ఎటు చూసినా చిక్కులే!
Published Wed, Nov 20 2013 12:28 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
సాక్షి, న్యూఢిల్లీ:కొత్తగా ఎన్నికల రాజకీయాల్లో అడుగుపెట్టిన ఆమ్‌ఆద్మీ పార్టీతోపాటు ఎన్నికల రాజకీయాల్లో తలపండిన కాంగ్రెస్, బీజేపీని కూడా ఎన్నో సమస్యలు ఇరుకునపెడుతున్నాయి. అర్వింద్ కేజ్రీవాల్, అన్నా హజారే వివాదం ఆమ్‌ఆద్మీ పార్టీని చిక్కుల్లో నెట్టింది. డీపీసీసీ అధ్యక్షుడు జైప్రకాశ్ అగర్వాల్, ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ మధ్య సఖ్యత లేకపోవడం కాంగ్రెస్‌ను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఢిల్లీ బీజేపీ విభాగం అధ్యక్షుడు విజయ్ గోయల్, ముఖ్యమంతి అభ్యర్థి హర్షవర్ధన్ మధ్య సామరస్యం లోపించడం బీజేపీకి అతిపెద్ద సమస్యగా పరిణమించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం తన పేరు వినియోగించుకోరాదంటూ సామాజిక సేవకుడు అన్నా హజారే ఆప్‌కు స్పష్టం చేయడం ఆ పార్టీకి దెబ్బలాగే భావించాల్సి ఉంటుంది. ఆప్ ఎన్నికల ప్రచారానికి లోక్‌పాల్ ఉద్యమ విరాళాలను వాడుకుంటోందంటూ విమర్శలు రావడం కేజ్రీవాల్‌కు ఇబ్బందికరంగా మారింది. అన్నా హజారే సృష్టించిన వివాదంతో ఆమ్‌ఆద్మీ పార్టీ నేతలు ఎన్నికల ప్రచారాన్ని పక్కనబెట్టి సంజాయిషీలు ఇచ్చుకునేపనిలో పడ్డారు.
ఎన్నికల ప్రచారం కోసం తన పేరును ఎంత మాత్రమూ వాడుకోవద్దని హజారే స్పష్టంగా హెచ్చరిస్తూ లేఖ కూడా రాయడం దుమారం రేపింది. అయితే ఉద్యమం కోసం కేటాయించిన నిధులను తాము వాడుకోవడం లేదని, ఈ విషయమై బహిరంగ చర్చకు సిద్ధమని కేజ్రీవాల్ వివరణ ఇచ్చారు. ఆప్ పలువురు నేరస్తులు, అవినీతిపరులకు టికెట్లు ఇచ్చినట్టు వచ్చిన వార్తలు ఆ పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాయి.పార్టీ మేనిఫెస్టోను ఆవిష్కరించే కార్యక్రమాన్ని కూడా ఆప్ బుధవారానికి వాయిదావేసింది. కాంగ్రెస్ ఆశాకిరణం రాహుల్ గాంధీ సభకు లభించిన పేలవమైన ప్రతిస్పందన కాంగ్రెస్‌కు ఆందోళన కలిగిప్తోంది. తమకు కంచుకోటగా భావించే దక్షిణపురి ప్రాంతంలో నిర్వహించిన సభకు ఆశించినంత ప్రతిస్పందన రాకపోవడం నాలుగోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తున్న ఈ పార్టీని ఆలోచనలో పడేసింది. దక్షిణాపురి పరిధిలోని అన్ని నియోజకవర్గాలు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరమయ్యాయి.
అలాంటి దక్షిణపురిలో పార్టీకి ఇలాంటి స్పందన లభించడం చూసిన వారు కాంగ్రెస్‌కు ముందున్నది గడ్డుకాలమేనని అంటున్నారు. దక్షిణాపురి డీడీఏ పార్కులో ఏర్పాటుచేసిన ఈ సభకు రావడమే జనం తక్కువగా వచ్చారు. వచ్చినవారు కూడా రాహుల్ గాంధీ ప్రసంగం మొదలుపెట్టగానే సభ నుంచి తిరుగుముఖం పట్టారు. దానితో ఆయన తన ప్రసంగాన్ని ఆరు నిమిషాలకే ముగించారు. దీనిపై రాహుల్‌గాంధీ తన ఆగ్రహాన్ని వెలిబుచ్చకపోయినా ఆయన ముఖంలో కోపం కనిపించిందని కార్యకర్తలు అంటున్నారు. తక్కువ జనం రావడంపై వచ్చిన విమర్శలకు షీలా స్వయంగా వివరణ ఇచ్చుకున్నారు. సర్వేల ఫలితాలు కూడా కాంగ్రెస్‌ను వణికిస్తున్నాయి. ఇక జేపీ అగర్వాల్, షీలాదీక్షిత్ మధ్యనున్న విబేధాలు ఇటీవల రాహుల్ సభతో మళ్లీ బయటపడ్డాయి. ఎడముఖం, పెడముఖంగా మసిలే ఈ నేతలు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశం మేరకు తమ విబేధాలను పక్కన పెట్టినట్లే కనిపించారు.
ఇదంతా పైపై వ్యవహారమేనని రాహుల్ సభతో తేలిపోయిందని, ఈ సంగతి అధిష్టానం దృష్టికి కూడా వచ్చిందని అంటున్నారు. రాహుల్ ఆధ్వర్యంలో జరిగిన రెండు సభలకు డీపీసీసీ పేరిట ముద్రించిన రెండు ఆహ్వానపత్రికల్లోనూ అగర్వాల్ పేరు లేకపోవడంతో అధిష్టానం షీలాను మందలించిందని అంటున్నారు. తమ నేతలు ప్రచారంలో అనుసరిస్తోన్న ఒంటెత్తు పోకడలు బీజేపీకి తలనొప్పి వ్యవహారంగా మారింది. ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్ధన్ ఎన్నికల పోరుకు సిద్ధమవుతుండగా, విజయ్ గోయల్ పాదయాత్ర మొదలుపెట్టారు. వీరికి తోడు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఎన్నికల బరిలోకి దిగిన విజేంద్ర గుప్తా ఒంటరిగా ప్రచారం చేస్తున్నారు.
ఒక్కొక్కరం ఒక్కోచోట ప్రచారం చేస్తేనే నగరమంతా బీజేపీ ప్రభావం చూపగలుగుతుందని విజయ్ గోయల్ వాదిస్తున్నారు. ఆయన తన ఒంటెత్తు పోకడను సమర్థించుకోవడానికే ఈ వాదనను పైకి తెస్తున్నారని బీజేపీ నాయకులు అంటున్నారు. నేతల మధ్య సామరస్యం లోపించడం వల్ల మరోమారు ఓటమి పాలు కావలసివస్తుందన్న భయం బీజేపీ అధిష్టానాన్ని వేధిస్తోంది. ఆప్ దూకుడు కూడా బీజేపీకి ముచ్చెమటలు పట్టిస్తోంది. ఆ పార్టీకి ఈసారి మంచి ఫలితాలు లభిస్తాయని సర్వేలు తేల్చడం బీజేపీకి రుచించడం లేదు. ఈసారి తాము కచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న నమ్మకం పార్టీలో కనిపించడం లేదని బీజేపీ కార్యకర్త ఒకరు అన్నారు.
Advertisement
Advertisement