త్వరలోనే బీజేపీ అభ్యర్థుల జాబితా
Published Thu, Sep 19 2013 1:47 AM | Last Updated on Fri, Sep 1 2017 10:50 PM
సాక్షి, న్యూఢిల్లీ: ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించి జోరు మీదున్న బీజేపీ నాయకులు ఈ నెల 29న మోడీ సభ ముగిసిన వెంటనే అభ్యర్థుల పేర్లు ప్రకటించనున్నట్టు తెలిపారు. బుధవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీజేపీ ఢిల్లీ ప్రదేశ్ అధ్యక్షుడు విజయ్‌గోయల్ మాట్లాడారు. ప్రస్తుతానికి పార్టీ శ్రేణులంతా ఈ నెల 29న జపనీస్‌పార్క్‌లో నిర్వహించనున్న ర్యాలీపైనే దృష్టిపెట్టాయన్నారు. సభను విజయవంతం చేశాక మిగిలిన కార్యక్రమాలపై దృష్టి సారిస్తామన్నారు. ఈ నెల 29 తర్వాత అభ్యర్థుల జాబితా ప్రకటన ఉంటుందన్నారు. అభ్యర్థుల ఎంపికలో మొదటి ప్రాధాన్యం గెలుపునకే ఇస్తున్నట్టు ఢిల్లీ ఎన్నికల ఇన్‌చార్జీ నితిన్‌గడ్కరీ పేర్కొన్నారు. ‘మా పార్టీ సంప్రదాయం ప్రకారం నాయకత్వ నిర్ణయాలు తీసుకుంటాం. ఒకసారి అభ్యర్థిని ఎంపిక చే శాక , వారికి పార్టీ శ్రేణుల పూర్తి సహకారం ఉంటుంది. 15 ఏళ్ల కాంగ్రెస్ పాలనను అంతమొందిస్తాం. బీజేపీ భారీవిజయాన్ని నమోదు చేస్తుంది’అని నితిన్‌గడ్కరీ పేర్కొన్నారు.
ఉల్లిని విక్రయించండి..
చుక్కలనంటుతున్న ఉల్లిధరలకు సర్కార్ నిర్లక్ష్యమే కారణమని విజయ్‌గోయల్ ఆరోపించారు. నగర ప్రభుత్వం ఉల్లి ఎగుమతులను తగ్గించాలని కోరినా కేంద్రంలోని కాంగ్రెస్ పట్టించుకోలేదన్నారు. ఈ ఏడాదిలో ఉల్లి ధరలు 245 శాతం పెరిగాయన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు ఉల్లి విక్రయ కేంద్రాలను తెరవాలని గోయల్ సూచించారు. వీలైనంత తక్కువ ధరకు ఉల్లిని ప్రజలకు విక్రయించాలన్నారు. గతేడాది ఆగస్టుతో పోలిస్తే ఈ ఏడాది కూరగాయల ధరలు 77శాతం పెరిగాయన్నారు. మాంసం, గుడ్లు,చేపలు తదితరాలపై 19 శాతం పెరుగుదల నమోదైనట్టు పేర్కొన్నారు.
ర్యాలీకి విస్తృత ఏర్పాట్లు: విజయేంద్ర గుప్తా
బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈనెల 29న నిర్వహించనున్న ర్యాలీ కార్యక్రమానికి బీజేపీ ఢిల్లీప్రదేశ్ నాయకులు విస్తృత ఏర్పాటు చేస్తున్నారు. ర్యాలీని విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నట్టు బీజేజీ ఢిల్లీప్రదేశ్ మాజీ అధ్యక్షుడు విజయేంద్రగుప్తా తెలిపారు. బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ర్యాలీ ఏర్పాట్లపై ఆయన మాట్లాడారు. నాలుగు లక్షల మంది కార్యకర్తలు ర్యాలీలో పాల్గొంటారని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. సభ నిర్వహించనున్న రోహిణి, జపనీస్ పార్క్‌వద్ద భద్రత, ట్రాఫిక్ ఏర్పాట్లకు సంబంధించిన అంశాలపై పార్టీ సీనియర్ నాయకులతోపాటు ఢిల్లీ పోలీస్ అధికారులతో ఆయన చర్చించారు. గురువారం ఉదయం 11 గంటల నుంచి ఏర్పాట్లు ప్రారంభిస్తామన్నారు.
Advertisement