న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే చేసిన ఫిర్యాదును లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేశారు. బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ సోన్‌ఖర్ లోక్‌సబ ఎథిక్స్ కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. కాగా మహువా మోయిత్రాపై నిషికాంత్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అదానీ గ్రూప్, ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేసి మాట్లాడేందుకు ప్రముఖ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి ఎంపీ మహువా కోట్ల రూపాయలు తీసుకున్నారని తన లేఖలో పేర్కొన్నారు.
2019 నుంచి 2023 మధ్య కాలంలో మహువా అడిగిన 61 ప్రశ్నల్లో 50 దర్శన్ హీరానందానీ కోరిక మేరకు అడిగినవేనని తెలిపారు. దీనికి సంబంధించిన సాక్ష్యాలను సుప్రీంకోర్టు లాయర్ తనకు అందించారని, తక్షణమే మహువాను లోక్ సభ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
దీనిపై విచారణ చేయాలని కోరుతూ.. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌కు లేఖ రాశారు. లోక్‌సభ వెబ్‌సైట్‌కు సంబంధించి తన లాగిన్ వివరాలను ఎవరికైనా ఇచ్చారా అనే విషయాలపై దర్యాప్తు చేయాలని కోరారు. ఇందుకు విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
అయితే నిషికాంత్ దూబే ఆరోపణలపై తృణమూల్ ఎంపీ ఘాటుగా స్పందించారు. నిషికాంత్ దూబేపై నకిలీ అఫిడవిట్లు, ఇతర అభియోగాలపై దర్యాప్తును పూర్తి చేశాక తనపై ఎలాంటి చర్యలు తీసుకున్నా స్వాగతిస్తానన్నారు. ఇక బీజేపీ ఎంపీ ఆరోపణల్ని హీరానందానీ గ్రూప్ ఖండించింది. అవన్నీ అవాస్తవాలని స్పష్టం చేసింది. దేశ ప్రయోజనాల కోసం తాము ఎల్లప్పుడూ ప్రభుత్వంతోనే కలిసి నడుస్తామని తేల్చి చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment