విస్తృత ఏకాభిప్రాయ సాధనకు సమయం మించిపోలేదు: అరుణ్ జైట్లీ
తెలంగాణ బిల్లుపై బీజేపీ నేత అరుణ్ జైట్లీ సూచన
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, సీమాంధ్ర మధ్య సంయమనం తీసుకురావడానికి ఇంకా సమయం మించిపోలేదని రాజ్యసభలో విపక్ష నేత అరుణ్ జైట్లీ (బీజేపీ) అన్నారు. ఇరు ప్రాంతాల వారు మాట్లాడుకోడానికి పార్లమెంటు లోపల లేదా బయట చర్చలకు ఒక వేదిక ఏర్పాటు చేయాలని సూచించారు. నష్టపోతున్న సీమాంధ్రులకు న్యాయం చేస్తూ వారి అనుమానాలను నివృత్తి చేయాలన్నారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో సంయమనం అవసరం’ పేరిట జైట్లీ తన బ్లాగ్‌లో శుక్రవారం వ్యాసం రాశారు. ‘నా తర్వాత ప్రళయం’ తీరులో.. యూపీఏ తర్వాత వివాదాలను వదలి వెళ్లాలని కోరుకుంటోందన్నారు. యూపీఏ పాలన ఆరంభంలో రాజ్యాంగ సంస్థల పతనం, ఆర్ధిక వ్యవస్థ మందగమనం, అవినీతి, నిర్ణయాలు తీసుకోవడంలో విశ్వసనీయస్థాయి తగ్గిందని విమర్శించారు. ‘తెలంగాణ ఏర్పాటు విషయంలో వివాదాస్పద బిల్లుపై యూపీఏ ఇప్పుడు పూర్తిస్థాయిలో సంక్షోభంలో కూరుకుపోయింది.
సొంత పార్టీలో పుట్టిన శక్తులను నియంత్రించలేని స్థితిలో ఉంది. అలజడులు, గొడవలు లేని పార్లమెంటు నడవడం చాలా అరుదుగా ఉంది. విపక్ష పార్టీలకన్నా యూపీఏ సభ్యులే సభలను అడ్డుకుంటున్నారు. ప్రభుత్వం, ప్రత్యేకించి ప్రధాని కార్యాలయం, హోం మంత్రిత్వ శాఖ అచేతనంగా ఉన్నాయి. చేతిలో ఉన్న అంశాలను పరిష్కరించడంలో ఎలాంటి ఆసక్తి కనబర్చడంలేదు’ అని జైట్లీ మండిపడ్డారు. జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలను ఎన్డీఏ ఏర్పాటు చేసే సమయంలో సుహృద్భావ వాతావరణం కల్పించామన్నారు.
గురువారం పార్లమెంటులో జరిగిన పరిణామాలతో సిగ్గుపడే స్థితికి యూపీఏదే బాధ్యత అన్నారు. ‘సభాకార్యకలాపాలను అడ్డుకుంటున్నవారిలో ఎక్కువ మంది సభ్యులు యూపీఏ వారే. తెలంగాణ, సీమాంధ్ర ప్రతినిధుల మధ్య భేదాభిప్రాయాలను దూరం చేయడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఇరు ప్రాంతాల మధ్య సంయమనం కోసం వేదిక ఏర్పాటు చేయలేదు. ఇరు ప్రాంతాల ఆకాంక్షలపై చర్చించడంలో పార్లమెంటు విఫలమైంది. ఈ మొత్తం ప్రక్రియతో దేశ ప్రజాస్వామ్యానికి అవమానమైంది. పార్లమెంటులో జరిగేవాటితో రాజనీతిజ్ఞుల ప్రతిష్టపై ప్రభావం చూపుతుంది’ అని పేర్కొన్నారు.