జెయింట్ కిల్లర్ ఎవరు!
జెయింట్ కిల్లర్ ఎవరు!
Published Mon, Nov 11 2013 12:32 PM | Last Updated on Wed, Oct 17 2018 3:46 PM
ఢిల్లీ విధానసభ ఎన్నికల్లో ఎన్నడూ లేనంతగా ముక్కోణపు పోరులో రసవత్తర, ఉత్కంఠ పోరుకు తెర లేచింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ గుండెల్లో అరవింద్ కేజ్రివాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ వెన్నులో చలిపుట్టిస్తోంది. ఎన్నికల్లో కేజ్రివాల్ తన ప్రత్యర్థుల్ని వణికించడం ముందు ఢిల్లీలోని చలి కూడా చిన్న బోతుందంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఢిల్లీ అసెంబ్లీలోని మొత్తం 70 స్థానాల్లోకెల్లా అత్యంత ఆసక్తికర పోటీ న్యూఢిల్లీ నియోజకవర్గంలోనే నెలకొంది. న్యూఢిల్లీ స్థానంలో కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీల తరఫున బరిలోకి దిగుతున్న ముగ్గురు అభ్యర్థులు నువ్వా నేనా అంటూ సవాల్ విసురుతున్నారు. వరుస విజయాలతోపాటు న్యూ ఢిల్లీ నియోజకవర్గంలో స్పష్టమైన ఆధిక్యాన్ని కొనసాగిస్తూ వస్తున్న ఢిల్లీ సీఎం షీలాదీక్షిత్ మరోసారి ఇక్కడి నుంచే తన విజయావకాశాలను పరీక్షించుకోనున్నారు. షీలాదీక్షిత్ ఎక్కడి నుంచి పోటీచేస్తే తానూ అక్కడి నుంచే బరిలోకి దిగుతానని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే ప్రకటించారు. వీరిద్దరికీ గట్టిపోటీ ఇవ్వగల అభ్యర్థికోసం జల్లెడపట్టిన బీజేపీ అధిష్టానం స్థానికంగా పట్టు, ప్రజల్లో గుర్తింపు ఉన్న విజయేంద్ర గుప్తాను పోటీకి నిలిపింది.
రాజకీయాల్లో అత్యంత అనుభవం, మూడు సార్లు ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించకున్న రాజకీయ చతురత షీలా దీక్షిత్ కలిసివచ్చే అంశాలు కాగా, ఢిల్లీలో గతంలో ఎన్నడూ లేనంతగా అత్యాచారాలు, కుంభకోణాలు వెంటాడుతున్నాయి. అవినీతిపై పోరాటం ఎజెండాగా ఢిల్లీ రాజకీయాల్లో 'క్రేజీస్టార్' కేజ్రివాల్ 'చీపురు కట్ట' గుర్తుతో దూసుకుపోతున్నారు. ఇక బీజేపీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడిగా పనిచేసిన విజయేంద్ర గుప్తాది మొదటి నుంచీ దూకుడుగా ఉండే వ్యక్తిత్వం. పార్టీ నగర శాఖ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు స్థానిక సమస్యలపై పోరాటాలు చేయడం, కార్యకర్త స్థాయి నుంచి ప్రతి ఒక్కరినీ కలుపుకుపోయే తత్వం బీజేపీ అధిష్టానం వద్ద మంచి మార్కులు పడేలా చేసింది. అయితే, షీలాపై బీజేపీ గతంలో మీనాక్షి లేఖీని పోటీకి నిలిపేది. ఈసారి లేఖీ విముఖత చూపడంతో గుప్తాను తెరపైకి తెచ్చింది.
ఢిల్లీ అసెంబ్లీకి డిసెంబర్ 4న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సర్వేల ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీకి 30 శాతానికి పైగా ఓట్లు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సర్వేలలో తొలుత ఏడు సీట్లకే పరిమితమైన ఆమ్ ఆద్మీ పుంజుకొని 18 సీట్ల గెలిచే విధంగా బలాన్ని పెంచుకుంది. సర్వేల పక్కన పెడితే ఈ రసవత్తర పోరులో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మహిళానేతగా షీలా దీక్షిత్, రాజకీయాల్లో లేటెస్ట్ స్టార్ కేజ్రివాల్, దూకుడు స్వభావంతో బీజేపీ అభ్యర్థి గుప్తాలు తమ వ్యూహాలు ఎత్తుగడలతో ముందుకెళుతున్నారు. ఈ ఉత్కంఠ పోరులో ఎవరు జెయింట్ కిల్లర్ గా అవతరిస్తారో వేచి చూడాల్సిందే.
Advertisement