హామీలను నిలబెట్టుకోవడం ఆప్‌కి పెనుసవాలే
Published Sun, Dec 29 2013 11:31 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
న్యూఢిల్లీ/ఘజియాబాద్:తాను ఇచ్చిన ఘనమైన హామీలను నిలబెట్టుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకున్న అరవింద్ కేజ్రీవాల్ తనంతట తాను చిక్కుల్లో పడ్డాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాటన్నింటినీ నిలబెట్టుకోవడం అంత సులభసాధ్యం కాదని, అందువల్ల స్వల్ప వ్యవధిలోనే అరవింద్ రంగు బయటపడుతుందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. విద్యుత్ చార్జీలను తగ్గించడం అంత సులువేమీ కాదంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు గణాంకాలతో సహా చెబుతున్నారు. అంతేకాకుండా ఢిల్లీ జల్‌బోర్డులో ఎటువంటి అవకతవకలు జరగలేదని, అందువల్ల అరవింద్ విచారణ జరిపించుకోవచ్చంటున్నారు. 1993లో ఢిల్లీ శాసనసభ ఏర్పాటైన తర్వాత నగర రాజకీయాల్లో గతంలో ఎన్నడూలేని విధంగా అరవింద్ ఒకే ఒక దెబ్బతో కాంగ్రెస్, బీజేపీలను మట్టి కరిపించాడు.
ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సి వచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు అలక పాన్పు ఎక్కగా, హర్షవర్ధన్ అంటే కొందరికి గిట్టని కారణంగా ప్రభుత్వ ఏర్పాటు విషయంలో బీజేపీ రెండుగా చీలిపోయింది. ‘ఇటీవల జరిగిన ఎన్నికల్లో మాకు అత్యధిక స్థానాలు వచ్చాయి. అయినప్పటికీ మేము ప్రతిపక్షానికే పరిమితం కావాల్సి వచ్చింది. ఇవేమి రాజకీయాలు’ అంటూ ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులు వాపోయారు. అంశాలవారీగా మద్దతుకు బేషరతుగా అంగీకరించడంద్వారా కాంగ్రెస్ పార్టీ వెనక్కితగ్గింది. ‘మా అందరికంటే తానే ఎంతో నేర్పరితనం కలిగిన నాయకుడని కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రనాయకుడొకరు ఇటీవల అంగీకరించారు. రాజకీయాల్లోకి అడుగిడి న 45 ఏళ్ల వ్యక్తికి ఇదొక మహా ప్రశంస. వారు రాజకీయ నాయకులు కాదు. అధికార దళారులు. రాజకీయ నాయకుడంటే దివంగత లాల్‌బహదుర్ శాస్త్రి మాత్రమే. ఆయన అడుగుజాడల్లోనే మేము నడుస్తున్నాం’ అని అరవింద్ పేర్కొన్నారు.
ఇదొక కుట్రే
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ వెలుపలి నుంచి మద్దతు ఇవ్వడం ఓ కుట్ర అని, ఎన్నికలను కొన్నాళ్లపాటు వాయిదా వేయాలనే ఉద్దేశంతోనే మద్దతు ఇచ్చిందని రాజకీయ పండితులు అంటున్నారు. లోక్‌సభ ఎన్నికలతోపాటు ఢిల్లీ శాసనసభకు మరోసారి ఎన్నికలు జరగకుండా చేయాలనేదే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశమని అంటున్నారు. లోక్‌సభ ఎన్నికల సమయంలోనే ఢిల్లీ శాసనసభకు ఎన్నికలు జరిగితే అది బీజేపీకి లాభించొచ్చని కాంగ్రెస్ పార్టీ భావించిందని అంటున్నారు. ఒకేసారి ఎన్నికలు జరిగితే బీజేపీయే అధికారంలోకి వస్తుందనేది కాంగ్రెస్ యోచనగా చెబుతున్నారు. ఇదిలాఉంచితే ఆప్ ప్రభుత్వం విజయవంతం కావడమనేది కూడా అత్యంత పరిమితంగా ఉండొచ్చు. ఉల్లాసస్థితి కోల్పోయిన తర్వాత ముఖ్యమంత్రి అరవింద్ అనేక వాస్తవాలను జీర్ణించుకోవాల్సి ఉంటుంది. కొన్ని చేదు అనుభవాలు కూడా ఎదురుకావొచ్చు. అనేక విషయాల్లో ఆయన ప్రత్యక్ష నియంత్రణ అనేది అదుపు తప్పే ప్రమాదమూ లేకపోలేదు. ఢిల్లీ సచివాలయాన్ని నడపడమనేది అంత తేలికేమీ కాదు.
ఆప్ ప్రభుత్వ విజయం కోసం యజ్ఞం
ఎన్నికల సమయంలో తన కుమారుడు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఆకాంక్షిస్తూ కౌశాంబి ప్రాంతంలోని ఆలయ ప్రాంగణంలో అరవింద్ తండ్రి గోవింద్‌రాం కేజ్రీవాల్ యజ్ఞం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన కుమారుడికి ప్రజల మద్దతు ఉందని, అందువల్ల ఆప్ ప్రభుత్వం ఐదేళ్లపాటు అధికారంలో కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అరవింద్ నిలబెట్టుకోవాలని ఆకాంక్షిస్తూ తాము యజ్ఞం చేశామని అన్నారు. ప్రాణరక్షణ కోసం అరవింద్ భద్రతాసిబ్బందిని వినియోగించుకుంటారా అని మీడియా ప్రశ్నించగా దేవుడే రక్షకుడని, ఆయనే అంతా చూసుకుంటాడ ని అన్నారు. ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టిన తర్వాత అరవింద్ ప్రవర్తనలో ఏదైనా మార్పు కనిపించిందా అని ప్రశ్నించగా అదేమీ లేదన్నారు. తమను ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా చూసుకుంటాడన్నారు. బయటికెళ్లే ప్రతిసారి తనకు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకుంటాడని ఆయన వివరించారు.
Advertisement
Advertisement