సుప్రీం కోర్టుకు కేంద్ర సర్కారు హామీ
న్యూఢిల్లీ: లోక్‌పాల్ చైర్‌పర్సన్, సభ్యుల నియామకంపై తక్షణ నిర్ణయం తీసుకోవడం లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. దీనిపై నిర్ణయం ఎన్నికల అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వానికి వదిలివేయనున్నట్లు చూచాయగా చెప్పింది. దీంతో లోక్‌పాల్ నియామకంపై స్టే కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై విచారణను జస్టిస్ ఆర్‌ఎం లోధా అధ్యక్షతనగల ధర్మాసనం మే 5కు వాయిదా వేస్తూ ఆదేశాలు వెలువరించింది. ఈ అంశంలో కామన్‌కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన తాజా వ్యాజ్యాన్ని ధర్మాసనం గురువారం విచారించింది. లోక్‌పాల్ చట్టం కింద రూపొందించిన నిబంధనల చెల్లుబాటును కోర్టు ప్రశ్నించినప్పటికీ... ప్రభుత్వం ముందుకే వెళుతోందని పిటిషనర్ ఆరోపించారు. ప్రస్తుత నిబంధనల కింద చేపడుతున్న పూర్తి నియామక ప్రక్రియను చట్టవిరుద్ధమని ప్రకటించాలని పిటిషనర్ తరపున న్యాయవాది ప్రశాంత్‌భూషణ్ కోర్టును అభ్యర్థించారు.
ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ మోహన్ పరాశన్ ధర్మాసనం ముందు హాజరై... లోక్‌పాల్ నియామకంపై సర్కారు నిర్ణయం తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. దీంతో మే5 వరకు లోక్‌పాల్ నియామకంపై నిర్ణయం తీసుకోబోమంటూ సర్కారు హామీ ఇచ్చినందున మధ్యంతర ఆదేశాలు అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది. లోగడ ఏప్రిల్ 1న విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు... లోక్‌పాల్, లోకాయక్త-2014 చట్టం కింద రూపొందించిన సెర్చ్ కమిటీ నిబంధనలను నాలుగు వారాల్లోగా సరిదిద్దాలని కేంద్రాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే.
లోక్‌పాల్‌పై నిర్ణయం తీసుకోవట్లేదు
Published Fri, Apr 25 2014 2:21 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement