సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా రోడ్లపై నడుస్తున్న వాహనాల్లో రెండు శాతం వాహనాలు మాత్రమే దేశీయ రోడ్లపై నడుస్తుండగా, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 12 శాతం ప్రమాదాలు భారత్‌లోనే జరుగుతున్నాయని అంతర్జాతీయ లెక్కలు తెలియజేస్తున్నాయి. భారత్‌లో రోడ్డు ప్రమాదాల కారణంగా ఏటా ఒకటిన్నర లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ విషయాన్ని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ స్వయంగా పార్లమెంట్‌కు తెలియజేశారు. దేశంలో రోడ్డు నెట్‌వర్క్ అత్యంత అధ్వాన్నంగా ఉండడం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఈ ప్రమాదాల కారణంగా భారత్‌కు ప్రతి ఏటా తన జాతీయ స్థూలాదాయంలో మూడు శాతం అంటే, 5,8000 లక్షల డాలర్ల నష్టం వాటిల్లుతోందని ‘ఐక్యరాజ్యసమితి ఆసియా, పసిఫిక్ ఆర్థిక, సామాజిక వ్యవహారాల కమిషన్’ తెలియజేసింది.
ఈ నేపథ్యంలో దేశంలో రోడ్డు భద్రతా ప్రమాణాలను మెరగుపర్చాల్సిన అవసరం ఉందని, అందుకు 30 ఏళ్ల నాటి మోటారు వాహనాల చట్టాన్ని సవరించాలని నితిన్ గడ్కారీ నిర్ణయించారు. 2014లో బీజేపీ అధికారంలో వచ్చిన కొత్తలోనే బిల్లు ప్రతిపాదన తీసుకరాగా, సుదీర్ఘ కసరత్తు తర్వాత 2017లో బిల్లు తుది రూపు దాల్చింది. ఈ బిల్లును అదే సంవత్సరం ఏప్రిల్ నెలలో లోక్‌సభ ఆమోదించగా, రాజ్యసభ అదే సంవత్సరం ఆగస్టు నెలలో ‘ఎంపిక కమిటీ’ పరిశీలనకు పంపించింది. ఆ కమిటీ నుంచి తగిన సూచనలతో బిల్లు సోమవారం నాడు రాజ్యసభలో చర్చకు వచ్చింది. దీన్ని తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, వామపక్షాలు, ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను సడలిస్తుందన్న కారణంగా అన్ని పార్టీలు బిల్లును వ్యతిరేకించగా, కార్పొరేషన్లకు మేలు చేసే విధంగా కూడా ఉందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
వాస్తవానికి బిల్లులో చాలా మంచి ప్రతిపాదనలు ఉన్నాయి. ట్రాఫిక్ ఉల్లంఘనలకు జరిమానాలను భారీగా పెంచడంతోపాటు రోడ్ల నిర్మాణంలో, డిజైన్లలో, నిర్వహణలో లోపాలుంటే అందుకు కాంట్రాక్టర్లను, కన్సల్టెంట్లను, ప్రభుత్వ సంస్థలను బాధ్యులను చేస్తూ కఠిన శిక్షలు విధించడం, కొన్ని రకాల యాక్సిడెంట్లలో బాధితులకు నష్టపరహారం చెల్లించడం కోసం రోడ్డు భద్రతా నిధిని ఏర్పాటు చేయడం, సరైన ప్రమాణాలకు అనుగుణంగా లేని మోటారు వాహనాలను, విడిభాగాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని వాటిని సంబంధిత కంపెనీలకు పంపించడం, ఓ కంపెనీపై 500 కోట్ల రూపాయల వరకు నష్టపరిహారం విధించడం లాంటి ప్రతిపాదనలు ఉన్నాయి. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల్లో బాధితులను ఆదుకునే పౌరులకు అధికారుల నుంచిగానీ చట్టం నుంచిగానీ ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా చూడడం, వీలైతే రివార్డులివ్వడం లాంటి ప్రతిపాదనలు కూడా ఉన్నాయి.
తాగి వాహనాన్ని నడిపితే పదివేల రూపాయల జరిమానా, ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపితే ఐదువేల రూపాయలు, రెడ్ సిగ్నల్ దాటినా, సీటు బెల్టు పెట్టుకోక పోయినా, హెల్మట్ ధరించక పోయినా వెయ్యి రూపాయల జరిమానాలను విధించాలని ప్రతిపాదనలు తెలియజేస్తున్నాయి. 30 ఏళ్ల అనంతరం తొలిసారి జరిగిన కసరత్తును రాష్ట్ర పాలకపక్ష పార్టీలు కాదనడం బాధాకరమే.
రాష్ట్రాలు కూడా చట్టాలు తేవచ్చు
దేశంలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఒక్క కేంద్రమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. రాష్ట్రాలు కూడా తమ పరిధిలో పటిష్టమైన చర్యలు తీసుకోవచ్చు. ‘విజన్ జీరో ప్రోగ్రామ్’ పేరిట హర్యానా ప్రభుత్వం గతేడాది చర్యలు తీసుకుంది. దీర్ఘకాలంలో రోడ్డు ప్రమాదం కారణంగా ఒక్కరి ప్రాణం కూడా పోకూడదనే ఉద్దేశంతో తీసుకున్న చర్యల వల్ల ఇప్పటికే ఆ రాష్ట్రంలోని పది జిల్లాల్లో ప్రమాదాలు ఐదు శాతం తగ్గాయి. అదే తరహాలో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ‘జీరో రోడ్ ఫాటలిటీ’ కార్యక్రమాన్ని చేపట్టగా ఇప్పటికీ పది శాతం ప్రమాదాలు తగ్గాయి.
Comments
Please login to add a commentAdd a comment