వెనక్కి తగ్గం
Published Sat, Jan 18 2014 11:01 PM | Last Updated on Sat, Sep 2 2017 2:45 AM
న్యూఢిల్లీ:షీలా దీక్షిత్ సర్కార్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై త్వరలోనే విచారణ చేస్తామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హామీని ఇచ్చారు. కామన్వెల్త్ గేమ్స్, ఢిల్లీ జల్ బోర్డు నివేదికలను ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నామని, కాంగ్రెస్‌పై చర్యల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన శనివారం మీడియాకు తెలిపారు. ఈ అవినీతి మూలాలను వెలికితీసేందుకు అవినీతి నిరోధక బృందాన్ని(ఏసీబీ) ఏర్పాటుచేస్తామన్నారు. కొన్నిరోజుల్లోనే గత ప్రభుత్వంపై చర్యలు తీసుకోవడాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఇస్తున్న ఎనిమిది మంది ఎమ్మెల్యేల మద్దతును వెనక్కి తీసుకుంటే ఏమీ చేస్తారన్న మీడియా ప్రశ్నకు సమాధానమిస్తూ అలాంటి బెదిరింపులకు భయపడమన్నారు.
అవినీతి విషయాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఒకవేళ సర్కార్ రేపు వెళ్లేది, ఈరోజు పోతుందన్నారు. ఢిల్లీ రాష్ట్ర పరిధిలోకి పోలీసుల వ్యవస్థ వచ్చేలా ప్రయత్నిస్తున్నానని తెలిపారు. అయితే తమపైనే చర్యలు తీసుకోవాలంటూ కొందరు పోలీసులు ఫిర్యాదుచేయడంపై కేజ్రీవాల్ అగ్రహం వ్యక్తం చేశారు. పనిచేయని వారిపై మాత్రమే చర్యలు తీసుకోవాలని కోరామని, అయితే వాళ్లు ఈ విధంగా వ్యవహరించడం తగదన్నారు. సెక్స్, డ్రగ్ రాకెట్ విషయంలో చర్యలు తీసుకొని మాల్వియా నగర్ ఎస్‌హెచ్‌వోతో పాటు మరో ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకోవాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయం మందు సోమవారం ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
కేసు విచారణకు హాజరుకాని కేజ్రీవాల్
షీలా దీక్షిత్ మాజీ రాజకీయ కార్యదర్శి దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసు విచారణకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హాజరు కాలేదు. వ్యక్తిగత హాజ రు నుంచి మినహాయింపు నివ్వాలన్న కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభ్యర్థనను చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సంజయ్ బన్సల్ శనివారం మన్నించారు. ఈ కేసులో వాంగ్మూలాలు నమోదుచేసేందుకు ఏప్రిల్ ఐదున మళ్లీ విచారణ ఉంటుం దని ప్రకటించారు. 2012, అక్టోబర్‌లో విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ అనేక ఆందోళనలు నిర్వహించిన కేజ్రీవాల్, అప్పటి సీఎం షీలా ప్రతిష్టకు భంగం కలిగించే ఓ మీడియా షోలో అసభ్య పదజాలాన్ని వాడారని ఆమె రాజకీయ కార్యదర్శి పవన్ ఖేరా కోర్టుకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
తిలక్‌లేన్‌లో సీఎం కొత్త నివాసం
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీలో మరో నివాసం లభించింది. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ కేజ్రీవాల్‌కు తిలక్‌లేన్‌లో మూడు పడక గదుల నివాసాన్ని కేటాయిం చింది. సి2/23 తిలక్‌లేన్ చిరునామా కలిగిన రెండంతస్తుల భవనంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌ను కేజ్రీవాల్‌కు కేటాయించారు. పైఅంతస్తులో సుప్రీం కోర్టు న్యాయవాది నివాసముంటున్నారు. టైప్ ఆరు కేటగిరీకి చెందిన ఈ నివాసం బిల్టప్ ఏరియా 1,600 చదరపు అడుగులు. ఈ ఇంటిని ఆనుకుని చిన్న లాన్ కూడా ఉంది. ఈ భవనానికి దగ్గరలోనే పార్కు ఉందని, దానిలో ముఖ్యమంత్రి ప్రజలను కలవవచ్చని అధికారులు చెబుతున్నారు. కేజ్రీవాల్ త్వరలోనే ఈ ఇంటికి మకాం మారుస్తారని అంటున్నారు. కేజ్రీవాల్‌కు గతంలో భగవాన్‌దాస్ రోడ్‌లో సువిశాలమైన నివాసాన్ని కేటాయిం చడం, దానిపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన దానిని తీసుకోవడానికి నిరాకరించడం తెలిసిందే.
Advertisement
Advertisement