
పెరుగుతున్న డ్రంకెన్ డ్రైవ్ కేసులు
మద్యం మత్తులో రోడ్డెక్కడంతో ప్రమాదాలు
చనిపోతూ, మరి కొందరి మృతికి కారణమవుతున్న వైనం
మూడేళ్లలో 2,596డ్రంకెన్ డ్రైవ్ కేసులు
జైలు శిక్షలు పడుతున్నా యువతలో కనిపించని మార్పు
కొన్నాళ్ల క్రితం కర్నూలు ప్రభుత్వాసుపత్రి ఎదురుగా మోటర్ సైకిల్ ఢీకొన్న ఘటనలో అనంతపురం జిల్లాకు చెందిన ఓ వృద్ధుడు మృతి చెందాడు. వాహనం నడిపిన యువకుడు బార్‌లో పని చేస్తాడు. రాత్రి ఫుల్‌గా మద్యం తాగి వాహనాన్ని వేగంగా నడపటంతో ప్రమాదం జరిగింది.
కర్నూలు బాలాజీ నగర్‌కు చెందిన కొంతమంది యువకులు స్నేహితుని పుట్టిన రోజు వేడుకలను అలంపూరు గ్రామ శివారులోని ఓ తోటలో జరుపుకున్నారు. అనంతరం కర్నూలుకు వస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు తుంగభద్ర బ్రిడ్జి దగ్గర ప్రమాదానికి గురైంది.ఏ వాహనమూ వారికి అడ్డు రాలేదు. వేగంగా వెళ్లి బ్రిడ్జికి ఢీకొట్టడం వల్ల ఘటనా స్థలంలోనే ఒకరు మృతిచెందగా మరో నలుగురు గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదం కూడా మద్యం మత్తులో వాహనం నడపటమే కారణమని పోలీసులు తేల్చారు. ఇలాంటి ఘటనలతో ఆయా కుటుంబాలు చీకటిలోకి జారుకుంటున్నాయి.
కర్నూలు: వారు నడిస్తే.. కాళ్లు రకరకాలుగా అడుగులేస్తాయి. ఇక వాహనాలు నడిపితే యముడు వెనుక వస్తున్నట్లే. మృత్యువుకు ఎదురెళ్తారు. ఎందుకంటే వారి శరీరంలోకి మద్యం వెళ్లింది. ఏమి జరుగుతుందో తెలుసుకునేలోపే ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మత్తులో రోడ్డు ప్రమాదానికి గురవుతున్నారు. అలా వాహనాలు నడుపుతూ ప్రజల ప్రాణాలతోనూ ఆడుకుంటున్నారు. మద్యం మత్తులోని యమకింకరులను పోలీసులు పట్టుకుంటున్నా, కోర్టు శిక్షలు విధిస్తున్నా నానాటికీ పెరిగిపోతున్న కేసులు మరింత కలవరపాటుకు గురి చేస్తున్నాయి.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో నిత్యం ఎక్కడో చోట మద్యం మత్తులో ప్రమాదాలు చోటు చేసుకుని మరణాలు సంభవిస్తున్నాయి. మద్యం తాగడం ఎంత హానికరమో.. వివరించే ప్రచార చిత్రాలు చాలా చోట్ల కనిపిస్తుంటాయి. పోలీసులు కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా డ్రంకెన్ డ్రైవ్‌పై అవగాహన కల్పిస్తుంటారు. ఇవి చాలా మందిలో మార్పు తీసుకురాలేకపోతున్నాయి. పండుగలు, ఉత్సవాలు, ఇళ్లలో జరిగే శుభకార్యాల పేరుతో మందుబాబులు తెగ తాగేస్తున్నారు.
అదే సమయంలో వాహనాలతో రోడ్లపైకి రావడం ముప్పు తెస్తోంది. ఎక్కువగా 20 నుంచి 45 సంవత్సరాల మధ్య యువకులే తనిఖీల్లో పట్టుబడుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. 40 నుంచి 55 ఏళ్ల వయస్సు వారు తర్వాత స్థానంలో ఉన్నారు. ఇటీవల కాలంలో 18 నుంచి 22 సంవత్సరాల మధ్య వయసు వారు కూడా అధికంగానే మద్యం సేవించి తనిఖీల్లో పట్టుబడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
చైతన్యపరుస్తున్నా.. లెక్క చేయని యువత
మద్యం సేవించి వాహనాలు నడపటం ప్రమాదకరమని పోలీసులు జిల్లాలో నిత్యం ఎక్కడో చోట అవగాహన కల్పిస్తున్నప్పటికీ యువత లెక్క చేయడం లేదు. ఎంతో భవిష్యత్తు ఊహించుకున్న కన్నవారు తేరుకోలేని పరిస్థితిలోకి వెళ్లిపోతున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే ఎంత ప్రమాదమో ఎక్కడికక్కడ చైతన్యం చేస్తున్నప్పటికీ కొందరు లెక్క చేయడం లేదు.
చివరకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. వారిపై ఆధారపడినవారిని అంధకారంలోకి నెట్టేస్తున్నారు. జిల్లాలో ఏటా డ్రంకెన్ డ్రైవ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. పోలీసులు కూడా ఎక్కడికక్కడ పకడ్బందీగా తనిఖీలు ముమ్మరం చేశారు. వారిని కూడా తప్పించుకుని వెళ్లిపోయినవారిని లెక్కల్లోకి తీసుకుంటే భయపడేంత స్థాయిలో మద్యం ప్రియులు వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.
దొరికిన కొందరు కొన్ని రోజుల పాటు జైలు శిక్షకు కూడా గురవుతున్నారు. ఇన్ని ఘటనలు తమ చుట్టూ జరుగుతున్నా ‘నిషా’లో మునిగిన వారు వాహనాలు నడపటం మాత్రం ఆపడం లేదు. మూడేళ్లలో 2,596 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు కావడమే ఇందుకు నిదర్శనం.
జైలు.. జరిమానా
మద్యం తాగి వాహనం నడపడం చట్టరీత్యా నేరం అని అందరికీ తెలిసిన విషయమే. ఇలా చేస్తే భారీ జరిమానాలు, జైలు శిక్ష వేస్తారని కూడా మందు బాబులు తెలుసుకోవాలి. మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడవితే మొదటిసారి రూ.10,000 వరకు జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధిస్తారు. రెండో సారి కూడా ఇదే తప్పు చేస్తే రూ.15,000 వరకు జరిమానా, రెండు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు.
ఇలాంటి సంఘటనల్లో ఎవరికైనా ప్రాణాపాయం కలిగితే జైలు శిక్ష కూడా రెండేళ్లు ఉండేది. కొత్త చట్టం ప్రకారం మద్యం తాగి వాహనం నడపడం వల్ల కలిగే మరణాలకు ఐదు సంవత్సరాల వరకు తప్పనిసరి జైలు శిక్ష విధిస్తారు. అంతేకాకుండా జరిమానా కూడా ఎక్కువగా వేస్తారు. ఒకవేళ ప్రమాదం చేసిన వ్యక్తి చనిపోయిన వ్యక్తి మరణానికి సరైన కారణం చెప్పకపోతే 10 సంవత్సరాల వరకు జైలు శిక్షతో సహా అదనపు కఠినమైన శిక్షలు విధించే విధంగా చట్టాన్ని మార్చారు.
మద్యం తాగి వాహనాలు నడిపితే చట్టరీత్యా నేరం
మద్యం తాగి వాహనాలు నడపటం చట్టరీత్యా నేరం. ప్రమాదానికి గురైతే కుటుంబీకులు ఇబ్బంది పడతారనే విషయాన్ని విస్మరించవద్దు. ప్రధానంగా యువత మద్యం మత్తులో వాహనాలు నడపటం, ప్రమాదాలకు గురవటం ఆందోళనకరం. చాలా మందిలో మార్పు రావడం లేదు. వారి విలువైన భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని కౌన్సెలింగ్‌లో సూచిస్తున్నాం. – మన్సూరుద్దిన్, ట్రాఫిక్ సీఐ, కర్నూలు
Comments
Please login to add a commentAdd a comment