కేజ్రీవాల్: నిన్న.. నేడు.., రేపు..! పేరుతో వీడియో విడుదల చేసిన బీజేపీ
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై భారతీయ జనతా పార్టీ ఎదురుదాడి ప్రారంభించింది. ‘కేజ్రీవాల్: కల్, ఆజ్ ఔర్ కల్’ పేరుతో ఆడియో, వీడియో ప్రెజెంటేషన్‌ను విడుదల చేసింది.
కేజ్రీవాల్ ప్రభుత్వం అధికారంలో ఉన్న 49 రోజులకు సంబంధించి 49 తొమ్మిది అంశాలతో ఈ ప్రెజెంటేషన్‌ను రూపొం దించారు. ఈ అంశాలపై ఆమ్ ఆద్మీ ప్రభుత్వం అబద్ధమాడిందా? లేక ప్రజలను తప్పుదోవ పట్టించిందా? అని ప్రశ్నించేలా ప్రెజెంటేషన్‌ను సిద్ధం చేశారు.
ఈ విషయమై ఢిల్లీ బీజేపీ ప్రదేశ్ అధక్ష్యుడు హర్షవర్ధన్ మీడియాతో మాట్లాడారు. ‘49 రోజుల కేజ్రీవాల్ పాలన కారణంగా నగరం ఎంత అస్తవ్యస్థమైందన విషయాన్ని ప్రజలకు తెలియజెప్పేందుకు ఈ ప్రెజెంటేషన్‌ను సిద్ధం చేశాం. రాజ్యంగాన్ని, రాజ్యంగ సంస్థలను కేజ్రీవాల్ ఎలా తుంగలో తొక్కారనే విషయం ఈ ప్రెజెంటేషన్ చూస్తే తెలిసిపోతుంది.
తన ప్రభుత్వంలోని మంత్రులెవరూ ప్రభుత్వ బంగ్లాలను తీసుకోరాని కేజ్రీవాల్ చెప్పారు. ఆ తర్వాత ఆయనతో సహా అందరూ తీసుకున్నారు. చివరకు పదవి నుంచి వైదొలగిన తర్వాత కూడా కేజ్రీవాల్ తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయలేదు. అంతేకాక కేబినెట్ మంత్రుల కోసం రెండేసి ప్రభుత్వ ఫ్లాట్లను ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు.
వీఐపీ సంస్కృతికి చరమగీతం పాడతామంటూ మెట్రో రైల్లో ప్రమాణ స్వీకారానికి వచ్చిన కేజ్రీవాల్ ఆ తర్వాత జైపూర్ నుంచి ఢిల్లీకి వచ్చేందుకు చార్డర్డ్ విమానాన్ని ఉపయోగించారు. లోక్‌పాల్ విషయంలో నిపుణుల సలహాలను తీసుకుంటామన్నారు. అవేవీ తీసుకోకుండానే మొండిగా వ్యవహరించి, బిల్లును ప్రవేశపెట్టారు. భద్రతను తీసుకోనన్నారు. ఆ తర్వాత తీసుకున్నారు.
నిజానికి ఆప్ పాలనతో విద్యుత్ బిల్లులు కూడా పెరిగాయి. అయనప్పటికీ తగ్గించామని చెప్పుకోవడం అబద్ధం కాదా? విదేశీ నిధులపై ఇప్పటికీ ఆ పార్టీ నోరు మెదపడంలేదు. ఫోర్డ్ ఫౌండేషన్ ఇచ్చిన నిధుల గురించి మాట మాత్రమైనా మాట్లాడడంలేదు.
అవినీతిని అంతం చేస్తామని చెబుతూనే నేర చరిత్ర ఉన్నవారికి టికెట్లు ఇచ్చారు. మొరాదాబాద్, ముజఫర్‌నగర్, మహారాష్ట్రలోని పలు బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకొని, ఎగవేసినవారికి టికెట్లు ఇచ్చారు.
ఆ పార్టీ నేత రాఖీ బిర్ల కూడా పార్టీ ప్రచారం కోసం రూ.7 డిమాండ్ చేసినట్లు ఆరోపణలు తెలియనివా?’ అని హర్షవర్ధన్ ప్రశ్నించారు. ఈ విలేకరుల సమావేశంలో పార్టీ ఎన్నికల నిర్వహణ, ప్రచార కమిటీ చైర్మన్ విజయ్‌కుమార్ మల్హోత్రా, ఢిల్లీ బీజేపీ ప్రదేశ్ అధ్యక్షుడు విజేందర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.