
బీజేపీ దళిత, సిక్కు వ్యతిరేకి అంటూ ఆప్ నిరసన
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌గా అధికార బీజేపీ శాసనసభ్యుడు విజేందర్ గుప్తా ఎన్నికయ్యారు. కొత్తగా కొలువుదీరిన ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి మొదలయ్యాయి. సెషన్ ప్రారంభానికి ముందు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా బీజేపీ ఎమ్మెల్యే అర్వీందర్ సింగ్ లవ్లీతో ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేయించారు. అత్యంత సీనియర్ ఎమ్మెల్యే అయిన లవ్లీ నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరితో ప్రమాణం చేయించారు.
అనంతరం, మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన గుప్తా పేరును స్పీకర్ పదవికి ప్రతిపాదిస్తూ సీఎం రేఖా గుప్తా, మంత్రి రవీందర్ ఇంద్రజ్ రెండు తీర్మానాలను ప్రవేశపెట్టగా, వీటిని మంత్రులు పర్వేశ్ వర్మ, మంజిందర్ సింగ్ బలపరిచారు. మూడువాణి ఓటుతో తీర్మానాలను సభ ఆమోదించిందని ప్రొటెం స్పీకర్ అర్వీందర్ సింగ్ లవ్లీ ప్రకటించారు. దీంతో, సీఎం రేఖా గుప్తా, ప్రతిపక్ష నేత ఆతిశీ వెంట రాగా కొత్త స్పీకర్ కుర్చీలో ఆసీనులయ్యారు.
స్పీకర్ విజేందర్ గుప్తాకు సీఎం రేఖా గుప్తా శుభాకాంక్షలు తెలపగా, ఆప్‌కు చెందిన ప్రతిపక్ష నేత ఆతిశీ మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారు. దళిత, సిక్కు వ్యతిరేక పార్టీ ఢిల్లీ అసెంబ్లీకి సారథ్యం వహించడం దురదృష్టకరమంటూ వ్యాఖ్యానించారు. సీఎం కార్యాలయంలో బీఆర్ అంబేడ్కర్, భగత్ సింగ్‌ల ఫొటోలను తీసేయడం చూస్తే బీజేపీ దళిత వ్యతిరేక వైఖరి తేటతెల్లమవుతోందని ఆరోపించారు. దీంతో, సభలో తీవ్ర గందరగోళం నెలకొంది.
అధికార, ప్రతిపక్ష సభ్యుల పోటాపోటీ నినాదాలతో సభ 15 నిమిషాలపాటు వాయిదా పడింది. ఢిల్లీ సీఎం కార్యాలయంలో బీఆర్ అంబేడ్కర్ చిత్రపటాన్ని తొలగించవద్దని అనంతరం ఆప్ చీఫ్ కేజ్రీవాల్ ‘ఎక్స్’లో బీజేపీని కోరారు. ప్రధాని మోదీ ఫొటో పెట్టి, అంబేడ్కర్ ఫొటోను తీసేయడం కోట్లాది మంది ఆయన అనుచరుల మనస్సులను గాయపరిచినట్లేనన్నారు.
ఆరు భాషల్లో ఎమ్మెల్యేల ప్రమాణం
సెషన్ ప్రారంభానికి ముందు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా బీజేపీ ఎమ్మెల్యే అర్వీందర్ సింగ్ లవ్లీతో ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేయించారు. అత్యంత సీనియర్ ఎమ్మెల్యే అయిన లవ్లీ నూతన ఎమ్మెల్యేలందరితో ప్రమాణం చేయించారు. వీరు హిందీ, ఇంగ్లిష్, సంస్కృతం, ఉర్దూ, మైథిలి, పంజాబీ భాషల్లో ప్రమాణం చేయడంతో అసెంబ్లీలో భాషాపరమైన వైవిధ్యం ప్రతిఫలించింది.
Comments
Please login to add a commentAdd a comment