సాక్షి,న్యూఢిల్లీ: పోటీలో సమఉజ్జీలు ఉన్నప్పుడే ఎవరి బలం ఎంతో సరిగ్గా తేలేది. ఢిల్లీ విధానసభ ఎన్నికల్లో ఈసారి అదే జరగబోతోంది. ఢిల్లీ అసెంబ్లీలోని మొత్తం 70 స్థానాల్లోకెల్లా అత్యంత ఆసక్తికర పోటీ నెలకొనేది మాత్రం న్యూఢిల్లీ నియోజకవర్గంలోనే. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీల తరఫున బరిలోకి దిగుతున్న ముగ్గురు అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్లుగా ఉన్నారు. వరుస విజయాలతోపాటు న్యూ ఢిల్లీ నియోజకవర్గంలో స్పష్టమైన ఆధిక్యాన్ని కొనసాగిస్తూ వస్తున్న ఢిల్లీ సీఎం షీలాదీక్షిత్ మరోసారి ఇక్కడి నుంచే తన విజయావకాశాలను పరీక్షించుకోనున్నారు. షీలాదీక్షిత్ ఎక్కడి నుంచి పోటీచేస్తే తానూ అక్కడి నుంచే బరిలోకి దిగుతానని ఇప్పటికే ప్రకటించారు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్. వీరిద్దరికీ గట్టిపోటీ ఇవ్వగల అభ్యర్థికోసం జల్లెడపట్టిన బీజేపీ అధిష్టానం స్థానికంగా పట్టు, ప్రజల్లో గుర్తింపు ఉన్న విజయేంద్ర గుప్తాను పోటీకి నిలిపింది.
గుప్తాకు కలిసొచ్చిన దూకుడు..
బీజేపీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడిగా పనిచేసిన విజయేంద్ర గుప్తాది మొదటి నుంచీ దూకుడుగా ఉండే వ్యక్తిత్వం. పార్టీ నగర శాఖ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు స్థానిక సమస్యలపై పోరాటాలు చేయడం, కార్యకర్త స్థాయి నుంచి ప్రతి ఒక్కరినీ కలుపుకుపోయే తత్వం బీజేపీ అధిష్టానం వద్ద మంచి మార్కులు పడేలా చేసింది. ఎంసీడీ ఎన్నికల్లో గుప్తా పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించారు. అయితే, షీలాపై బీజేపీ గతంలో మీనాక్షి లేఖీని పోటీకి నిలిపేది. ఈసారి లేఖీ విముఖత చూపడంతో గుప్తాను తెరపైకి తెచ్చింది.
‘కింగ్ మేకర్’ కేజ్రీవాలే: ఢిల్లీ అసెంబ్లీకి డిసెంబర్ 4న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాలం కలిసొస్తే, కేజ్రీవాలే కింగ్ అయ్యే అవకాశాలున్నాయి. సీ-ఓటర్ నిర్వహించిన తాజా సర్వే ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీకి 27 శాతం ఓట్లు లభించే అవకాశాలు ఉన్నాయి. ఆరువారాల కిందట సీ-ఓటర్ నిర్వహించిన తొలి సర్వేలో ఈ పార్టీకి 20 శాతం ఓట్లు దక్కే అవకాశాలు ఉన్నట్లు వెల్లడైంది. అప్పుడు ఏడు సీట్లు లభిస్తాయనివెల్లడవగా, తాజాగా 18 సీట్లు వస్తాయని వెల్లడైంది. అధికార కాంగ్రెస్ పరిస్థితి తారుమారైంది. తొలి సర్వేలో 29 స్థానాలు లభించనున్నట్లు వెల్లడవగా, తాజాగా 24 మాత్రమే దక్కే సూచనలు ఉన్నట్లు తేలింది.
న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి షీలా, కేజ్రీవాల్, గుప్తా పోటీ
Published Fri, Nov 8 2013 2:57 AM | Last Updated on Sat, Sep 2 2017 12:23 AM
Advertisement