మౌనం నేరాంగీకారమే..!
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు చేస్తున్న ఖర్చులో 80 శాతానికిపైగా విదేశీ విరాళాల ద్వారా వచ్చినవేనని, ఆ వివరాలను రెండు పార్టీలు వెల్లడించాలని ఆమ్ ఆద్మీ పార్టీ సవాలు విసిరింది. విదేశీ విరాళాలపై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఇరు పార్టీలు మౌనంగా ఉండడమంటే తప్పును ఒప్పుకున్నట్లేనని ఆప్ విమర్శించింది. యునెటైడ్ కింగ్‌డమ్‌కు చెందిన వేదాంతా రిసోర్సెస్ నుంచి విరాళాలు తీసుకున్న కాంగ్రెస్, బీజేపీలపై విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా కోర్టు తీర్పుపై కాంగ్రెస్, బీజేపీల నేతలెవరూ ఇప్పటిదాకా స్పందించకపోవడాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ అవకాశంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది.
కోర్టు తీర్పుపై మాట్లాడకపోవడమంటే తాము నేరం చేశామని ఇరు పార్టీలు ఒప్పుకున్నట్లేనని ఆప్ శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ విషయమై సంబంధిత అధికారులు జరిపే దర్యాప్తుపై ఎన్నికల సంఘం దృష్టిపెట్టాలని ఆప్ డిమాండ్ చేసింది. హోంమంత్రిత్వశాఖ క్లీన్‌చిట్ ఇచ్చినంత మాత్రాన ఇరు పార్టీలు చట్టాన్ని ఉల్లంఘించలేదని చెప్పలేమని, దీంతోనే దర్యాప్తు పూర్తయినట్లు కాదని ఆ పార్టీ పేర్కొంది. ఎన్నికల్లో నల్లధనం వినియోగాన్ని నియంత్రించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్న ఎన్నికల సంఘం ఇటువంటి వాటిపై కూడా దృష్టిపెట్టాలని, ఈ విరాళాలపై పూర్తి వివరాలు ఇవ్వాల్సిందిగా ఎన్నికల సంఘం ఇరు పార్టీలను ఆదేశించాలని ఆప్ డిమాండ్ చేసింది.
హోంమంత్రి ఎందుకు మాట్లాడరు?
ఢిల్లీ హైకోర్టు తీర్పు తర్వాత కూడా భారత హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే మాట్లాడకపోవడంపై ఆప్ అభ్యంతరం వ్యక్తం చేసింది. కోర్టు తీర్పు తర్వాత కూడా షిండే ఎందుకు మాట్లాడరని నిలదీసింది. అంటే కోర్టుకు హోంమంత్రిత్వశాఖ తప్పుడు నివేదిక ఇచ్చిందా? అలా కానప్పుడు కోర్టు తీర్పుపై ఎందుకు మాట్లాడరు? అంటూ ఆప్ విడుదల చేసిన ప్రకటన ప్రశ్నించింది.