
‘లోక్‌పాల్’ ఆమోదానికి సహకరించండి: రాహుల్ గాంధీ
లోక్‌పాల్ బిల్లుకు ఆమోదం విషయంలో రాజకీయ పార్టీలన్నీ ఏకాభిప్రాయానికి రావాలని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. అవినీతిపై లోక్‌పాల్ వ్యవస్థ పోరు సాగించేందుకు వీలుగా అన్ని పార్టీలూ విభేదాలను పక్కనపెట్టి రాజ్యసభలో ప్రవేశపెట్టిన ఈ సవరణ బిల్లుకు సంపూర్ణ ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై శనివారం ఢిల్లీలో ప్రత్యేకంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రులు కపిల్ సిబల్, చిదంబరం, వి. నారాయణసామిలతో కలిసి రాహుల్ మాట్లాడారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం, లోక్‌పాల్ బిల్లును ఆమోదించాలంటూ అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే చేపట్టిన నిరవధిక నిరాహారదీక్ష ఒత్తిడి ఫలితంగానే ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో ఈ బిల్లు ఆమోదానికి ముందుకొచ్చిందన్న వాదనను రాహుల్ తోసిపుచ్చారు. ‘దేశానికి పటిష్ట లోక్‌పాల్‌ను అందించడమే మా ఉద్దేశం. ఈ దిశగా 99 శాతం ప్రయత్నం జరిగింది. ఇంకొక్క శాతం సహకారం ఇతర పార్టీల నుంచి అవసరం. దేశ ప్రయోజనాలతో ముడిపడిన ఈ బిల్లుకు మద్దతివ్వాలని అన్ని పార్టీలనూ కోరుతున్నా’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. బిల్లు ఆమోదానికి మద్దతు కూడగట్టే విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధిపట్ల హజారే సంతృప్తి వ్యక్తం చేస్తారా? అని ప్రశ్నించగా దేశంలో అవినీతి వ్యతిరేక వ్యవస్థను ఏర్పాటు చేయడమే తమ ఉద్దేశమని...ఆ దిశగా చర్యలు చేపడుతూనే ఉంటామన్నారు. బిల్లును సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) వ్యతిరేకిస్తున్న అంశాన్ని ప్రస్తావించగా చిదంబరం స్పందిస్తూ బిల్లు విషయంలో ఒకటి, రెండు పార్టీలకు అనుమానాలు ఉండొచ్చని, కానీ ఇప్పటివరకూ ఏ పార్టీ కూడా లోక్‌పాల్ వద్దని చెప్పలేదన్నారు.
చర్చ లేకున్నా బిల్లు ఆమోదానికి సిద్ధం: బీజేపీ
సెలెక్ట్ కమిటీ ఆమోదించిన లోక్‌పాల్ బిల్లుపై రాజ్యసభలో చర్చ జరగకపోయినా దాని ఆమోదానికి సిద్ధంగా ఉన్నట్లు లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్ తెలిపారు. ఈ మేరకు ఆమె శనివారం ‘ట్వీట్’ చేశారు. మరోవైపు రాజ్యసభలో ప్రతిపక్ష నేత అరుణ్‌జైట్లీ ఈ అంశంపై స్పందిస్తూ బిల్లు ఆమోదం పొందకుండా కాంగ్రెస్, దాని మిత్రపక్షాలే అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. మరోవైపు లోక్‌పాల్ బిల్లు ఆమోదానికి అన్ని పార్టీలు సహకరించాలన్న రాహుల్ సూచనను సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) తోసిపుచ్చింది. బిల్లు ఆమోదం పొందకుండా అడ్డుకొని తీరతామని...ఈ విషయంలో ఎంత దూరమైనా వెళ్తామని ఎస్పీ నేత నరేశ్ అగర్వాల్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాగా, బిల్లును రాజ్యసభ ఆమోదించడంతోపాటు లోక్‌సభ కూడా ఆమోదముద్ర వేసి బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేసిన వెంటనే తాను చేపట్టిన నిరవధిక నిరాహారదీక్షను విరమిస్తానని శనివారం రాలెగావ్ సిద్ధిలో తెలిపారు.