ఆనాడు మార్షల్స్ ఈడ్చుకెళ్లిన నేత.. నేడు ఢిల్లీ స్పీకర్‌! | BJP Vijender Gupta Now As Delhi Assembly Speaker | Sakshi
Sakshi News home page

ఆనాడు మార్షల్స్ ఈడ్చుకెళ్లిన నేత.. నేడు ఢిల్లీ స్పీకర్‌!

Published Thu, Feb 20 2025 12:28 PM | Last Updated on Thu, Feb 20 2025 12:37 PM

BJP Vijender Gupta Now As Delhi Assembly Speaker

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణం చేయబోతున్నారు. దాదాపు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతోంది. ఈ క్రమంలో రేఖా గుప్తాతో పాటుగా మరో ఆరుగురు నేతలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఇక, ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌గా బీజేపీ నుంచి రోహిణి ఎమ్మెల్యే విజేందర్‌ గుప్తాకు అవకాశం ఇచ్చారు. అయితే, గతంలో(2015) విజేందర్‌ను సభ నుంచి మార్షల్స్‌ ఎత్తుకెళ్లిన ఘటనను బీజేపీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు.

రోహిణి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజేందర్‌ గుప్తా మూడోసారి ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో స్పీకర్‌గా తనకు అవకాశం ఇవ్వడంపై విజేందర్‌ గుప్తా స్పందించారు. ఈ క్రమంలో విజేందర్‌ మాట్లాడుతూ.. ‘నాకు స్పీకర్‌ స్థానం ఇచ్చినందుకు పార్టీకి ధన్యవాదాలు. సభకు సంబంధించి నా బాధ్యతలను నేను సక్రమంగా నిర్వర్తిస్తాను. గత ఆప్ ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన కాగ్ నివేదికలను నేను సభ ముందుకు తీసుకువస్తాను’ అని తెలిపారు.

అయితే, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు విజేందర్‌ గుప్తా, ఇతర బీజేపీ ఎమ్మెల్యేలు ఆప్‌ సర్కార్‌ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆప్‌ ప్రభుత్వం కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) నివేదికలను సమర్పించకుండా అడ్డుకుంటోందని ఆరోపిస్తూ గతంలో కోర్టును ఆశ్రయించారు. కాగ్‌ నివేదికలను బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు.

2015లో ఏం జరిగింది?
నవంబర్ 30, 2015న ఢిల్లీ అసెంబ్లీలో ఆప్‌, బీజేపీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. నాటి ఆప్‌ ఎమ్మెల్యే అల్కా లంబా(ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్నారు), ఓపీ శర్మపై విజేందర్‌ గుప్తా అవమానకర వ్యాఖ్యలు చేశారని అధికార పార్టీ నేతలు వ్యాఖ్యలు చేశారు. దీంతో, సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో అప్పటి అసెంబ్లీ స్పీకర్‌ రామ్ నివాస్ గోయెల్.. విజేందర్ గుప్తాను బయటకు పంపించి వేశారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో విజేందర్‌ను సభ నుంచి మార్షల్స్‌ బయటకు ఎత్తుకెళ్లారు. ఈ సందర్భంగా విజేందర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆప్‌ నేతల పట్ల స్పీకర్‌ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇక, ఇప్పుడు విజేందర్‌కు స్పీకర్ అవకాశం రావడంతో ఆనాటి పరిస్థితులను బీజేపీ నేతలు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement