హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు భారత రోడ్లపై దూసుకెళ్తున్నాయి. సొసైటీ ఆఫ్ మాన్యుఫ్యాక్చరర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఎస్‌ఎంఈవీ) ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 8,46,976 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2021–22 విక్రయాలతో పోలిస్తే ఏకంగా రెండున్నర రెట్లకుపైగా వృద్ధి నమోదు కావడం విశేషం. ఎలక్ట్రిక్ టూ వీలర్లు 2021–22లో భారత్‌లో 3,27,900 యూనిట్లు అమ్ముడయ్యాయి. పెట్రోల్ భారం నుంచి బయటపడేందుకు, అలాగే తక్కువ ఖర్చుతో ప్రయాణించే వెసులుబాటు ఉండడంతో ఎలక్ట్రిక్ టూ వీలర్లకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం సబ్సిడీలతో ప్రోత్సహించడం కలిసి వచ్చే అంశం.
విభాగాల వారీగా ఇలా..
గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్ల లోపు ప్రయాణించే లో స్పీడ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ గత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 1.2 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. గంటకు 25 కిలోమీటర్ల కంటే అధిక వేగంతో ప్రయాణించే హై స్పీడ్ ఈ–టూ వీలర్లు 7,26,976 యూనిట్లు విక్రయం అయ్యాయి. 2021–22లో లో స్పీడ్ 75,457 యూనిట్లు, హై స్పీడ్ 2,52,443 యూనిట్లు రోడ్డెక్కాయి. నీతి ఆయోగ్ లక్ష్యం, ఇతర పరిశోధన సంస్థల అంచనాల కంటే 25 శాతం తక్కువ స్థాయిలో గత ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి.
పరిశ్రమకు అడ్డంకులు..
దశలవారీ తయారీ కార్యక్రమం (పీఎంపీ) పథకం కింద మార్గదర్శకాలను పాటించనందుకు ఫేమ్–2 రాయితీలను నిలిపివేయడం ఈ–టూ వీలర్ల అమ్మకాలపై ప్రభావం చూపిందని ఎస్‌ఎంఈవీ తెలిపింది. ‘స్థానికీకరణలో జాప్యం సాకుతో వినియోగదారులకు ఒరిజినల్ పరికరాల తయారీదారులు (ఓఈఎం) ఇప్పటికే బదిలీ చేసిన రూ.1,200 కోట్ల కంటే ఎక్కువ సబ్సిడీని అకస్మాత్తుగా నిలిపివేయడం హాస్యాస్పదం.
అలాగే తక్కువ ఇన్వాయిస్ చేశారనే ఆరోపణ కారణంగా ఖరీదైన ఈ–టూ వీలర్లను తయారు చేస్తున్న ఓఈఎంలకు చెందిన మరో రూ.400 కోట్లు నిలిచిపోయాయి. దీని పర్యవసానంగా మూలధన నిధుల కొరతతో వారి వ్యాపార కార్యకలాపాలు కుంటుపడ్డాయి. నేడు పరిశ్రమలో 95 శాతానికి పైగా ప్రాతినిధ్యం వహిస్తున్న 16 కంపెనీలు ప్రస్తుత గందరగోళ పరిస్థితి నుంచి పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయి. 2023–24లో తమ వ్యాపార ప్రణాళికలు చేసుకోవడానికి వీలుగా ఫేమ్ దశలవారీ తయారీ కార్యక్రమం తాలూకా అడ్డంకులకు తొలగించాలని విన్నవిస్తున్నాయి’ అని వివరించింది.
ఎండమావిలా లక్ష్యం..
ద్విచక్ర వాహన రంగంలో 2022–23లో ఈ–టూ వీలర్ల వాటా 5% మాత్రమే. స్వల్పకాలిక లక్ష్యం 30 శాతం. 2030 నాటికి ఇది 80 శాతానికి చేర్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించుకుంది. ఈ లక్ష్యం మరింత ఎండమావిలా కనిపిస్తోందని ఎస్‌ఎంఈవీ డైరెక్టర్ జనరల్ సోహిందర్ గిల్ వ్యాఖ్యానించారు. ‘పరిశ్రమ అన్నీ కోల్పోలేదు. ఈ రంగాన్ని తిరిగి గా డిలో ఉంచగలిగేది దశలవారీ తయారీ కార్యక్రమం (పీఎంపీ) అర్హత ప్రమాణాలను రెండేళ్లు పొడిగించడం.
అలాగే దీనిని ఈ ఏడాది ఏప్రిల్ నుంచే ఖచ్చితంగా అమలు చేయడం. ఫేమ్ పథకం కొనసాగింపుపై ప్రభుత్వ నిర్ణయం మొత్తం పరిశ్రమ విధిని నిర్ణయించే కీలకాంశం. ఈ విషయంలో ప్రభు త్వం నుంచి స్పష్టత కోసం పరిశ్రమ ఆసక్తిగా ఎదు రుచూస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల వ్యవస్థ అభివృద్ధిని ప్రోత్సహించడానికి, స్వయం–సమర్థ వంతంగా చేయడానికి కనీసం 3–4 ఏళ్ల పాటు ఫేమ్ పథకాన్ని పొడిగించడం చాలా ముఖ్యం’ అని తెలిపారు.
కస్టమర్లకే నేరుగా సబ్సిడీ..
ప్రస్తుతం నెలకొన్న గందరగోళం వల్ల దీర్ఘకాలిక వ్యూహాన్ని అభివృద్ధి చేయడం కంపెనీలకు కష్టతరం అవుతోందని గిల్ వివరించారు. ‘సబ్సిడీలలో ఏదైనా ఆకస్మిక తగ్గింపు వృద్ధిపై గణనీయ ప్రభావాన్ని చూపుతుంది. ఈ–మొబిలిటీ కోసం ప్రభుత్వ ప్రణాళికను ప్రమాదంలో పడేస్తుంది. ప్రస్తుత విధానంలో తయారీదార్లు సబ్సిడీని కస్టమర్‌కు బదిలీ చేస్తారు. విక్రయం తర్వాత ప్రభుత్వం నుండి క్లెయిమ్ చేసుకుంటారు. ఇది మోసపూరితంగా సబ్సిడీని క్లెయిమ్ చేయడానికి ఓఈఎంలు అమ్మకాలను మార్చడానికి దారితీయవచ్చు. ప్రభుత్వం నేరుగా కస్టమర్‌కు ప్రోత్సాహకాలను చెల్లించడానికి ప్రత్యక్ష సబ్సిడీ విధానాన్ని ప్రవేశపెట్టాలి’ అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment