నయవంచకులు
నయవంచకులు
Published Sun, Feb 23 2014 10:36 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
49 రోజుల పాలన అందించిన ఆమ్‌ఆద్మీ పార్టీ సర్కారు శుష్కనినాదాలు చేయడం, అబద్ధాలు చెప్పడం మినహా సాధించేదేమీ లేదని డీపీసీసీ విమర్శించింది. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయడానికి పోల్ ఖోల్ అభియాన్ ఉద్యమాన్ని ప్రారంభించింది. తన రాజకీయ ప్రయోజనాల కోసం మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దేశరాజధానిని అధికారుల దయాదాక్షిణ్యాలకు వదిలేశారని కాంగ్రెస్ ఆరోపించింది.
సాక్షి, న్యూఢిల్లీ:అసత్యాల విభాగంలో గిన్నిస్ రికార్డు ఉన్నట్లయితే అది ఎలాంటి పోటీ లేకుండా అరవింద్ కేజ్రీవాల్‌కు దక్కుతుందని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ ఆరోపించారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దేశరాజధానిని అధికారుల దయాదాక్షిణ్యాలకు వదిలేశారని కాంగ్రెస్ ఆరోపించింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 49 రోజుల పాలనకు వ్యతిరేకంగా ఢిల్లీ కాంగ్రెస్ ‘పోల్ ఖోల్ అభియాన్’ ప్రారంభించింది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు వైఫల్యాలను ప్రజల ముందు ఎండగట్టే ఉద్దేశంతో చేపట్టిన ఈ ఉద్యమాన్ని ఆదివారం కన్నాట్‌ప్లేస్‌లో మొదలు పెట్టారు.
పోల్ ఖోల్ అభియాన్ ప్రారంభ కార్యక్రమంలో డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ, కాంగ్రెస్ విధానసభపక్ష నేత హరూన్ యూసుఫ్ , ఢిల్లీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ షకీల్ అహ్మద్‌తోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. కన్నాట్‌ప్లేస్‌లోని సెంట్రల్‌పార్క్‌లో గుమిగూడిన వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు 20 అడుగుల ఎత్తున్న ‘అసత్యాల కేజ్రీవాల్’ దిష్టిబొమ్మను తగులబెట్టారు. ఇందులో భాగంగా పోస్టర్లతో ప్రచారోద్యమం కూడా చేట్టారు. ‘నా దారి లేదా రహదారి’, ‘అతను వచ్చాడు’, ‘అతను చూశాడు, అతను పారిపోయాడు’ వంటి వ్యంగ్య వ్యాఖ్యలను జోడించిన కేజ్రీవాల్ క్యారికేచర్లనూ విడుదల చేశారు.
అరవింద్ కేజ్రీవాల్ సర్కారు ఢిల్లీని దేవుడు, అధికారుల దయాదాక్షిణ్యాలకు వదిలివేసి పారిపోయారని పోల్‌ఖోల్ అభియాన్‌ను ఆరంభించిన సందర్భంగా మాట్లాడుతూ లవ్లీ అన్నారు. ‘ప్రజాసంక్షేమం పేరిట కేజ్రీవాల్ ఆడిన అబద్ధాల గుట్టురట్టు చేయడానికి తాము పోల్ ఖోల్ అభియాన్ ఆరంభిస్తున్నాం. దేశం ఇప్పటికే ఒక అబద్దాల కోరుతో బాధపడుతుండగా మరో అబద్ధాలకోరు వచ్చాడు’ అంటూ ఆయన నరేంద్ర మోడీ, కేజ్రీవాల్‌లను ఎద్దేవా చేశారు. కేజ్రీవాల్‌కు అన్నింటినీ వదిలివేయడం అలవాటేనని ఎగతాళి చేశారు. ఆయన మొదట ఉద్యోగాన్ని వదిలిపెట్టారని, ఆ తరువాత అన్నా హజారేను, ఇప్పుడు ఢిల్లీని వదిలిపెట్టారని విమర్శించారు. మున్ముందు దేశాన్నీ వదిలిపెడతారని లవ్లీ ఆరోపించారు.
49 రోజుల ఆప్ సర్కారును ‘శుష్కవాగ్దానాలు... పనిచేయని ప్రభుత్వం’గా అభివర్ణించారు. కేజ్రీవాల్ సర్కారు హఠాత్తుగా గద్దెదిగడం ప్రజలను మోసగించడమేనని యూసుఫ్ స్పష్టం చేశారు. ఆప్ గుట్టు ప్రజల ముందు బయటపడిందని, ప్రజలు ఆ పార్టీపై నమ్మకం కోల్పోయారని ఆయన చెప్పారు. కేజ్రీవాల్ ప్రజలను మోసగించాడని చెబుతూ జన్‌లోక్‌పాల్ బిల్లుపై ఆప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడాన్ని హరూన్ యూసుఫ్ సమర్ధించుకున్నారు. ఢిల్లీ జన్‌లోక్‌పాల్ బిల్లు పేరుచెప్పుకుని కేజ్రీవాల్ రాజ్యాంగాన్ని చించివేయాలనుకున్నాడని ఆయన ఆరోపించారు. కేజ్రీవాల్ సర్కారు తీసుకున్న, ప్రజావ్యతిరేక, రాజ్యాంగ విరుద్ధ, చట్టవ్యతిరేక చర్యలను పరిశీలించడానికి పోల్ ఖోల్ అభియాన్‌లో భాగంగా ఒక కమిటీ ని నియమిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది.
Advertisement
Advertisement