మన రోడ్లు.. మృత్యుమార్గాలు
రహదారుల భద్రతపై సుప్రీం ఆగ్రహం
దేశంలో ప్రతి నిమిషానికీ ఓ ప్రమాదం.. 4 నిమిషాలకు ఒకరి మృత్యువాత
సత్వర చర్యలు అత్యవసరం.. అవసరమైతే చట్టాల్లో మార్పులు
ప్రభుత్వాల చర్యల పర్యవేక్షణకు కమిటీ
న్యూఢిల్లీ: భారత రహదారులు.. మృత్యుమార్గాలని నిర్ధారణ అయ్యిందని, వాటిని చక్కదిద్దేందుకు సత్వర చర్యలు అత్యవసరమని దేశ అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దేశంలో అస్తవ్యస్తంగా ఉన్న రహదారుల కారణంగా రోడ్డు ప్రమాదాలు పెరగడమే కాక, మృతుల సంఖ్య పెరుగుతోందనే గణాంకాలను పరిశీలించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం 2010 నాటి రోడ్డు ప్రమాదాల గణాంకాలను ప్రస్తావించింది. 2010లో ఐదు లక్షలకుపైగా రోడ్డు ప్రమాదాలు నమోదవగా.. సుమారు 1,30,000 మంది మృత్యువాత పడ్డారని, మరో ఐదు లక్షల మందికిపైగా తీవ్రమైన గాయాలపాలయ్యారని గుర్తించింది. ప్రతి నిమిషానికీ దేశంలో ఓ రోడ్డు ప్రమాదం జరుగుతోందని, ప్రతి నాలుగు నిమిషాలకు రోడ్డు ప్రమాదాల కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోతున్నాడని స్పష్టంచేసింది.
రోడ్డు ప్రమాదాలు ప్రస్తుతం మానవ మనుగడకు అతి పెద్ద సవాలుగా మారాయని, వీటిని నివారించేందుకు సత్వర చర్యలు అవసరమంది. ప్రస్తుత చట్టాలు సక్రమంగా అమలు కావడం లేదని, అటువంటి చట్టాల్లో మార్పులు అవసరమని, అవసరమైతే వీటిని మరింత అభివృద్ధి పరచాలని ప్రభుత్వాలకు సూచించింది. దేశంలో రహదారుల భద్రతకు, రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలను పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీని నియమించింది. రహదారుల భద్రతకు సంబంధించిన బాధ్యతలు నిర్వర్తించే ప్రభుత్వ విభాగాలన్నీ మూడు నెలల్లోగా ప్రాథమిక నివేదికలను ఈ కమిటీకి సమర్పించాలని ఆదేశించింది. వాహనాల లెసైన్సులు, సర్టిఫికెట్ల జారీకి సంబంధించిన చట్టాల అమలు, పర్యవేక్షణతో పాటు రహదారుల భద్రతకు ఉపయోగిస్తున్న పరికరాలు, దానికి సంబంధించిన అంశాలను ఈ నివేదికలో ప్రస్తావించాలని స్పష్టంచేసింది.