ఏకగ్రీవమైతే లోక్‌పాల్ పదవి స్వీకరిస్తా
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పి.సదాశివం
న్యూఢిల్లీ: ఏకగ్రీవంగా ఎన్నుకుంటే భారత తొలి లోక్‌పాల్ పదవిని స్వీకరించేందుకు తనకు అభ్యంతరం లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.సదాశివం అన్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా శనివారం (నేడు) రిటైర్ కానున్న నేపథ్యంలో ఆయన శుక్రవారం ‘పీటీఐ’తో మాట్లాడారు. పదవీ విరమణ తర్వాత జాతీయ మానవ హక్కుల సంఘం చీఫ్‌గా లేదా లోక్‌పాల్‌గా లేదా తగిన హోదాలో ఎలాంటి పదవినైనా స్వీకరిస్తానని, కానీ ఆ ఎంపిక వివాదం కాకుండా ఏకగ్రీవంగా ఉంటేనే అంగీకరిస్తానని చీఫ్ జస్టిస్ సదాశివం తెలిపారు.
అలాగే ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న కొలీజియం వ్యవస్థను కొనసాగించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పద్ధతి వల్ల అవసరమైతే హైకోర్టు న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరళ్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని న్యాయమూర్తులను నియమిస్తామని, న్యాయవ్యవస్థకు సంబంధం లేనివారు నియామకాలు చేపడితే సరైన అభ్యర్థుల నియామకం జరగదన్నారు.
నిష్పక్షపాతంగా న్యాయం అందిస్తా: జస్టిస్ లోధా
తీర్పులు చెప్పేటప్పుడు తాను నిష్పక్షపాతంగా న్యాయం అందిస్తానని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎం లోధా అన్నారు. శుక్రవారం సుప్రీం చీఫ్ జస్టిస్ పి.సదాశివం వీడ్కోలు సమావేశం సందర్భంగా జస్టిస్ లోధా మాట్లాడారు. జస్టిస్ పి.సదాశివం తదనంతరం 41వ చీఫ్ జస్టిస్‌గా లోధా పదవిని చేపట్టనున్నారు.