకు జయంతి నటరాజన్ నిరాకరించిన ఆమెపై అప్పటి కేబినెట్ సహచరులు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం తాను ఏ రాజకీయ పార్టీలో చేరే యోచన లేదని ఆమె తెలిపారు.