ఎన్నికలకే పోదాం..!
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటుపై ఇంకా ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉన్న భారతీయ జనతా పార్టీపై ఢిల్లీ విద్యార్థి సంఘం (డూసూ) ఎన్నికల్లో అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఘన విజయం సాధించడంతో ఒత్తిడి పెరిగింది. నగరంలో ప్రభుత్వం ఏర్పాటుచేయరాదని, వెంటనే అసెంబ్లీ ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ నేతలు డూసూ ఎన్నికల్లో ఏబీవీపీ విజయా న్ని చూపుతూ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ ఘనవిజయం సాధిస్తుందని అంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి గల ప్రజాదరణ వల్లనే డూసూ ఎన్నికల్లో ఏబీవీపీ ఘనవిజయం సాధిం చిందని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటై నాలుగు నెలల తర్వాత కూడా ప్రధాని నరేంద్రమోడీకి ప్రజాదరణ తగ్గలేదని ఈ ఎన్నికలు స్పష్టం చేస్తున్నాయని వారు భావిస్తున్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై నగర బీజేపీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
మెజారిటీ తక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్లడమే మంచిదని, నరేంద్ర మోడీ ప్రభావం ఉన్న దరిమిలా అసెంబ్లీ ఎన్నికలు జరిగితే బీజేపీకి అఖండ విజయం ఖాయమని వారు అంటున్నారు. అయితే ఇప్పటి పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్లడం చాలామంది బీజేపీ ఎమ్మెల్యేలకే సుతరామూ ఇష్టం లేదని అనధికారికంగా వార్తలు వెలువడుతున్నాయి. కొంత ‘రిస్క్’ తీసుకుని ఇప్పుడే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తే ఏం ఇబ్బంది ఉండదని వారి ఆలోచనగా తెలుస్తోంది. ఈ రెండు వర్గాలు వారివారి వాదనలపై గట్టిగా నిలబడటంతో ఆ పార్టీ అధిష్టానం కూడా ఎటూ పాలుపోని స్థితిలో ఉంది. కాగా, గత 12వ తేదీన ఢిల్లీ యూనివర్సిటీలో జరిగిన విద్యార్థి సంఘాల ఎన్నికల్లో బీజేపీ అనుబంధ సంస్థ ఏబీవీపీ ఘన విజయం సాధించింది. దీంతో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లడమే మంచిదంటున్న వారికి ఈ విజయం బాగా కలిసివచ్చింది. దాంతో వారు ఎన్నికలపై తమ స్వరం పెంచారు.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రజాదరణ తగ్గలేదన్న విషయాన్ని డూసూ ఎన్నికల్లో ఏబీవీపీ చారిత్రక విజయం రుజువు చేసిందని, అసెంబ్లీ ఎన్నికలు జరిపించినా పార్టీ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని వారు అంటున్నారు. యువత బీజేపీపై మక్కువ కలిగి ఉందన్న విషయాన్ని ఈ ఎన్నికలు నిర్ధారించాయని వారు అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీపార్ట్టీకి మద్దతు ఇచ్చిన యువ ఓటర్లు లోక్‌సభ ఎన్నికల నాటికి నరేంద్ర మోడీ పట్ల ఆకర్షితులై బీజేపీవైపు మళ్లారని, ఇప్పటికీ వారు బీజేపీ వెంటే ఉన్నారని మధ్యంతర ఎన్నికలు జరిపించాలని కోరుతున్నవారు గణాంకాలతో వివరిస్తున్నారు. తగిన సంఖ్యాబలం లేకపోయినా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి అప్రతిష్ట మూటగుట్టుకోవడానికి బదులు వెంటనే ఎన్నిక లు జరిపించాలని వారు కోరుతున్నారు. కాంగ్రెస్ వరుస ఓటముల నుంచి కోలుకోలేదని, ఆ పార్టీ ఇంకా బలహీనంగానే ఉందని, ఆమ్ ఆద్మీ పార్టీ నిజరూపం ప్రజ లకు తెలిసిపోయిం దని ఇలాంటి పరిస్థితిల్లో ఎన్నికలు జరిపించ డంవల్ల బీజేపీకే ఎక్కువ లాభమని వారు అంటున్నారు.