అ‘సామాన్యుడు’
Published Wed, Jan 1 2014 10:54 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని ఇప్పటివరకు పాలించిన ముఖ్యమంత్రులు కాలు తీసి బయటకు అడుగుపెట్టాలంటే భారీ పటిష్ట బందోబస్తు దర్శనమివ్వడం పరిపాటిగా కనిపించింది. వాళ్ల ఇళ్లు సకల సౌకర్యాలతో ఎన్నో హంగులతో సామాన్యుడు అటువైపుగా చూస్తే కళ్లు బైర్లు కమ్మేలా ఉండేది. అక్కడకు వెళ్లిన ప్రభుత్వ అధికారులు, నాయకులకు రాజ భవనాన్ని చూశామన్న ఆలోచన మదిలో మెదులుతుండేది. ఇక సామాన్యుడికి ప్రవేశమంటే గగనమే .అయితే వీరందరికి భిన్నంగా ప్రస్తుతమున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సాదాసీదా వ్యక్తిగానే వ్యవహరిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఏర్పాటుచేయకముందే ఎలా వ్యవహరించారో ఇప్పుడు కూడా అదే స్టైల్‌ను కొనసాగిస్తున్నారు. అందరికీ సామాన్యుడి లాగానే కనిపిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా కేజ్రీవాల్ తీసుకుంటున్న శ్రద్ధ సామాన్యుడిలో ఆయనకు మరింత క్రేజ్‌ను పెంచుతోంది.
కాగా, అనారోగ్యం బారిన పడిన కేజ్రీవాల్ సచివాలయానికి వెళ్లేంత ఓపిక లేకపోవడంతో ఘజియాబాద్ కౌశాంబిలోని నివాసంలో ఢిల్లీ జల్ బోర్డు అధికారులతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ప్రజలకిచ్చిన మాటను నెరవేర్చేందుకు కేజ్రీవాల్ చూపిన అంకిత భావాన్ని చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. గిర్నార్ టవర్ బిల్డింగ్‌లోని నాలుగో అంతస్తులో డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్‌లోని ఓ గదిలో కేజ్రీవాల్ సోఫాపై కూర్చోగా, ఎదురుగా ఉన్న మరో సోఫాపై డీజేబీ సీఈవో విజయ్ కుమార్, ఆర్థిక కార్యదర్శి ఎంఎం కుట్టి కూర్చున్నారని ముఖ్యమంత్రి సన్నిహితుడైన పార్టీ సభ్యుడు ఒకరు విలేకరులకు తెలిపారు. అయితే అధికారంలోకి రాగానే ఢిల్లీవాసులకు రోజుకు 666 లీటర్ల నీటిని ఉచితంగా ఇస్తామన్న ఆప్ హామీపై చర్చించారు. ఈ పథకంపై అధికారులు తమ అభిప్రాయాలను ముఖ్యమంత్రికి వివరించగా ఎంతో ఓపిగ్గా విన్నారని చెప్పారు. ఈ సమయంలో చలిని తట్టుకునేందుకు కేజ్రీవాల్ శాలువా, మంకీ క్యాప్, సాధారణ సాక్స్‌లు ధరించి సామాన్య ఢిల్లీవాసిలాగానే వేషధారణ ఉందని చెప్పారు. సోఫాపైనే కూర్చుండి ఢిల్లీ ప్రజలకు ఉచిత నీటి పథకాన్ని ప్రకటించారన్నారు.
గత వారం నుంచి అనారోగ్యంగా ఉంటున్న కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు ఆదివారం జ్వరం తీవ్రత పెరిగింది. అయితే సెక్రటేరియట్‌కు వెళ్లాలనుకున్నానని, 102 డిగ్రీల జ్వరం ఉండటంతో వైద్యుల సూచనల మేరకు ఇంట్లోనే ఉండాల్సి వచ్చిందని, తప్పుడు సమయంలో తనకు జ్వరం వచ్చేలా చేశావు దేవుడా అని ట్విట్టర్‌లో కేజ్రీవాల్ పోస్టు చేసి ప్రజలకు సేవ చేయాలన్న ధృఢసంకల్పాన్ని కనబరిచారు. మరుసటి రోజు మంగళవారం ఆరోగ్యం కుదుటపడకున్నా తన నీలి రంగులో ఉన్న వేగ్నార్ కారులో ఢిల్లీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కార్యాలయానికి చేరుకున్నారు. సెంట్రల్ ఢిల్లీలో ఉన్న ఈ కార్యాలయానికి కేవలం నలుగురు వాలంటీర్లతో కలిసి చేరుకున్న కేజ్రీవాల్ కొన్ని నిమిషాల్లోనే భేటీ ముగించుకొని మీడియాతో మాట్లాడారు. ఆ వెంటనే సెక్రటేరియట్‌కు వెళ్లి మంత్రి వర్గ సమావేశం నిర్వహించారు. అయితే కేజ్రీవాల్ ప్రయాణ సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సామాన్యుడిలాగే వెళుతుండటాన్ని నగరవాసులు ప్రశంసిస్తున్నారు.
ఇంతకుముందు ఉన్న సీఎంల తీరు గురించి కూడా చర్చించుకుంటున్నారు. అప్పటివారికి ప్రస్తుతమున్న ముఖ్యమంత్రిగా చాలా తేడా ఉందని, సీఎం అంటే ఇలానే ఉండాలని కొనియాడుతున్నారు. గతంలో కాగ్ కార్యాలయానికి మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ వచ్చిన సమయంలో ఎంతో మంది పోలీసులు వచ్చారని, సామాన్యులను అటువైపుగా వెళ్లనివ్వలేదని స్థానిక టీ వ్యాపారి ఒకరు చర్చించుకోవడం కనిపించింది. అదే కార్యాలయానికి కేజ్రీవాల్ కేవలం నలుగురితో కలిసి వచ్చి సామాన్యులకు ఇబ్బంది పెట్టకుండా పని ముగించుకొని వెళ్లారని మాట్లాడుకోవడం కనబడింది. ఆప్ పార్టీ స్థాపించకముందే కేజ్రీవాల్ సొంతగానే వేగ్నార్ కారును డ్రైవ్ చేసేవారని, అయితే ముఖ్యమంత్రి అయ్యాక మరొకరు డ్రైవింగ్ చేస్తున్నారని, అప్పటికీ, ఇప్పటికీ అదొక్కటే తేడా అని ఆప్ కార్యకర్త ఒకరు తెలిపారు.
Advertisement
Advertisement