Indian roads
-
చల్ మేరి ఈ–లూనా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లూనా.. చాలా మందికి సుపరిచితమైన చిన్న మోపెడ్. చల్ మేరీ లూనా పేరుతో మధ్య తరగతికి దగ్గరైంది. కొద్ది రోజుల్లో ఎలక్ట్రిక్ టూ వీలర్ రూపంలో భారత రోడ్లపై పరుగుపెట్టనుంది. ఎలక్ట్రిక్ వాహన తయారీలో ఉన్న కినెటిక్ గ్రీన్ ఈ–లూనా అభివృద్ధి చేసింది. జనవరి 26 నుంచి బుకింగ్స్ ప్రారంభం. ఫిబ్రవరి నుంచి మార్కెట్లో ఈ వాహనం దూసుకెళ్లనుంది. కంపెనీ వెబ్సైట్ ద్వారా రూ.500 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. నెలకు 5,000 యూనిట్లను విక్రయించాలన్నది సంస్థ టార్గెట్. మూడు బ్యాటరీ ప్యాక్‌లలో రంగ ప్రవేశం చేయనుంది. తొలుత 2 కిలోవాట్ అవర్ వేరియంట్ రానుంది. ఒకసారి చార్జింగ్‌తో 80 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. 150 కిలోల బరువు మోయగలదు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల కోసం 40–45 కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యంతో 1.5 కిలోవాట్ అవర్ బ్యాటరీతో మరో వేరియంట్ పరిచయం చేస్తారు. అలాగే 100–125 కిలోమీటర్లు ప్రయాణించగలిగే 3 కిలోవాట్ అవర్ బ్యాటరీతోనూ వేరియంట్ రంగ ప్రవేశం చేయనుంది. వచ్చే మూడేళ్లలో సామర్థ్యం పెంపు, కొత్త మోడళ్లకై కినెటిక్ గ్రీన్ రూ.500 కోట్లు పెట్టుబడి చేస్తోంది. రెండేళ్లలో రూ.100 కోట్లు.. ఈ–లూనా బ్రాండ్కై వచ్చే రెండేళ్లలో రూ.100 కోట్లు వెచి్చస్తున్నట్టు సంస్థ ఫౌండర్, సీఈవో సులజ్జా ఫిరోదియా మోత్వానీ వెల్లడించారు. సరైన సమయంలో ఈ–లూనా అడుగుపెడుతోందని చెప్పారు. ప్యాసింజర్ విభాగంతోపాటు సరుకు డెలివరీ సేవల కోసం కస్టమర్ల నుంచి మంచి స్పందన ఉందన్నారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా సరుకు రవాణాకై 1,500 ఈ–మోపెడ్స్ అందుబాటులోకి తెచి్చనట్టు వెల్లడించారు. ప్యాసింజర్ బీటూసీ నెట్‌వర్క్‌లో 50–70 వేల ఈ–లూనాలు, లాస్ట్ మైల్ డెలివరీకై 20–30 వేల యూనిట్లకు డిమాండ్ ఉండొచ్చని అంచనాగా చెప్పారు. కినెటిక్ గ్రీన్‌కు దేశవ్యాప్తంగా 300 డీలర్íÙప్ కేంద్రాలు ఉన్నాయి. మూడేళ్లలో ఈ సంఖ్యను అయిదు రెట్లకు పెంచాలన్నది సంస్థ లక్ష్యం. ఏటా అయిదు లక్షల యూనిట్ల ఈ–లూనా తయారీ సామర్థ్యంతో కొత్త ప్రొడక్షన్ లైన్‌ను కంపెనీ ప్రారంభించింది. కినెటిక్ ఇంజనీరింగ్ ద్వారా 50 సీసీ ఇంజన్ కలిగిన లూనా మోపెడ్ 1972 నుంచి భారత రోడ్లపై పరుగు ప్రారంభించింది. గరిష్టంగా రోజుకు 2,000 యూనిట్ల విక్రయాలు సంస్థ ఖాతాలో ఉన్నాయి. మోపెడ్స్ మార్కెట్లో ఏకంగా 95 శాతం వాటా ఉండేది. 2000 సంవత్సరం నుంచి తయారీ నిలిచిపోయింది. -
ఫేమ్-2 పెంపుపై ఈవీ పరిశ్రమల డిమాండ్ - మరో నాలుగేళ్లు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు భారత రోడ్లపై దూసుకెళ్తున్నాయి. సొసైటీ ఆఫ్ మాన్యుఫ్యాక్చరర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఎస్ఎంఈవీ) ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 8,46,976 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2021–22 విక్రయాలతో పోలిస్తే ఏకంగా రెండున్నర రెట్లకుపైగా వృద్ధి నమోదు కావడం విశేషం. ఎలక్ట్రిక్ టూ వీలర్లు 2021–22లో భారత్‌లో 3,27,900 యూనిట్లు అమ్ముడయ్యాయి. పెట్రోల్ భారం నుంచి బయటపడేందుకు, అలాగే తక్కువ ఖర్చుతో ప్రయాణించే వెసులుబాటు ఉండడంతో ఎలక్ట్రిక్ టూ వీలర్లకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం సబ్సిడీలతో ప్రోత్సహించడం కలిసి వచ్చే అంశం. విభాగాల వారీగా ఇలా.. గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్ల లోపు ప్రయాణించే లో స్పీడ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ గత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 1.2 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. గంటకు 25 కిలోమీటర్ల కంటే అధిక వేగంతో ప్రయాణించే హై స్పీడ్ ఈ–టూ వీలర్లు 7,26,976 యూనిట్లు విక్రయం అయ్యాయి. 2021–22లో లో స్పీడ్ 75,457 యూనిట్లు, హై స్పీడ్ 2,52,443 యూనిట్లు రోడ్డెక్కాయి. నీతి ఆయోగ్ లక్ష్యం, ఇతర పరిశోధన సంస్థల అంచనాల కంటే 25 శాతం తక్కువ స్థాయిలో గత ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. పరిశ్రమకు అడ్డంకులు.. దశలవారీ తయారీ కార్యక్రమం (పీఎంపీ) పథకం కింద మార్గదర్శకాలను పాటించనందుకు ఫేమ్–2 రాయితీలను నిలిపివేయడం ఈ–టూ వీలర్ల అమ్మకాలపై ప్రభావం చూపిందని ఎస్ఎంఈవీ తెలిపింది. ‘స్థానికీకరణలో జాప్యం సాకుతో వినియోగదారులకు ఒరిజినల్ పరికరాల తయారీదారులు (ఓఈఎం) ఇప్పటికే బదిలీ చేసిన రూ.1,200 కోట్ల కంటే ఎక్కువ సబ్సిడీని అకస్మాత్తుగా నిలిపివేయడం హాస్యాస్పదం. అలాగే తక్కువ ఇన్వాయిస్ చేశారనే ఆరోపణ కారణంగా ఖరీదైన ఈ–టూ వీలర్లను తయారు చేస్తున్న ఓఈఎంలకు చెందిన మరో రూ.400 కోట్లు నిలిచిపోయాయి. దీని పర్యవసానంగా మూలధన నిధుల కొరతతో వారి వ్యాపార కార్యకలాపాలు కుంటుపడ్డాయి. నేడు పరిశ్రమలో 95 శాతానికి పైగా ప్రాతినిధ్యం వహిస్తున్న 16 కంపెనీలు ప్రస్తుత గందరగోళ పరిస్థితి నుంచి పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయి. 2023–24లో తమ వ్యాపార ప్రణాళికలు చేసుకోవడానికి వీలుగా ఫేమ్ దశలవారీ తయారీ కార్యక్రమం తాలూకా అడ్డంకులకు తొలగించాలని విన్నవిస్తున్నాయి’ అని వివరించింది. ఎండమావిలా లక్ష్యం.. ద్విచక్ర వాహన రంగంలో 2022–23లో ఈ–టూ వీలర్ల వాటా 5% మాత్రమే. స్వల్పకాలిక లక్ష్యం 30 శాతం. 2030 నాటికి ఇది 80 శాతానికి చేర్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించుకుంది. ఈ లక్ష్యం మరింత ఎండమావిలా కనిపిస్తోందని ఎస్ఎంఈవీ డైరెక్టర్ జనరల్ సోహిందర్ గిల్ వ్యాఖ్యానించారు. ‘పరిశ్రమ అన్నీ కోల్పోలేదు. ఈ రంగాన్ని తిరిగి గా డిలో ఉంచగలిగేది దశలవారీ తయారీ కార్యక్రమం (పీఎంపీ) అర్హత ప్రమాణాలను రెండేళ్లు పొడిగించడం. అలాగే దీనిని ఈ ఏడాది ఏప్రిల్ నుంచే ఖచ్చితంగా అమలు చేయడం. ఫేమ్ పథకం కొనసాగింపుపై ప్రభుత్వ నిర్ణయం మొత్తం పరిశ్రమ విధిని నిర్ణయించే కీలకాంశం. ఈ విషయంలో ప్రభు త్వం నుంచి స్పష్టత కోసం పరిశ్రమ ఆసక్తిగా ఎదు రుచూస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల వ్యవస్థ అభివృద్ధిని ప్రోత్సహించడానికి, స్వయం–సమర్థ వంతంగా చేయడానికి కనీసం 3–4 ఏళ్ల పాటు ఫేమ్ పథకాన్ని పొడిగించడం చాలా ముఖ్యం’ అని తెలిపారు. కస్టమర్లకే నేరుగా సబ్సిడీ.. ప్రస్తుతం నెలకొన్న గందరగోళం వల్ల దీర్ఘకాలిక వ్యూహాన్ని అభివృద్ధి చేయడం కంపెనీలకు కష్టతరం అవుతోందని గిల్ వివరించారు. ‘సబ్సిడీలలో ఏదైనా ఆకస్మిక తగ్గింపు వృద్ధిపై గణనీయ ప్రభావాన్ని చూపుతుంది. ఈ–మొబిలిటీ కోసం ప్రభుత్వ ప్రణాళికను ప్రమాదంలో పడేస్తుంది. ప్రస్తుత విధానంలో తయారీదార్లు సబ్సిడీని కస్టమర్‌కు బదిలీ చేస్తారు. విక్రయం తర్వాత ప్రభుత్వం నుండి క్లెయిమ్ చేసుకుంటారు. ఇది మోసపూరితంగా సబ్సిడీని క్లెయిమ్ చేయడానికి ఓఈఎంలు అమ్మకాలను మార్చడానికి దారితీయవచ్చు. ప్రభుత్వం నేరుగా కస్టమర్‌కు ప్రోత్సాహకాలను చెల్లించడానికి ప్రత్యక్ష సబ్సిడీ విధానాన్ని ప్రవేశపెట్టాలి’ అని వివరించారు. -
హైడ్రోజన్‌తో నడిచే బస్.. త్వరలో భారత్ రోడ్ల పైకి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మేఘా ఇంజినీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌కు (ఎంఈఐఎల్) చెందిన ఎలక్ట్రిక్ వాహన రంగ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ హైడ్రోజన్‌తో నడిచే బస్‌ను తయారు చేసింది. రిలయన్స్ భాగస్వామ్యంతో ఈ వాహనాన్ని రూపొందించినట్టు కంపెనీ గురువారం ప్రకటించింది. ఏడాదిలోగా వాణిజ్యపరంగా వీటి ఉత్పత్తి ప్రారంభించాలని ఒలెక్ట్రా లక్ష్యంగా చేసుకుంది. పూర్తి ఇంధన సామర్థ్యంతో 400 కిలోమీటర్ల వరకు ప్రయాణించడం బస్ ప్రత్యేకత. బస్ పైభాగంలో టైప్–4 హైడ్రోజన్ సిలిండర్లను ఏర్పాటు చేశారు. 12 మీటర్ల పొడవు ఉన్న ఈ బస్సులో డ్రైవర్ సీటు కాకుండా ప్రయాణికులకోసం 32–49 సీట్లు ఏర్పాటు చేయవచ్చు. హైడ్రోజన్ నింపడానికి 15 నిమిషాలు పడుతుంది. (ఇదీ చదవండి: సింథటిక్ వజ్రాల ల్యాబ్.. ఎక్కడో తెలుసా?) -
ప్రాణాలు ముఖ్యమా? రాజకీయాలా!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా రోడ్లపై నడుస్తున్న వాహనాల్లో రెండు శాతం వాహనాలు మాత్రమే దేశీయ రోడ్లపై నడుస్తుండగా, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 12 శాతం ప్రమాదాలు భారత్‌లోనే జరుగుతున్నాయని అంతర్జాతీయ లెక్కలు తెలియజేస్తున్నాయి. భారత్‌లో రోడ్డు ప్రమాదాల కారణంగా ఏటా ఒకటిన్నర లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ విషయాన్ని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ స్వయంగా పార్లమెంట్‌కు తెలియజేశారు. దేశంలో రోడ్డు నెట్వర్క్ అత్యంత అధ్వాన్నంగా ఉండడం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఈ ప్రమాదాల కారణంగా భారత్‌కు ప్రతి ఏటా తన జాతీయ స్థూలాదాయంలో మూడు శాతం అంటే, 5,8000 లక్షల డాలర్ల నష్టం వాటిల్లుతోందని ‘ఐక్యరాజ్యసమితి ఆసియా, పసిఫిక్ ఆర్థిక, సామాజిక వ్యవహారాల కమిషన్’ తెలియజేసింది. ఈ నేపథ్యంలో దేశంలో రోడ్డు భద్రతా ప్రమాణాలను మెరగుపర్చాల్సిన అవసరం ఉందని, అందుకు 30 ఏళ్ల నాటి మోటారు వాహనాల చట్టాన్ని సవరించాలని నితిన్ గడ్కారీ నిర్ణయించారు. 2014లో బీజేపీ అధికారంలో వచ్చిన కొత్తలోనే బిల్లు ప్రతిపాదన తీసుకరాగా, సుదీర్ఘ కసరత్తు తర్వాత 2017లో బిల్లు తుది రూపు దాల్చింది. ఈ బిల్లును అదే సంవత్సరం ఏప్రిల్ నెలలో లోక్‌సభ ఆమోదించగా, రాజ్యసభ అదే సంవత్సరం ఆగస్టు నెలలో ‘ఎంపిక కమిటీ’ పరిశీలనకు పంపించింది. ఆ కమిటీ నుంచి తగిన సూచనలతో బిల్లు సోమవారం నాడు రాజ్యసభలో చర్చకు వచ్చింది. దీన్ని తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, వామపక్షాలు, ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను సడలిస్తుందన్న కారణంగా అన్ని పార్టీలు బిల్లును వ్యతిరేకించగా, కార్పొరేషన్లకు మేలు చేసే విధంగా కూడా ఉందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. వాస్తవానికి బిల్లులో చాలా మంచి ప్రతిపాదనలు ఉన్నాయి. ట్రాఫిక్ ఉల్లంఘనలకు జరిమానాలను భారీగా పెంచడంతోపాటు రోడ్ల నిర్మాణంలో, డిజైన్లలో, నిర్వహణలో లోపాలుంటే అందుకు కాంట్రాక్టర్లను, కన్సల్టెంట్లను, ప్రభుత్వ సంస్థలను బాధ్యులను చేస్తూ కఠిన శిక్షలు విధించడం, కొన్ని రకాల యాక్సిడెంట్లలో బాధితులకు నష్టపరహారం చెల్లించడం కోసం రోడ్డు భద్రతా నిధిని ఏర్పాటు చేయడం, సరైన ప్రమాణాలకు అనుగుణంగా లేని మోటారు వాహనాలను, విడిభాగాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని వాటిని సంబంధిత కంపెనీలకు పంపించడం, ఓ కంపెనీపై 500 కోట్ల రూపాయల వరకు నష్టపరిహారం విధించడం లాంటి ప్రతిపాదనలు ఉన్నాయి. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల్లో బాధితులను ఆదుకునే పౌరులకు అధికారుల నుంచిగానీ చట్టం నుంచిగానీ ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా చూడడం, వీలైతే రివార్డులివ్వడం లాంటి ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. తాగి వాహనాన్ని నడిపితే పదివేల రూపాయల జరిమానా, ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపితే ఐదువేల రూపాయలు, రెడ్ సిగ్నల్ దాటినా, సీటు బెల్టు పెట్టుకోక పోయినా, హెల్మట్ ధరించక పోయినా వెయ్యి రూపాయల జరిమానాలను విధించాలని ప్రతిపాదనలు తెలియజేస్తున్నాయి. 30 ఏళ్ల అనంతరం తొలిసారి జరిగిన కసరత్తును రాష్ట్ర పాలకపక్ష పార్టీలు కాదనడం బాధాకరమే. రాష్ట్రాలు కూడా చట్టాలు తేవచ్చు దేశంలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఒక్క కేంద్రమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. రాష్ట్రాలు కూడా తమ పరిధిలో పటిష్టమైన చర్యలు తీసుకోవచ్చు. ‘విజన్ జీరో ప్రోగ్రామ్’ పేరిట హర్యానా ప్రభుత్వం గతేడాది చర్యలు తీసుకుంది. దీర్ఘకాలంలో రోడ్డు ప్రమాదం కారణంగా ఒక్కరి ప్రాణం కూడా పోకూడదనే ఉద్దేశంతో తీసుకున్న చర్యల వల్ల ఇప్పటికే ఆ రాష్ట్రంలోని పది జిల్లాల్లో ప్రమాదాలు ఐదు శాతం తగ్గాయి. అదే తరహాలో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ‘జీరో రోడ్ ఫాటలిటీ’ కార్యక్రమాన్ని చేపట్టగా ఇప్పటికీ పది శాతం ప్రమాదాలు తగ్గాయి. -
మన రోడ్లు.. మృత్యుమార్గాలు
రహదారుల భద్రతపై సుప్రీం ఆగ్రహం దేశంలో ప్రతి నిమిషానికీ ఓ ప్రమాదం.. 4 నిమిషాలకు ఒకరి మృత్యువాత సత్వర చర్యలు అత్యవసరం.. అవసరమైతే చట్టాల్లో మార్పులు ప్రభుత్వాల చర్యల పర్యవేక్షణకు కమిటీ న్యూఢిల్లీ: భారత రహదారులు.. మృత్యుమార్గాలని నిర్ధారణ అయ్యిందని, వాటిని చక్కదిద్దేందుకు సత్వర చర్యలు అత్యవసరమని దేశ అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దేశంలో అస్తవ్యస్తంగా ఉన్న రహదారుల కారణంగా రోడ్డు ప్రమాదాలు పెరగడమే కాక, మృతుల సంఖ్య పెరుగుతోందనే గణాంకాలను పరిశీలించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం 2010 నాటి రోడ్డు ప్రమాదాల గణాంకాలను ప్రస్తావించింది. 2010లో ఐదు లక్షలకుపైగా రోడ్డు ప్రమాదాలు నమోదవగా.. సుమారు 1,30,000 మంది మృత్యువాత పడ్డారని, మరో ఐదు లక్షల మందికిపైగా తీవ్రమైన గాయాలపాలయ్యారని గుర్తించింది. ప్రతి నిమిషానికీ దేశంలో ఓ రోడ్డు ప్రమాదం జరుగుతోందని, ప్రతి నాలుగు నిమిషాలకు రోడ్డు ప్రమాదాల కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోతున్నాడని స్పష్టంచేసింది. రోడ్డు ప్రమాదాలు ప్రస్తుతం మానవ మనుగడకు అతి పెద్ద సవాలుగా మారాయని, వీటిని నివారించేందుకు సత్వర చర్యలు అవసరమంది. ప్రస్తుత చట్టాలు సక్రమంగా అమలు కావడం లేదని, అటువంటి చట్టాల్లో మార్పులు అవసరమని, అవసరమైతే వీటిని మరింత అభివృద్ధి పరచాలని ప్రభుత్వాలకు సూచించింది. దేశంలో రహదారుల భద్రతకు, రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలను పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీని నియమించింది. రహదారుల భద్రతకు సంబంధించిన బాధ్యతలు నిర్వర్తించే ప్రభుత్వ విభాగాలన్నీ మూడు నెలల్లోగా ప్రాథమిక నివేదికలను ఈ కమిటీకి సమర్పించాలని ఆదేశించింది. వాహనాల లెసైన్సులు, సర్టిఫికెట్ల జారీకి సంబంధించిన చట్టాల అమలు, పర్యవేక్షణతో పాటు రహదారుల భద్రతకు ఉపయోగిస్తున్న పరికరాలు, దానికి సంబంధించిన అంశాలను ఈ నివేదికలో ప్రస్తావించాలని స్పష్టంచేసింది.