న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా లోక్‌సభలో ప్రశ్నలడిగేందుకు డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలపై సీబీఐ విచారణ జరపనుందని బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే తాజాగా వెల్లడించారు. తన ఫిర్యాదు ఆధారంగా లోక్‌పాల్ ఈ మేరకు ఆదేశించినట్టు వివరించారు. ఈ మేరకు బుధవారం తన సామాజిక మాధ్యమ ఖాతా ‘ఎక్స్’లో ట్వీట్‌చేశారు. దీనిపై మొయిత్రా తీవ్రంగా స్పందించారు.
‘‘సీబీఐ ముందుగా అదానీ గ్రూప్ రూ.13 వేల కోట్ల బొగ్గు కుంభకోణం తదితరాలపై విచారణ జరిపితే బాగుంటుంది. ఆ తర్వాత నా అంశానికి రావచ్చు. నాకు ఎన్ని పాదరక్షలున్నాయో లెక్కపెట్టుకోవచ్చు’’ అని ఎద్దేవా చేస్తూ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీకి మేలు చేసేలా అదానీ గ్రూప్‌పై లోక్‌సభలో మొయిత్రా పలుమార్లు ప్రశ్నలు అడిగారంటూ గత నెలలో దుబే ఆరోపించడం తెలిసిందే.
ఇందుకు బదులుగా హీరానందానీ నుంచి డబ్బులతో పాటు ఇతరత్రా పలు రకాలుగా ఆమె భారీ స్థాయిలో లబ్ధి పొందారని ఆమెపై ఆరోపణ. ఎంపీ హోదాలో ఉంటూ డబ్బుల కోసం జాతీయ భద్రతనే ఆమె ప్రమాదంలో పడవేశారని లోక్‌సభ స్పీకర్‌కు దూబే గతంలో ఫిర్యాదు చేయడం తెల్సిందే. దాంతో 15 మంది ఎంపీలతో కూడిన లోక్‌సభ నైతిక విలువల కమిటీ ఈ ఉదంతంపై దర్యాప్తు చేస్తోంది.
కమిటీ గత భేటీకి హాజరైన మొయిత్రా, చైర్మన్ తనను అసభ్యకరమైన ప్రశ్నలు అడిగారని ఆరోపిస్తూ వాకౌట్ చేయడం విదితమే. ఈ ఉదంతంపై కమిటీ గురువారం మరోసారి భేటీ కానుంది. డబ్బులకు ప్రశ్నలడిగిన ఉదంతంలో మొయిత్రాను దోషిగా తేలుస్తూ స్పీకర్‌కు కమిటీ నివేదిక సమర్పించనున్నట్టు సమాచారం. అదే జరిగితే దానితో విభేదిస్తూ కమిటీలోని విపక్ష సభ్యులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి (కాంగ్రెస్), కున్వర్ దానిష్ అలీ (బీఎస్పీ) నోట్ ఇస్తారని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment