సాక్షి, న్యూఢిల్లీ : స్థానిక బీజేపీ ప్రముఖుల్లో ఒకరైన విజేందర్‌గుప్తా ఈసారి రోహిణీ స్థానం నుంచి బరిలోకి దిగారు. గతంలో మాదిరిగా సురక్షిత సీటు కోసం తాపత్రయపడకుండా కాంగ్రెస్ దిగ్గజాలతో ఎన్నికల్లో తలపడి రాజకీయ భవితవ్యాన్ని పార్టీ కోసం పణంగా పెట్టిన గుప్తా...ఈసారి గెలుపు కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. డూసూ ఉపాధ్యక్షుడిగా విద్యార్థి సంఘ రాజకీయాల్లోకి అడుగిడిన గుప్తా ఆ తర్వాత రెండుసార్లు ఎమ్సీడీ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ఎమ్సీడీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా కూడా పనిచేశారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఆయనను కాంగ్రెస్ నేత కపిల్‌సిబల్‌కు వ్యతిరేకంగా చాందినీచౌక్ స్థానం నుంచి నిలబెట్టింది.
ఆ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీ రాష్ర్ట శాఖ అధ్యక్షుడయ్యారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో బీజేపీ ఓటమి తరువాత పార్టీ పగ్గాలు చేపట్టారు. స్థానికంగా పార్టీని బలోపేతం చేసేందుకు కృషిచేశారు. గుప్తా నేతృత్వంలోనే మూడు మునిపల్ కార్పొరేషన్లలో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. 2014 విధానసభ ఎన్నికల్లో మరోమారు పార్టీ ఆయనను షీలాదీక్షిత్, అరవింద్ కేజ్రీవాల్‌లకు వ్యతిరేకంగా న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా బరిలోకి దింపింది. ఆ ఎన్నికల్లోనూ ఓటమి పాలయ్యారు. రోహిణీ నుంచి బరిలోకి దిగిన గుప్తాకు వ్యతిరేకంగా చరంజీలాల్ గుప్తా( ఆప్), సుఖ్‌బీర్ శర్మ (కాంగ్రెస్) పోటీ చేస్తున్నారు.
గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న గుప్తా
Published Tue, Jan 27 2015 10:42 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement