P. SadAsivam
-
ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సదాశివం?
నేడో, రేపో బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ సాక్షి ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ గడువు (జూలై 18) సమీపిస్తున్న కొద్దీ అధికార ఎన్డీయే తరపున బరిలో దిగే అభ్యర్థిపై ఉత్సుకత పెరుగుతోంది. బీజేపీ అధిష్టానం ఉపరాష్ట్రపతి అభ్యర్థి కోసం పలువురు ప్రముఖుల పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో శని, ఆదివారాల్లో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కానుంది. అయితే అభ్యర్థి ఎవరై ఉండొచ్చనే అంశంపై స్పష్టత రాకపోయినా.. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, ప్రస్తుత కేరళ గవర్నర్ పి. సదాశివంకు అవకాశం లభించొచ్చని పార్టీలోని విశ్వసనీయవర్గాల సమాచారం. 2014లో తమిళనాడులోని ఈరోడ్‌కు చెందిన సదాశివంను ఆ రాష్ట్ర గవర్నర్‌గా నియమించింది. ఓ సీజేఐ గవర్నర్‌గా నియమి తులవటం ఇదే తొలిసారి. అటు, ఓబీసీలకు ఉపరాష్ట్రపతి పగ్గాలు అప్పగించాలని భావిస్తున్న తరుణంలో గౌండర్ వర్గానికి చెందిన సదాశివంకు ఎక్కువ అవశాకాలున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి వెంకయ్య, యూపీ గవర్నర్ రాంనాయక్, గుజరాత్ మాజీ సీఎం ఆనందీబెన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావుల పేర్లు కూడా వినిపిస్తున్నప్పటికీ వీరికి అవకాశం ఉండకపోవచ్చని తెలుస్తోంది. ప్రధాని మోదీ, అమిత్‌షా మనసులో ఏముందో నేతలకు అర్థం కావటం లేదని.. ఎవరిని తెరపైకి తెస్తారనేది చివరి నిమిషం వరకు స్పష్టంగా చెప్పలేమని పార్టీ నేతలంటున్నారు. అయితే పార్టీ బలంగా లేని దక్షిణ భారతంలో పాగా వేసేందుకు ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఉప రాష్ట్రపతిగా ఎంపిక చేయొచ్చని సమాచారం. మరోవైపు, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి జూలై 23న పార్లమెంటు సెంట్రల్ హాల్లో జరిగే కార్యక్రమంలో వీడ్కోలు తెలపనున్నారు. -
శ్రీవారిని దర్శించుకున్న కేరళ గవర్నర్
తిరుమల: కేరళ గవర్నర్ పి.సదాశివం శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఉదయం వీఐపీ ప్రారంభ సమయంలో ఆయన వెంకటేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
ఏకగ్రీవమైతే లోక్‌పాల్ పదవి స్వీకరిస్తా
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పి.సదాశివం న్యూఢిల్లీ: ఏకగ్రీవంగా ఎన్నుకుంటే భారత తొలి లోక్‌పాల్ పదవిని స్వీకరించేందుకు తనకు అభ్యంతరం లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.సదాశివం అన్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా శనివారం (నేడు) రిటైర్ కానున్న నేపథ్యంలో ఆయన శుక్రవారం ‘పీటీఐ’తో మాట్లాడారు. పదవీ విరమణ తర్వాత జాతీయ మానవ హక్కుల సంఘం చీఫ్‌గా లేదా లోక్‌పాల్‌గా లేదా తగిన హోదాలో ఎలాంటి పదవినైనా స్వీకరిస్తానని, కానీ ఆ ఎంపిక వివాదం కాకుండా ఏకగ్రీవంగా ఉంటేనే అంగీకరిస్తానని చీఫ్ జస్టిస్ సదాశివం తెలిపారు. అలాగే ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న కొలీజియం వ్యవస్థను కొనసాగించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పద్ధతి వల్ల అవసరమైతే హైకోర్టు న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరళ్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని న్యాయమూర్తులను నియమిస్తామని, న్యాయవ్యవస్థకు సంబంధం లేనివారు నియామకాలు చేపడితే సరైన అభ్యర్థుల నియామకం జరగదన్నారు. నిష్పక్షపాతంగా న్యాయం అందిస్తా: జస్టిస్ లోధా తీర్పులు చెప్పేటప్పుడు తాను నిష్పక్షపాతంగా న్యాయం అందిస్తానని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎం లోధా అన్నారు. శుక్రవారం సుప్రీం చీఫ్ జస్టిస్ పి.సదాశివం వీడ్కోలు సమావేశం సందర్భంగా జస్టిస్ లోధా మాట్లాడారు. జస్టిస్ పి.సదాశివం తదనంతరం 41వ చీఫ్ జస్టిస్‌గా లోధా పదవిని చేపట్టనున్నారు. -
మన రోడ్లు.. మృత్యుమార్గాలు
రహదారుల భద్రతపై సుప్రీం ఆగ్రహం దేశంలో ప్రతి నిమిషానికీ ఓ ప్రమాదం.. 4 నిమిషాలకు ఒకరి మృత్యువాత సత్వర చర్యలు అత్యవసరం.. అవసరమైతే చట్టాల్లో మార్పులు ప్రభుత్వాల చర్యల పర్యవేక్షణకు కమిటీ న్యూఢిల్లీ: భారత రహదారులు.. మృత్యుమార్గాలని నిర్ధారణ అయ్యిందని, వాటిని చక్కదిద్దేందుకు సత్వర చర్యలు అత్యవసరమని దేశ అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దేశంలో అస్తవ్యస్తంగా ఉన్న రహదారుల కారణంగా రోడ్డు ప్రమాదాలు పెరగడమే కాక, మృతుల సంఖ్య పెరుగుతోందనే గణాంకాలను పరిశీలించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం 2010 నాటి రోడ్డు ప్రమాదాల గణాంకాలను ప్రస్తావించింది. 2010లో ఐదు లక్షలకుపైగా రోడ్డు ప్రమాదాలు నమోదవగా.. సుమారు 1,30,000 మంది మృత్యువాత పడ్డారని, మరో ఐదు లక్షల మందికిపైగా తీవ్రమైన గాయాలపాలయ్యారని గుర్తించింది. ప్రతి నిమిషానికీ దేశంలో ఓ రోడ్డు ప్రమాదం జరుగుతోందని, ప్రతి నాలుగు నిమిషాలకు రోడ్డు ప్రమాదాల కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోతున్నాడని స్పష్టంచేసింది. రోడ్డు ప్రమాదాలు ప్రస్తుతం మానవ మనుగడకు అతి పెద్ద సవాలుగా మారాయని, వీటిని నివారించేందుకు సత్వర చర్యలు అవసరమంది. ప్రస్తుత చట్టాలు సక్రమంగా అమలు కావడం లేదని, అటువంటి చట్టాల్లో మార్పులు అవసరమని, అవసరమైతే వీటిని మరింత అభివృద్ధి పరచాలని ప్రభుత్వాలకు సూచించింది. దేశంలో రహదారుల భద్రతకు, రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలను పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీని నియమించింది. రహదారుల భద్రతకు సంబంధించిన బాధ్యతలు నిర్వర్తించే ప్రభుత్వ విభాగాలన్నీ మూడు నెలల్లోగా ప్రాథమిక నివేదికలను ఈ కమిటీకి సమర్పించాలని ఆదేశించింది. వాహనాల లెసైన్సులు, సర్టిఫికెట్ల జారీకి సంబంధించిన చట్టాల అమలు, పర్యవేక్షణతో పాటు రహదారుల భద్రతకు ఉపయోగిస్తున్న పరికరాలు, దానికి సంబంధించిన అంశాలను ఈ నివేదికలో ప్రస్తావించాలని స్పష్టంచేసింది.