Vijender Gupta
-
ఢిల్లీ అసెంబ్లీలో హైడ్రామా
-
ఈసారి తప్పించుకోలేవని బెదిరించాడు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత విజేందర్ గుప్తాను హతమారుస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. గుప్తా పీఏ ఆశీష్ కట్యల్ ఫోన్‌కు ఆగంతకుడు కాల్ కేసి ఈ మేరకు హెచ్చరించాడు. ఆశీష్ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ నెల 10వ తేదీ సాయంత్రం గుర్తుతెలియనివ్యక్తి తనకు ఫోన్ చేసి గుప్తాను చంపుతానని బెదిరించాడని, గతంలో రెండుసార్లు తమదాడి నుంచి తప్పించుకున్నాడని, ఈ సారి సెక్యూరిటీ ఉన్నా తమ నుంచి తప్పించుకోలేడని హెచ్చరించాడని ఆశీష్ చెప్పారు. ఢిల్లీలోని ప్రశాంత్ విహార్ పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా తనకు గత నెల 9వ తేదీన ఇదేవిధంగా బెదిరింపు కాల్స్ వచ్చినట్టు గుప్తా చెప్పారు. ఏడాదిన్నర క్రితం కూడా బెదిరింపులు వచ్చాయని, వీటి వెనుక ఆప్ లీడర్ల హస్తముందని ఆయన ఆరోపించారు. ఢిల్లీ ప్రభుత్వ అవినీతిని ఎత్తిచూపినందుకు తనకు బెదిరింపులు వస్తున్నాయని, వీటి వెనుక వందశాతం ఆప్ నేతల హస్తముందని భావిస్తున్నట్టు గుప్తా చెప్పారు. అయితే గుప్తా ఆరోపణలు ఆప్ నేతలు ఖండించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందని, కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించి వాస్తవాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. -
వ్యాట్‌పై చర్చకు అనుమతించలేదు
♦ ఆప్ సర్కారుపై బీజేపీ విమర్శనాస్త్రాలు ♦ మీడియాను పక్కదారి పట్టించారు ♦ స్పీకర్ వివక్షతో వ్యవహరిస్తున్నారు న్యూఢిల్లీ : వ్యాట్ బిల్లుపై ఆప్ ప్రభుత్వంతోపాటు స్పీకర్ రాంనివాస్ గోయల్ శాసనసభలో చర్చకు అనుమతించలేదని బీజేపీ ఆరోపించింది. పైగా చర్చ జరిగిందని, అయితే విపక్ష సభ్యులు పాల్గొనలేదంటూ ఈ విషయంలో మీడియాను పక్కదారి పట్టించేందుకు యత్నించిందని ఆ పార్టీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ విమర్శించారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకూడా ఈ అంశంపై చర్చను అడ్డుకున్నారని ఆరోపించారు. సవరణలతో చేపట్టిన అత్యంత కీలకమైన ఈ బిల్లును కొద్ది సెకండ్ల వ్యవధిలోనే సభలో ఆమోదింపజేసుకున్నారన్నారు. ఈ అంశంపై చర్చకు అనుమతించామని, అయితే ప్రతిపక్ష సభ్యులు ఇందులో పాల్గొనలేదంటూ సభ బయట అధికార పక్షం మీడియాకు చెప్పుకుందన్నారు. అనంతరం ఆ పార్టీకి చెందిన మరో నాయకుడు, శాసనసభలో ప్రతిపక్ష నేత విజేందర్‌గుప్తా మాట్లాడుతూ స్పీకర్ రాంనివాస్ గోయల్ బీజేపీ ఎమ్మెల్యేలపట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. ఆయన వివక్షతో వ్యవహరించాడా? లేదా? అనే విషయాన్ని శాసనసభ వీడియో దృశ్యాలను పరిశీలిస్తే అర్థమవుతుందని, ఆవిధంగా కూడా నిర్ధారించుకోవచ్చని అన్నారు. ఇప్పటికి మొత్తం మూడు పర్యాయాలు శాసనసభ సమావేశాలు జరిగాయని, అయితే అత్యధిక మెజారిటీ ఉండడంతో విపక్షం ఉనికి లేకుండా చేసేందుకు ఆప్ సర్కారు శాయశక్తులా యత్నిస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి మూలస్థంభమైన మీడి యా మాట ఆలకించేందుకు సిద్ధంగా లేదనే విషయం స్పష్టమైందన్నారు. -
'బీజేపీ ఎమ్మెల్యేలను ఎత్తుకొచ్చి బయటపడేశారు'
న్యూఢిల్లీ: రెండో రోజు ఢిల్లీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రసాభాసగా మారాయి. బీజేపీ నేతలు పలు అంశాలను లేవనెత్తుతూ గందరగోళం సృష్టించారు. సభలో ఉన్నది ముగ్గురు బీజేపీ నేతలే అయినా.. అధికార పార్టీకి మాత్రం చుక్కలు చూపించారు. దీంతో ఇక చేసేదేం లేక మార్షల్స్ రంగంలోకి దిగారు. ఎంత వారించినా వినకుండా.. అదేపనిగా అరుస్తూ సభలో గందరగోళం సృష్టిస్తున్న బీజేపీ నేత విజేందర్ గుప్తాను, మరో ఇద్దరు ఎమ్మెల్యేలను చివరకు మార్షల్స్ ఎత్తుకొచ్చి బయటేశారు. తొలుత మర్యాదగా రావాల్సిందిగా ఆయనను బ్రతిమిలాడినా వినకపోవడంతో మార్షల్స్ అంతా కలిసి ఆయనను గాల్లోకి లేపి ఎత్తుకొచ్చి బయట దించేశారు. అంతకుముందు 'ఆయన అరిచి అరిచి స్వరం బొంగురు పోతున్నట్లుంది ఓ విక్స్ ఇవ్వండి' అంటూ స్పీకర్ చలోక్తులు విసిరారు. ఈ సమయంలో సభలోని సభ్యులంతా పెద్దగా నవ్వుతూ తమ ఎదురుగా ఉన్న బల్లలు చరిచారు. మంగళవారంనాటి తొలి రోజు సమావేశాల్లో నకిలీ డిగ్రీని కలిగి ఉండి జైలు పాలైన జితేందర్ సింగ్ తోమర్ విషయంపై విజేందర్ ప్రశ్నించగా.. రెండు రోజు సమావేశాల్లో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించే అంశంపై చర్చ జరగాలని పట్టుబట్టారు. మిగితా ఏ సభా వ్యవహారాలు జరగకుండా అడ్డుకున్నారు. తమ డిమాండ్‌పై చర్చ జరిగే వరకు ఏం అంశంపై సభలో చర్చ అక్కర్లేదంటూ గందరగోళం సృష్టించారు. దీంతో వారిని మార్షల్స్ ద్వారా బయటకు పంపించాల్సి వచ్చింది. -
శాసనసభాపక్ష నేతగా విజేందర్ గుప్తా
న్యూఢిల్లీ: విధానసభలో బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిగా రోహిణీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తా ఎంపికయ్యారు. మొట్టమొదటిసారిగా ఎన్నికల బరిలో దిగి విజయం సాధించిన గుప్తాను పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో సభ్యులు ... శాసనసభా పక్ష నేతగా ఎంపిక చేశారు. కాగా 70 మంది సభ్యులు కలిగిన ఢిల్లీ విధానసభలో 67 మంది ఆప్‌కు చెందినవారే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరఫున ముగ్గురే విజయం సాధించారు. సంఖ్యాబలం బాగా స్వల్పంగా ఉన్న కారణంగా రాజ్యాంగపరంగా బీజేపీకి ప్రతిపక్ష దక్కే అవకాశం లేదు. -
గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న గుప్తా
సాక్షి, న్యూఢిల్లీ : స్థానిక బీజేపీ ప్రముఖుల్లో ఒకరైన విజేందర్‌గుప్తా ఈసారి రోహిణీ స్థానం నుంచి బరిలోకి దిగారు. గతంలో మాదిరిగా సురక్షిత సీటు కోసం తాపత్రయపడకుండా కాంగ్రెస్ దిగ్గజాలతో ఎన్నికల్లో తలపడి రాజకీయ భవితవ్యాన్ని పార్టీ కోసం పణంగా పెట్టిన గుప్తా...ఈసారి గెలుపు కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. డూసూ ఉపాధ్యక్షుడిగా విద్యార్థి సంఘ రాజకీయాల్లోకి అడుగిడిన గుప్తా ఆ తర్వాత రెండుసార్లు ఎమ్సీడీ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ఎమ్సీడీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా కూడా పనిచేశారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఆయనను కాంగ్రెస్ నేత కపిల్‌సిబల్‌కు వ్యతిరేకంగా చాందినీచౌక్ స్థానం నుంచి నిలబెట్టింది. ఆ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీ రాష్ర్ట శాఖ అధ్యక్షుడయ్యారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో బీజేపీ ఓటమి తరువాత పార్టీ పగ్గాలు చేపట్టారు. స్థానికంగా పార్టీని బలోపేతం చేసేందుకు కృషిచేశారు. గుప్తా నేతృత్వంలోనే మూడు మునిపల్ కార్పొరేషన్లలో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. 2014 విధానసభ ఎన్నికల్లో మరోమారు పార్టీ ఆయనను షీలాదీక్షిత్, అరవింద్ కేజ్రీవాల్‌లకు వ్యతిరేకంగా న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా బరిలోకి దింపింది. ఆ ఎన్నికల్లోనూ ఓటమి పాలయ్యారు. రోహిణీ నుంచి బరిలోకి దిగిన గుప్తాకు వ్యతిరేకంగా చరంజీలాల్ గుప్తా( ఆప్), సుఖ్బీర్ శర్మ (కాంగ్రెస్) పోటీ చేస్తున్నారు. -
నిధుల బదిలీ వివాదం మరో రాజకీయ గిమ్మిక్కు
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ వరద బాధితులకు ఎమ్మెల్యేల నిధుల మరలింపు విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్జంగ్పై ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు చేయడాన్ని మరో రాజకీయ గిమ్మిక్కుగా బీజేపీ అభివర్ణించింది. ఈ విషయమై ఆ పార్టీ నాయకుడు, ఢిల్లీ శాఖ మాజీ అధ్యక్షుడు విజేందర్‌గుప్తా మీడియాతో మాట్లాడుతూ అరవింద్.. అనవసరమైన గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వరద బాధితులకు తమ నిధులను విరాళంగా ఇచ్చేందుకు ముందుకొచ్చినప్పటికీ ఎల్జీ అడ్డుకున్నాడని అనడం సరికాదన్నారు. రాజకీయంగా లబ్ధి పొందేందుకు అరవింద్ యత్నిస్తున్నాడని ఆరోపించారు. కాగా నగర పరిధిలోని ఎమ్మెల్యేలు స్థానిక అభివృద్ధి నిధులను జమ్మూకాశ్మీర్‌కు చెందిన వరదబాధితులకు విరాళాల కింద ఇచ్చేందుకు ఎల్జీ అనుమతించారంటూ శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఎల్జీ కార్యాలయం పేర్కొంది. మార్గదర్శకాల్లో మార్పులు జాతీయ విపత్తుల సమయంలో ఎమ్మెల్యేలకు కేటాయించే నిధుల్లో మార్గదర్శకాల్లో ఢిల్లీ ప్రభుత్వం సవరణలు చేపట్టింది. తాజా మార్పులుచేర్పుల ప్రకారం ఎమ్మెల్యేలు తమ నిధుల్లో నుంచి రూ. 4 కోట్ల వరకూ విపత్తి సహాయనిధి కింద ముఖ్యమంత్రి లేదా లెఫ్టినెంట్ గవర్నర్‌కు అందజేయవచ్చు. గతంలో విరాళాల కేటాయింపునకు సంబంధించి ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఆ ఆంక్షల ప్రకారం ఎమ్మెల్యేలు తమ నిధుల్లోనుంచి ఐదు శాతంగానీ లేదా గరిష్టంగా రూ. 35 లక్షలను గానీ ముఖ్యమంత్రి లేదా లెఫ్టినెంట్ గవర్నర్లకు సహాయ నిధికి అందజేయాల్సి ఉంటుంది. -
ఆప్ అధినేతపై ఎదురు దాడి!
కేజ్రీవాల్: నిన్న.. నేడు.., రేపు..! పేరుతో వీడియో విడుదల చేసిన బీజేపీ న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై భారతీయ జనతా పార్టీ ఎదురుదాడి ప్రారంభించింది. ‘కేజ్రీవాల్: కల్, ఆజ్ ఔర్ కల్’ పేరుతో ఆడియో, వీడియో ప్రెజెంటేషన్‌ను విడుదల చేసింది. కేజ్రీవాల్ ప్రభుత్వం అధికారంలో ఉన్న 49 రోజులకు సంబంధించి 49 తొమ్మిది అంశాలతో ఈ ప్రెజెంటేషన్‌ను రూపొం దించారు. ఈ అంశాలపై ఆమ్ ఆద్మీ ప్రభుత్వం అబద్ధమాడిందా? లేక ప్రజలను తప్పుదోవ పట్టించిందా? అని ప్రశ్నించేలా ప్రెజెంటేషన్‌ను సిద్ధం చేశారు. ఈ విషయమై ఢిల్లీ బీజేపీ ప్రదేశ్ అధక్ష్యుడు హర్షవర్ధన్ మీడియాతో మాట్లాడారు. ‘49 రోజుల కేజ్రీవాల్ పాలన కారణంగా నగరం ఎంత అస్తవ్యస్థమైందన విషయాన్ని ప్రజలకు తెలియజెప్పేందుకు ఈ ప్రెజెంటేషన్‌ను సిద్ధం చేశాం. రాజ్యంగాన్ని, రాజ్యంగ సంస్థలను కేజ్రీవాల్ ఎలా తుంగలో తొక్కారనే విషయం ఈ ప్రెజెంటేషన్ చూస్తే తెలిసిపోతుంది. తన ప్రభుత్వంలోని మంత్రులెవరూ ప్రభుత్వ బంగ్లాలను తీసుకోరాని కేజ్రీవాల్ చెప్పారు. ఆ తర్వాత ఆయనతో సహా అందరూ తీసుకున్నారు. చివరకు పదవి నుంచి వైదొలగిన తర్వాత కూడా కేజ్రీవాల్ తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయలేదు. అంతేకాక కేబినెట్ మంత్రుల కోసం రెండేసి ప్రభుత్వ ఫ్లాట్లను ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. వీఐపీ సంస్కృతికి చరమగీతం పాడతామంటూ మెట్రో రైల్లో ప్రమాణ స్వీకారానికి వచ్చిన కేజ్రీవాల్ ఆ తర్వాత జైపూర్ నుంచి ఢిల్లీకి వచ్చేందుకు చార్డర్డ్ విమానాన్ని ఉపయోగించారు. లోక్‌పాల్ విషయంలో నిపుణుల సలహాలను తీసుకుంటామన్నారు. అవేవీ తీసుకోకుండానే మొండిగా వ్యవహరించి, బిల్లును ప్రవేశపెట్టారు. భద్రతను తీసుకోనన్నారు. ఆ తర్వాత తీసుకున్నారు. నిజానికి ఆప్ పాలనతో విద్యుత్ బిల్లులు కూడా పెరిగాయి. అయనప్పటికీ తగ్గించామని చెప్పుకోవడం అబద్ధం కాదా? విదేశీ నిధులపై ఇప్పటికీ ఆ పార్టీ నోరు మెదపడంలేదు. ఫోర్డ్ ఫౌండేషన్ ఇచ్చిన నిధుల గురించి మాట మాత్రమైనా మాట్లాడడంలేదు. అవినీతిని అంతం చేస్తామని చెబుతూనే నేర చరిత్ర ఉన్నవారికి టికెట్లు ఇచ్చారు. మొరాదాబాద్, ముజఫర్‌నగర్, మహారాష్ట్రలోని పలు బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకొని, ఎగవేసినవారికి టికెట్లు ఇచ్చారు. ఆ పార్టీ నేత రాఖీ బిర్ల కూడా పార్టీ ప్రచారం కోసం రూ.7 డిమాండ్ చేసినట్లు ఆరోపణలు తెలియనివా?’ అని హర్షవర్ధన్ ప్రశ్నించారు. ఈ విలేకరుల సమావేశంలో పార్టీ ఎన్నికల నిర్వహణ, ప్రచార కమిటీ చైర్మన్ విజయ్‌కుమార్ మల్హోత్రా, ఢిల్లీ బీజేపీ ప్రదేశ్ అధ్యక్షుడు విజేందర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
షరతులకు ఓకే
సాక్షి, న్యూఢిల్లీ: తమ పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 18 షరతులపై ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) నేత అర్వింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాసిన లేఖకు ఆ పార్టీ సోమవారం జవాబిచ్చింది. కేజ్రీవాల్ ప్రస్తావించిన 18 అంశాలకూ జవాబు ఇచ్చామని ఢిల్లీ కాంగ్రెస్ ఇన్చార్జ్ షకీల్ అహ్మద్ చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన సమాధానంపై మంగళవారం చర్చించనున్నట్లు ఆప్ నేత మనీష్ సిసోడియా చెప్పారు. అయితే లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ ఢిల్లీలో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేశారు. ఆప్ విధించిన షరతులు తమకు సమ్మతమేనని, అయితే అందులో చాలా వాటికి ఏ పార్టీ మద్దతూ అవసరం లేదని తెలిపింది. ఆప్ ప్రస్తావించిన అన్ని అంశాలపైనా ఏకీభవిస్తూనే వాటికి తమ సహకారం ఉంటుందని హామీ ఇచ్చింది. కేజ్రీవాల్ పేర్కొన్న 18 షరతులలో 16 షరతులు కార్యనిర్వాహక వర్గం విధుల పరిధిలోకి వస్తాయని, వాటిని నిర్వర్తించడం ప్రభుత్వ కర్తవ్యమని కాంగ్రెస్ పేర్కొంది. ఈ షరతులను నెరవేర్చడానికి విధానసభ అనుమతి కూడా అవసరం లేదని తెలిపింది. మిగతా రెండు షరతులు అంటే ఢిల్లీలో లోకాయుక్తను ఏర్పాటుచేయడం, ఢిల్లీకి సంపూర్ణరాష్ట్ర హోదా కల్పించడం. ఢిల్లీలో లోకాయుక్త ఇప్పటికే ఉందని కాంగ్రెస్ పేర్కొంది. ఆప్ ప్రభుత్వం లోకాయుక్తను మరింత పటిష్టం చేయాలనుకున్నట్లయితే తాము సహకరిస్తామని కాంగ్రెస్ తెలిపింది. లోక్‌పాల్ బిల్లును పార్లమెంటు ఈవారం ఆమోదించవచ్చని తెలిపింది. ఢిల్లీకి సంపూర్ణ రాష్ట్ర హోదాను తామూ కోరుతున్నామని కాంగ్రెస్ తెలియజేసింది. ఈ ప్రతిపాదన విధానసభ ముందుకు వచ్చినప్పుడు సహకరిస్తామని హామీ ఇచ్చింది. ఈ అంశంపై కేంద్రంతో చర్చిస్తామని వాగ్దానం చేసింది. ‘మేం బేషరతుగా మద్దతు ఇస్తామని చెప్పామని కేజ్రీవాల్ మాటిమాటికి అంటున్నారు. నిజానికి కాంగ్రెస్ ఆప్ ప్రభుత్వానికి వెలుపలి నుంచి మాత్రమే మద్దతు ఇస్తుందని తెలియజేశాం’ అని షకీల్ అహ్మద్ వివరణ ఇచ్చారు. సమాధానమివ్వకూడదని నిర్ణయించిన బీజేపీ ఈ 18 షరతులపై వైఖరి తెలపాల్సిందిగా కేజ్రీవాల్ తమ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌కు రాసిన లేఖకు సమాధానమివ్వకూడదని బీజేపీ నిర్ణయించుకుంది. ‘ఆమ్ ఆద్మీ పార్టీకి బేషరతుగా మద్దతు ఇస్తామని మేం హామీ ఇవ్వలేదు. కేవలం నిర్మాణాత్మక సహకారం మాత్రం ఇస్తామన్నాం. అందువల్ల ఆప్ రాసిన లేఖకు సమాధానమిచ్చి మా మద్దతు తెలపాల్సిన అవసరం లేదు’ అని బీజేపీ నేతలు అన్నారు. తాము ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని ముందుగానే వెల్లడించామని పేర్కొన్నారు. ప్రతిపక్ష సహకారాన్ని విధానసభలో కోరాల్సి ఉంటుంది కానీ ప్రభుత్వ ఏర్పాటుకు ముందే కాదని బీజేపీ నేత విజేందర్ గుప్తా అభిప్రాయపడ్డారు. -
అవకాశం ఇవ్వండి..అన్నీ పరిష్కరిస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: పదిహేనే ళ్ల కాంగ్రెస్ పాలనతో విసిగిపోయిన ఢిల్లీవాసులకు డిసెంబర్ 4 తర్వాత విముక్తి కల్పిస్తామని, వారు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతామని ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. ఢిల్లీవాసులను ఆకట్టుకునేలా రూపొందించిన పార్టీ మేనిఫెస్టోను మంగళవారం బీజేపీ ఢిల్లీప్రదే శ్ కార్యాలయంలో విడుదల చేశారు. లోక్‌సభ, రాజ్యసభ ప్రతిపక్ష నాయకులు సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీతోపాటు బీజేపీ నగరశాఖ అధ్యక్షుడు విజయ్‌గోయల్, సీఎం అభ్యర్థి హర్షవర్ధన్, బీజేపీ ఢిల్లీ ఎన్నికల ఇన్చార్జ్ నితిన్‌గడ్కారీ, విజయేంద్రగుప్తా, విజయ్ జోలీ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఢిల్లీలో తాము అధికారంలోకి వస్తే స్థానిక సమస్యలన్నింటికీ పరిష్కారం చూపుతామని బీజేపీ సీఎం అభ్యర్థి హర్షవర్ధన్ పేర్కొన్నారు. గతంలో పేర్కొన్నట్టుగానే విద్యుత్ చార్జీల 30 శాతం తగ్గింపును బీజేపీ ప్రత్యేకంగా ప్రస్తావించింది. మహిళల భద్రత, ఢిల్లీకి ప్రత్యేక రాష్ట్రహోదా, ఆరోగ్యం, అదనపు గ్యాస్ సిలిండర్ల పంపిణీ తదితర అంశాలను ప్రస్తావించారు. ఢిల్లీవాసుల నుంచి సేకరించిన అభిప్రాయాలను కలబోతగా తయారు చేసి, ఎన్నికలకు సరిగ్గా వారం ముందు విడుదల చేసిన పార్టీ మేనిఫెస్టో ఢిల్లీవాసులను ఆకట్టుకుంటుందని బీజేపీ విశ్వసిస్తోంది. ఇదిలా ఉండగా కాంగ్రెస్, ఆమ్ఆద్మీ పార్టీలు మేనిఫెస్టో విడుదల చేసిన ఐదురోజుల అనంతరం బీజేపీ మేనిఫెస్టో రావడం గమనార్హం. బీజేపీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలోని విశేషాలు అంశాల వారీగా: ఢిల్లీకి పూర్తి రాష్ట్రహోదా: బీజేపీ అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లోనే ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్రహోదా కోసం కృషి. ఎన్ సీఆర్ ప్రాంతంలోని ఫరీదాబాద్, గుర్గావ్, సోనిపట్, రోహ్తక్, ఇంద్రపురం, ఘజియాబాద్, నోయిడాలను కలిపేలా రవాణా వ్యవస్థ ఏర్పాటు ప్రభుత్వ సేవల్లో పారదర్శకత పెంచేందుకు ఈ-గవర్నెన్స్ అమలు. లోకాయుక్తకు అదనపు అధికారాల క ల్పన సత్వర న్యాయం: బాధితులందరికీ సత్వరన్యాయం అందేలా ‘స్పీడీ జస్టిస్ కమిషన్’ ఏర్పాటు. మహిళలపై జరుగుతున్న లైంగిక దాడుల కేసుల విచారణకు ‘ఫాస్ట్‌ట్రాక్ కోర్టు’ల ఏర్పాటు. వయోధికులు వేసే కేసుల విచారణకు స్పెషల్ కోర్టుల ఏర్పాటు. 1984 అల్లర్ల బాధితుకుల న్యాయం చేసేందుకు ప్రత్యేక చర్యలు. సబ్సిడీపై అదనపు సిలిండర్లు: ప్రస్తుతం సబ్సిడీపై ఇస్తున్న తొమ్మిది గ్యాస్ సిలిండర్లకు అదనంగా మూడు కలిపి మొత్తం 12 సిలిండర్లను పంపిణీ చేయడం. విద్యుత్, మంచినీరు: విద్యుత్ చార్జీలను 30 శాతం తగ్గించేలా డిస్కమ్‌ల మధ్య పోటీ పెంచడం. వాటి పనితీరును ఆర్టీఐ, కాగ్ పరిధిలోకి తేవడం. ప్రతి ఇంటినీ విద్యుత్ ఉత్పాదక కేంద్రంగా మార్చేలా ఇళ్లపై సోలార్ విద్యుత్ ఉత్పాదక వ్యవస్థ ఏర్పాటు. సోలార్ విద్యుత్ వ్యవస్థ ఏర్పాటుకు అవసరమయ్యే వస్తువుల తయారీపై పదేళ్ల వరకు పన్నులు రద్దు చేయడం. ఢిల్లీవాసులకు సురక్షిత మంచినీటి సరఫరా డీజేబీ పనితీరు మెరుగుపర్చేందుకు చర్యలు రవాణా వ్యవస్థ: మెట్రోరైలు, డీటీసీ బస్సులు, మెట్రోఫీడర్ బస్సుల సంఖ్య పెంచడం. మెట్రోరైలు,మెట్రోఫీడర్ బస్సులు,డీటీసీ బస్సులకు వర్తించేలా కామన్ స్మార్ట్‌కార్డులను అందుబాటులోకి తేవడం. విద్యార్థులకు రాయితీలపై స్మార్ట్‌కార్డుల పంపిణీ. మోనోరైలు సేవలు అందుబాటులోకి తేవడంతోపాటు మెట్రోరైలు వ్యవస్థను ఢిల్లీలోని అన్ని ప్రాంతాలకు విస్తరించడం. పార్కింగ్ సమస్య పరిష్కారానికి మాస్టర్‌ప్లాన్ అమలు. ఢిల్లీలోని విభిన్న ప్రాంతాల్లో భూగ ర్భ మల్టీలెవల్ పార్కింగ్ వ్యవస్థ ఏర్పాటు. రోగ్య సేవలు: యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ పథకం అమలులోకి తేవడం. దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన ‘ఎసెన్షియల్ డ్రగ్ పాలసీ’ని అమలులోకి తేవడం. దీని ద్వారా ప్రతి డీల్లీవాసికి 25 రకాల అత్యవసర మందులను ఉచితంగా పంపిణీ చేయడం. అధికారంలోకి వచ్చిన మొదటి రెండేళ్లలో శిశుమరణాల రేటు 28 నుంచి 15కి తగ్గించడం. అన్ని జిల్లాల్లో ట్రామాకేర్ సెంటర్ల ఏర్పాటు. మహిళల భద్రతకు: ఢిల్లీలో మహిళల భద్రత అంశాలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో 24 గంటల కాల్‌సెంటర్ల ఏర్పాటు. పనిచేసే మహిళల కోసం మరిన్ని వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లను ప్రారంభించడం. మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకునేలా పోలీసు వ్యవస్థను పటిష్టపర్చడం. మహిళల సాధికారికతకు ప్రభుత్వం తరఫున ఆర్థిక ప్రోత్సాహం అందజేయడం. పట్టణాభివృద్ధికి: అన్ని అనధికారిక కాలనీలను క్రమబద్ధీకరించడం. మౌలిక వసతుల కల్పన ‘అటల్ బీహారీ వాజ్‌పేయి జన్పునరావాస యోజన పథకం’ కింద జుగ్గీజోపిడీల్లోని పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం. యువత వ్యవసాయంలోకి వచ్చేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేవడం. న్యూస్ పేపర్ హాకర్లకు ఉచితంగా సైకిళ్లు ఎంసీడీల పరిధిలోకి బ్యాటరీ రిక్షాలను పర్యావరణ పరిరక్షణకు: ఢిల్లీలో వాయు, ధ్వని కాలుష్యాలను అరికట్టేందుకు చర్యలు. యమునా శుద్ధికి ప్రత్యేకంగా ఢిల్లీ యమునా డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయడం. యమునా నదికి ఇరువైపులా ఉన్న ప్రాం తాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడం. -
‘న్యూఢిల్లీ’లో ఆసక్తికర పోటీ
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం 70 నియోజకర్గాలలో అత్యంత ఆసక్తికరమైన పోటీ న్యూఢిల్లీ నియోజకవర్గంలో జరుగనుంది. ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌తో ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి అర్వింద్ కేజ్రీవాల్, బీజేపీ మాజీ అధ్యక్షుడు విజేందర్ గుప్తా తలపడుతున్నారు. తొలిసారిగా ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న కేజ్రీవాల్ షీలాపై గెలిచి తీరుతానన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రచార పథంలో ముందుకు దూసుకెళుతున్నారు. బీజేపీ నాయకుడు విజేంద్ర గుప్తా కూడా తనదైన శైలిలో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని, ఢిల్లీ రూపు రేఖలు మారిపోతాయని ప్రజలను తనవైపుకు తిప్పుకునేందుకు యత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ అభివృద్ధి మంత్రాన్ని జపిస్తూ భవిష్యత్‌లో నియోజకవర్గాన్ని మరింత ఆదర్శంగా తీర్చిదిద్దుతానని, అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చూస్తానని ఓటర్లకు హామీని ఇస్తున్నారు. అయితే వరుసగా నాలుగోసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న షీలాదీక్షి త్‌కు ఈ ఎన్నికలలోనే గట్టి పోటీ ఎదుర్కొంటున్నారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. షీలాదీక్షిత్ ఢిల్లీలో తన ఎన్నికల రాజకీయాలను పరాజయంతోనే ప్రారంభించారని రాజకీయ పండితులు గుర్తు చేస్తున్నారు. 1998లో తూర్పు ఢిల్లీ నుంచి లోక్‌సభకు పోటీ చేసిన ఆమె ఓడిపోయారని వారంటున్నారు. ఆ తర్వాత ఢిల్లీ అసెంబ్లీపై దృష్టి సారించారని, అప్పటినుంచి ఆమెను విజయలక్ష్మి వరించిందని చెబుతున్నారు. 2008 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ నియోజకవర్గాన్ని గోల్ మార్కెట్ నియోజకవర్గంగా పేర్కొనేవారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఇది న్యూఢిల్లీ నియోజకవర్గంగాా మారింది. అయితే 1993లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు తొలిసారిగా జరిగినప్పటి నుంచి ఈ నియోజకవర్గాన్ని ఒక్కసారి మాత్రమే బీజేపీ గెలుచుకుంది. బీజేపీ నాయకుడు కీర్తి ఆజాద్ కాంగ్రెస్‌కు చెందిన బ్రిజ్మోహన్ భామాను ఓడించారు. ఆ తర్వాత నుంచి షీలాదీక్షిత్ బరిలోకి దిగి ఈ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ కంచుకోటగా మార్చారు. 1998లో ఆమె కీర్తి ఆజాద్‌ను, 2003లో కీర్తి ఆజాద్ భార్య పూనమ్ ఆజాద్‌ను, 2008లో విజయ్ జోలీని ఆమె ఓడించారు. షీలాదీక్షిత్ ఎన్నికల బరిలోకి దిగినప్పటి నుంచి ఈ నియోజకవర్గం నుంచి మహిళా అభ్యర్థుల సంఖ్య పెరిగింది. ఈసారి కూడా మహిళలు అత్యధిక సంఖ్యలో పోటీపడుతున్నారు. స్వతంత్ర అభ్యర్థులు కూడా అత్యధికంగా ఇక్కడి నుంచి బరిలో ఉన్నారు. ఈసారి పోటీచేస్తున్న 25 మందిలో పది మంది స్వతంత్ర అభ్యర్థులున్నారు. వీవీఐపీ ఓటర్లు ఎక్కువే న్యూఢిల్లీ అభ్యర్థులపరంగానే కాక ఓటర్లపరంగానూ హేమాహేమీలున్నారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మాజీ ప్రధాని, ప్రతిపక్ష నేతలు, అధికార పక్షనేతలు పలువురు ఈ నియోజకవర్గ ఓటర్ల జాబితాలోనే ఉన్నారు. న్యూఢిల్లీ ఓటర్ల సంఖ్య 1,21 లక్షలుగా ఉంది. వీరిలో అత్యధికులు ప్రభుత్వోద్యోగులే. దక్షిణ భారతీయుల సంఖ్య కూడా భారీగానే ఉంది. లూటియన్స్ జోన్ వంటి వీఐపీ జోన్‌తోపాటు గోల్ప్ లింక్స్వంటి సంపన్న ప్రాంతాలవాసులతో పాటు కాలీబాడీ మార్గ్, తుగ్లక్ క్యాంప్ మురికివాడలు, సర్వెంట్ క్వార్టర్లలో నివసించే పేదలు ఈ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో ఉన్నారు. మిగతా నియోజకవర్గంలో ఉన్నట్టుగా గతుకుల రోడ్లు, మౌలిక సదుపాయాల కొరత వంటి అభివృద్ధిపరమైన సమస్యలు ఇక్కడ కనిపించవు. అయితే నిత్యావసర సరుకుల ధర పెరుగుదల తమను బాధిస్తోందని ఇక్కడి ఓటర్లంటున్నారు. -
పరాయి ఎవరో స్పష్టత ఇవ్వాలి
న్యూఢిల్లీ: తనను పరాయి వ్యక్తిగా పిలిచిన సీఎం షీలా దీక్షిత్‌పై న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి విజేందర్ గుప్తా మండిపడ్డారు. తాను ఢిల్లీవాసినని, అయితే సీఎం షీలా దీక్షిత్ ఏ ప్రాంతానికి చెందినవారనే దానిపై స్పష్టత ఇవ్వాలని నిలదీశారు. గత రాజకీయ వివరాలను ప్రస్తావిస్తూ ఉత్తరప్రదేశ్‌లోని కనౌజ్ నుంచి మూడుసార్లు, తూర్పు ఢిల్లీ నుంచి ఒక్కసారి దీక్షిత్ పోటీచేసి ఓడిపోయారన్నారు. ఇప్పుడు ఎవరు పరాయి వ్యక్తి? ఆమె ఏ ప్రాంతానికి చెందినవారనే దానిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నియోజకవర్గంలో పోటీచేసేందుకు ఒకరు ఘజియాబాద్ నుంచి, మరొకరు కనౌజ్ నుంచి ఇక్కడకు వచ్చారని పరోక్షంగా ఏఏపీ అధ్యక్షుడు కేజ్రీవాల్, షీలాలపై విమర్శలు గుప్పించారు. ఢిల్లీ జల్ బోర్డు కుంభకోణంలో సీబీఐ చేపట్టిన ప్రాథమిక విచారణలో దీక్షిత్‌ను కూడా విచారించాలని డిమాండ్ చేశారు. కిలో లీటర్ రూ.రెండు నుంచి రూ.49 వరకు పెరిగిందని, ఒకవేళ తనిఖీ చేయకపోతే రూ.100కు పోయినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. డీజేబీ కుంభకోణానికి బాధ్యత వహిస్తూ సీఎం వెంటనే రాజీనామా చేయాలన్నారు. న్యూఢిల్లీ నియోజకవర్గ ప్రజలు నీటి కొరత ఎదుర్కొనేందుకు స్థానిక ఎమ్మెల్యే అయిన షీలానే కారణమన్నారు. ఆమె ముఖ్యమంత్రిగా పనిచేసింది తప్ప ఏనాడు ఎమ్మెల్యేగా నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని విమరిశంచారు. ఈసారి ఎమ్మెల్యేను గెలిపించుకొని, ముఖ్యమంత్రిని తప్పిద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. -
జెయింట్ కిల్లర్ ఎవరు!
ఢిల్లీ విధానసభ ఎన్నికల్లో ఎన్నడూ లేనంతగా ముక్కోణపు పోరులో రసవత్తర, ఉత్కంఠ పోరుకు తెర లేచింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ గుండెల్లో అరవింద్ కేజ్రివాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ వెన్నులో చలిపుట్టిస్తోంది. ఎన్నికల్లో కేజ్రివాల్ తన ప్రత్యర్థుల్ని వణికించడం ముందు ఢిల్లీలోని చలి కూడా చిన్న బోతుందంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీలోని మొత్తం 70 స్థానాల్లోకెల్లా అత్యంత ఆసక్తికర పోటీ న్యూఢిల్లీ నియోజకవర్గంలోనే నెలకొంది. న్యూఢిల్లీ స్థానంలో కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీల తరఫున బరిలోకి దిగుతున్న ముగ్గురు అభ్యర్థులు నువ్వా నేనా అంటూ సవాల్ విసురుతున్నారు. వరుస విజయాలతోపాటు న్యూ ఢిల్లీ నియోజకవర్గంలో స్పష్టమైన ఆధిక్యాన్ని కొనసాగిస్తూ వస్తున్న ఢిల్లీ సీఎం షీలాదీక్షిత్ మరోసారి ఇక్కడి నుంచే తన విజయావకాశాలను పరీక్షించుకోనున్నారు. షీలాదీక్షిత్ ఎక్కడి నుంచి పోటీచేస్తే తానూ అక్కడి నుంచే బరిలోకి దిగుతానని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే ప్రకటించారు. వీరిద్దరికీ గట్టిపోటీ ఇవ్వగల అభ్యర్థికోసం జల్లెడపట్టిన బీజేపీ అధిష్టానం స్థానికంగా పట్టు, ప్రజల్లో గుర్తింపు ఉన్న విజయేంద్ర గుప్తాను పోటీకి నిలిపింది. రాజకీయాల్లో అత్యంత అనుభవం, మూడు సార్లు ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించకున్న రాజకీయ చతురత షీలా దీక్షిత్ కలిసివచ్చే అంశాలు కాగా, ఢిల్లీలో గతంలో ఎన్నడూ లేనంతగా అత్యాచారాలు, కుంభకోణాలు వెంటాడుతున్నాయి. అవినీతిపై పోరాటం ఎజెండాగా ఢిల్లీ రాజకీయాల్లో 'క్రేజీస్టార్' కేజ్రివాల్ 'చీపురు కట్ట' గుర్తుతో దూసుకుపోతున్నారు. ఇక బీజేపీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడిగా పనిచేసిన విజయేంద్ర గుప్తాది మొదటి నుంచీ దూకుడుగా ఉండే వ్యక్తిత్వం. పార్టీ నగర శాఖ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు స్థానిక సమస్యలపై పోరాటాలు చేయడం, కార్యకర్త స్థాయి నుంచి ప్రతి ఒక్కరినీ కలుపుకుపోయే తత్వం బీజేపీ అధిష్టానం వద్ద మంచి మార్కులు పడేలా చేసింది. అయితే, షీలాపై బీజేపీ గతంలో మీనాక్షి లేఖీని పోటీకి నిలిపేది. ఈసారి లేఖీ విముఖత చూపడంతో గుప్తాను తెరపైకి తెచ్చింది. ఢిల్లీ అసెంబ్లీకి డిసెంబర్ 4న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సర్వేల ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీకి 30 శాతానికి పైగా ఓట్లు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సర్వేలలో తొలుత ఏడు సీట్లకే పరిమితమైన ఆమ్ ఆద్మీ పుంజుకొని 18 సీట్ల గెలిచే విధంగా బలాన్ని పెంచుకుంది. సర్వేల పక్కన పెడితే ఈ రసవత్తర పోరులో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మహిళానేతగా షీలా దీక్షిత్, రాజకీయాల్లో లేటెస్ట్ స్టార్ కేజ్రివాల్, దూకుడు స్వభావంతో బీజేపీ అభ్యర్థి గుప్తాలు తమ వ్యూహాలు ఎత్తుగడలతో ముందుకెళుతున్నారు. ఈ ఉత్కంఠ పోరులో ఎవరు జెయింట్ కిల్లర్ గా అవతరిస్తారో వేచి చూడాల్సిందే. -
న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి షీలా, కేజ్రీవాల్, గుప్తా పోటీ
సాక్షి,న్యూఢిల్లీ: పోటీలో సమఉజ్జీలు ఉన్నప్పుడే ఎవరి బలం ఎంతో సరిగ్గా తేలేది. ఢిల్లీ విధానసభ ఎన్నికల్లో ఈసారి అదే జరగబోతోంది. ఢిల్లీ అసెంబ్లీలోని మొత్తం 70 స్థానాల్లోకెల్లా అత్యంత ఆసక్తికర పోటీ నెలకొనేది మాత్రం న్యూఢిల్లీ నియోజకవర్గంలోనే. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీల తరఫున బరిలోకి దిగుతున్న ముగ్గురు అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్లుగా ఉన్నారు. వరుస విజయాలతోపాటు న్యూ ఢిల్లీ నియోజకవర్గంలో స్పష్టమైన ఆధిక్యాన్ని కొనసాగిస్తూ వస్తున్న ఢిల్లీ సీఎం షీలాదీక్షిత్ మరోసారి ఇక్కడి నుంచే తన విజయావకాశాలను పరీక్షించుకోనున్నారు. షీలాదీక్షిత్ ఎక్కడి నుంచి పోటీచేస్తే తానూ అక్కడి నుంచే బరిలోకి దిగుతానని ఇప్పటికే ప్రకటించారు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్. వీరిద్దరికీ గట్టిపోటీ ఇవ్వగల అభ్యర్థికోసం జల్లెడపట్టిన బీజేపీ అధిష్టానం స్థానికంగా పట్టు, ప్రజల్లో గుర్తింపు ఉన్న విజయేంద్ర గుప్తాను పోటీకి నిలిపింది. గుప్తాకు కలిసొచ్చిన దూకుడు.. బీజేపీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడిగా పనిచేసిన విజయేంద్ర గుప్తాది మొదటి నుంచీ దూకుడుగా ఉండే వ్యక్తిత్వం. పార్టీ నగర శాఖ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు స్థానిక సమస్యలపై పోరాటాలు చేయడం, కార్యకర్త స్థాయి నుంచి ప్రతి ఒక్కరినీ కలుపుకుపోయే తత్వం బీజేపీ అధిష్టానం వద్ద మంచి మార్కులు పడేలా చేసింది. ఎంసీడీ ఎన్నికల్లో గుప్తా పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించారు. అయితే, షీలాపై బీజేపీ గతంలో మీనాక్షి లేఖీని పోటీకి నిలిపేది. ఈసారి లేఖీ విముఖత చూపడంతో గుప్తాను తెరపైకి తెచ్చింది. ‘కింగ్ మేకర్’ కేజ్రీవాలే: ఢిల్లీ అసెంబ్లీకి డిసెంబర్ 4న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాలం కలిసొస్తే, కేజ్రీవాలే కింగ్ అయ్యే అవకాశాలున్నాయి. సీ-ఓటర్ నిర్వహించిన తాజా సర్వే ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీకి 27 శాతం ఓట్లు లభించే అవకాశాలు ఉన్నాయి. ఆరువారాల కిందట సీ-ఓటర్ నిర్వహించిన తొలి సర్వేలో ఈ పార్టీకి 20 శాతం ఓట్లు దక్కే అవకాశాలు ఉన్నట్లు వెల్లడైంది. అప్పుడు ఏడు సీట్లు లభిస్తాయనివెల్లడవగా, తాజాగా 18 సీట్లు వస్తాయని వెల్లడైంది. అధికార కాంగ్రెస్ పరిస్థితి తారుమారైంది. తొలి సర్వేలో 29 స్థానాలు లభించనున్నట్లు వెల్లడవగా, తాజాగా 24 మాత్రమే దక్కే సూచనలు ఉన్నట్లు తేలింది. -
షీలాకు జరిమానా
న్యూఢిల్లీ: బీజేపీ నాయకుడు విజేందర్ గుప్తాపై దాఖలు చేసిన పరువునష్టం కేసు విచారణకు హాజరుకాని సీఎం షీలా దీక్షిత్‌కు స్థానిక కోర్టు రూ.ఐదు వేల జరిమానా విధించింది. జనవరి 27న తప్పకుండా కేసు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసులో ప్రశ్నించేందుకు, క్రాస్ ఎగ్జామినేషన్ చేసేందుకు ఫిర్యాదుదారు దీక్షిత్ కోర్టుకి రావాలని గతంలోనే ఆదేశించినా ఆమె పట్టించుకోకపోవడంతో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ నమ్రితా ఆగర్వాల్ రూ.ఐదు వేల జరిమానాను విధించారు. ఈసారి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని దీక్షిత్ పెట్టుకున్న అభ్యర్థనను మన్నించిన ఆమె తదుపరి విచారణ తేదీ 2014, జనవరి 27న తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల జాబితా తయారుచేసే పనిలో నిమగ్నమవడంతో పాటు ప్రచారంలో బిజీగా ఉండటం వల్ల కోర్టుకు హాజరుకాలేకపోయారని షీలా తరఫు న్యాయవాది అన్నారు. ఇదే కోర్టు నుంచి గతంలో ఆదేశాలు వచ్చినా పట్టించుకోకుండా సీఎం షీలా దీక్షిత్ తెలివి తక్కువదని గుప్తా వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ఈ కేసులో నిందితుడు కావడంతో కావాలనే తన క్లయింట్‌ను వేధిస్తున్నారని గుప్తా తరఫు న్యాయవాది అజయ్ బుర్మన్ అన్నారు.డిసెంబర్లో జరిగే ఎన్నికల్లో రోహిణి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నా గుప్తా కోర్టు ముందు హాజరయ్యారని తెలిపారు. గతేడాది జరిగిన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో విద్యుత్ కంపెనీలతో లలూచీపడి సహాయం తీసుకున్నానని అభ్యంతరకర పదజాలాన్ని వినియోగించిన గుప్తాపై దీక్షిత్ పరువు నష్టం దావా దాఖలు చేసిన సంగతి తెలిసిందే. -
త్వరలోనే బీజేపీ అభ్యర్థుల జాబితా
సాక్షి, న్యూఢిల్లీ: ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించి జోరు మీదున్న బీజేపీ నాయకులు ఈ నెల 29న మోడీ సభ ముగిసిన వెంటనే అభ్యర్థుల పేర్లు ప్రకటించనున్నట్టు తెలిపారు. బుధవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీజేపీ ఢిల్లీ ప్రదేశ్ అధ్యక్షుడు విజయ్‌గోయల్ మాట్లాడారు. ప్రస్తుతానికి పార్టీ శ్రేణులంతా ఈ నెల 29న జపనీస్పార్క్లో నిర్వహించనున్న ర్యాలీపైనే దృష్టిపెట్టాయన్నారు. సభను విజయవంతం చేశాక మిగిలిన కార్యక్రమాలపై దృష్టి సారిస్తామన్నారు. ఈ నెల 29 తర్వాత అభ్యర్థుల జాబితా ప్రకటన ఉంటుందన్నారు. అభ్యర్థుల ఎంపికలో మొదటి ప్రాధాన్యం గెలుపునకే ఇస్తున్నట్టు ఢిల్లీ ఎన్నికల ఇన్చార్జీ నితిన్‌గడ్కరీ పేర్కొన్నారు. ‘మా పార్టీ సంప్రదాయం ప్రకారం నాయకత్వ నిర్ణయాలు తీసుకుంటాం. ఒకసారి అభ్యర్థిని ఎంపిక చే శాక , వారికి పార్టీ శ్రేణుల పూర్తి సహకారం ఉంటుంది. 15 ఏళ్ల కాంగ్రెస్ పాలనను అంతమొందిస్తాం. బీజేపీ భారీవిజయాన్ని నమోదు చేస్తుంది’అని నితిన్‌గడ్కరీ పేర్కొన్నారు. ఉల్లిని విక్రయించండి.. చుక్కలనంటుతున్న ఉల్లిధరలకు సర్కార్ నిర్లక్ష్యమే కారణమని విజయ్‌గోయల్ ఆరోపించారు. నగర ప్రభుత్వం ఉల్లి ఎగుమతులను తగ్గించాలని కోరినా కేంద్రంలోని కాంగ్రెస్ పట్టించుకోలేదన్నారు. ఈ ఏడాదిలో ఉల్లి ధరలు 245 శాతం పెరిగాయన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు ఉల్లి విక్రయ కేంద్రాలను తెరవాలని గోయల్ సూచించారు. వీలైనంత తక్కువ ధరకు ఉల్లిని ప్రజలకు విక్రయించాలన్నారు. గతేడాది ఆగస్టుతో పోలిస్తే ఈ ఏడాది కూరగాయల ధరలు 77శాతం పెరిగాయన్నారు. మాంసం, గుడ్లు,చేపలు తదితరాలపై 19 శాతం పెరుగుదల నమోదైనట్టు పేర్కొన్నారు. ర్యాలీకి విస్తృత ఏర్పాట్లు: విజయేంద్ర గుప్తా బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈనెల 29న నిర్వహించనున్న ర్యాలీ కార్యక్రమానికి బీజేపీ ఢిల్లీప్రదేశ్ నాయకులు విస్తృత ఏర్పాటు చేస్తున్నారు. ర్యాలీని విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నట్టు బీజేజీ ఢిల్లీప్రదేశ్ మాజీ అధ్యక్షుడు విజయేంద్రగుప్తా తెలిపారు. బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ర్యాలీ ఏర్పాట్లపై ఆయన మాట్లాడారు. నాలుగు లక్షల మంది కార్యకర్తలు ర్యాలీలో పాల్గొంటారని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. సభ నిర్వహించనున్న రోహిణి, జపనీస్ పార్క్‌వద్ద భద్రత, ట్రాఫిక్ ఏర్పాట్లకు సంబంధించిన అంశాలపై పార్టీ సీనియర్ నాయకులతోపాటు ఢిల్లీ పోలీస్ అధికారులతో ఆయన చర్చించారు. గురువారం ఉదయం 11 గంటల నుంచి ఏర్పాట్లు ప్రారంభిస్తామన్నారు.