పోటెత్తిన ఓటరు
Published Wed, Dec 4 2013 11:33 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
సాక్షి, న్యూఢిల్లీ:మిగతా విషయాల్లో చైతన్యవంతులనే పేరున్న ఢిల్లీవాసులపై.. ఓటు వేసేందుకు పెద్దగా ఆసక్తి చూపరనే ముద్ర పడిపోయింది. ముఖ్యంగా యువత, మహిళలు ఓటు వేసేందుకు పోలింగ్ బూత్‌లకు వచ్చి, క్యూ లైన్లలో నిలబడడానికి బద్దకిస్తారనే విషయం ఇప్పటిదాకా జరిగిన పలు ఎన్నికల్లో నిరూపితమైంది కూడా. అయితే తమపై పడిన ఈ ముద్రను బుధవారం జరిగిన విధానసభ ఎన్నికల్లో నగరవాసులు చెరిపేసుకున్నారు. ఢిల్లీవాసులు ఓట్ల పండుగను అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఓటింగ్ శాతం గత రికార్డులను అధిగమించింది.వీఐపీల నుంచి సామాన్యుల వరకు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేయడానికి గంటల తరబడి క్యూలో నిలబడడానికి కూడా వారు వెనుకాడలేదు. ఉదయం 8 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది.
8 గంటలు దాటినా కొనసాగిన ఓటింగ్..
సాధారణంగా సాయంత్రం 5 గంటలు దాటిందంటే పోలింగ్ కేంద్రాలు నిర్మానుష్యమవుతాయి. అయితే బుధవారం జరిగిన ఎన్నికల్లో మాత్రం 8.30 గంటల వరకు ఓటర్లు బూత్‌ల ముందు కనిపించారు. నిబంధనల ప్రకారం 5 గంటలకే ముగియాల్సి ఉండగా ఎన్నికల సంఘం గడువును పొడిగించడంతో దాదాపు మరో మూడున్నర గంటలపాటు ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు. ఢిల్లీలో అధికారం కోసం పోటీపడ్తోన్న మూడు ప్రధాన పార్టీల ముఖ్యమంత్రి అభ్యర్థులు షీలాదీక్షిత్, అరవింద్ కేజ్రీవాల్, డాక్టర్ హర్షవర్ధన్ తమ అమ నియోజకవర్గాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ముగ్గురూ గెలుపుతమదేనన్న ధీమా వ్యక్తం చేశారు. వీఐపీల విషయానికి వస్తే గాంధీ కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రముఖులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ తో పాటు ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ప్రస్తుత స్పీకర్ మీరాకుమార్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ముఖ్యమంత్రి షీలాదీక్షి త్‌తో కలిసి నిర్మాణ్ భవన్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఓటు వేసిన తరువాత ఆమె విలేఖరుల ఎదుట విజయం తమదే అన్న ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ చేతివేళ్లతో విజయం గుర్తు చూపించారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఔరంగాజేబ్ లేన్‌లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.
ప్రియాంకా వాద్రా తన భర్త రాబర్ట్ వద్రాతో కలిసి ఓటు వేయడానికి వచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి అరవింద్ కేజ్రీవాల్ ఓటింగ్ ప్రారంభమైన వెంటనే హనుమాన్ రోడ్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఓటర్లు తినడానికంటే ముందే ఓటుహక్కును వినియోగించుకోవాలని కోరారు. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్ధన్ కృష్ణానగర్ నియోజకవర్గంలో ఓటు వేశారు. ఆ తరువాత హర్షవర్ధన్ మాట్లాడుతూ... కాంగ్రెస్, కొత్తగా వచ్చిన ఆప్ కన్నా తాము ఎంతో ముందున్నామని, గెలుపు తమదేనని, 100 శాతం నమ్మకంతో ఉన్నామని చెప్పారు. తమ ఓటు బ్యాంకును ఎవరూ కొల్లగొట్టలేరని తాను భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఓటరు జాబితాలో నుంచి పలువురి పేర్లు మాయం కావడం వల్ల వారు ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఆరోపించింది.
ఇబ్బందిపడిన ఓటర్లు...
పోలింగ్ బూత్‌ల వద్ద అధికారులు విధించిన ఆంక్షలు ఓటర్లను తీవ్ర ఇబ్బందులు పెట్టాయి. పోలింగ్ బూత్‌లకు వచ్చేముందు ఓటర్లు తమతో సెల్‌ఫోన్‌లు తీసుకురాకూడదని ఎన్నికల కమిషన్ ముందస్తు ప్రచారం చేయకపోవడంతో చాలా మంది సెల్‌ఫోన్లతోపాటు వచ్చి బారులు తీరారు. తీరా తమవంతు వచ్చేసరికి సెల్‌ఫోన్ కారణంగా లోపలికి వెళ్లనీయకపోవడంతో వెనుదిరగాల్సి వచ్చింది. అయితే సెల్‌ఫోన్ తీసుకురాకూడదనే విషయం ముందుగానే చెబితే బాగుండేదని పలువురు అభిప్రాయపడ్డారు. చాలామందికి దీనిపై అవగాహన లేక తమతోపాటు సెల్‌ఫోన్‌లు తీసుకువచ్చి, తీరా పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించేముందు ఫోను ఉన్నందుకు తిరిగి వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల చాలామంది ఇబ్బందిపడ్డారని చార్టెర్డ్ ఎకౌంటెంట్, తూర్పు ఢిల్లీలోని డిఫెన్స్ ఎన్‌క్లేవ్‌లో ఓటరైన శశిగుప్తా తెలిపారు. ఇదిలాఉండగా పలు ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు మొరాయించాయని పలువురు ఆరోపించారు. విశ్వాస్‌నగర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఓం ప్రకాశ్ చౌదరి తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు అరగంటకు పైగా వేచి ఉండాల్సి వచ్చిందని ఆ పార్టీ కార్యకర్త నరేష్ చౌదరి తెలిపారు. తాను కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు 20 నిమిషాలు వేచి ఉన్నానని ఓటరైన అఖిల్ భార్గవ తెలిపారు.
పోలింగ్ బూత్‌ల సందర్శనకు విదేశీ బృందం
శాసనసభ ఎన్నికలకు జరుగుతున్న ఓటింగ్ సరళిని పరిశీలించేందుకు 36 మంది సభ్యులున్న విదేశీ బృందం పలు నియోజకవర్గాల్లో పర్యటించిందని ప్రత్యేక ప్రధాన ఎన్నికల అధికారి సింగ్ తెలిపారు. తమ పర్యటన సమయంలో బృందం న్యూఢిల్లీ, షాలిమర్ బాఘ్, కృష్ణనగర్, పటేల్‌నగర్ తదితర నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతున్న విధానాన్ని అధ్యయనం చేసిందని ఆయన చెప్పారు. ఇదిలాఉండగా యునెటైడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌కు చెందిన 8 మంది సభ్యుల బృందం కూడా మంగళవారం ఢిల్లీలో పర్యటించి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిందని సింగ్ వివరించారు.
ఓటేసిన సెక్స్ వర్కర్లు
స్థానిక జీబీ రోడ్ రెడ్‌లైట్ ఏరియాకు చెందిన సుమారు 1,050 మంది సెక్స్‌వర్కర్లు బుధవారం తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ‘భారతీయ పతిత ఉద్ధార్ సభ’ అనే స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు ఖైరతీలాల్ భోలా ఈ విషయమై మాట్లాడుతూ.. మధ్యాహ్నం బల్లీమరాన్, అజ్మీర్‌గేట్ వద్ద ఉన్న పోలింగ్ కేంద్రాల్లో ఓటుహక్కు వినియోగించుకునేందుకు సుమారు 1,500 మంది సెక్స్‌వర్కర్లు వచ్చారని తెలిపారు. అయితే గుర్తింపు కార్డుల్లో ఉన్న లోపాల వల్ల కొందరిని ఓటింగ్‌కు అధికారులు అనుమతించలేదని చెప్పారు. జీబీరోడ్‌లో ఉన్న 25 భవనాల్లో నిర్వహిస్తున్న 116 వ్యభిచార గృహాల్లో సుమారు 5,000 మంది సెక్స్‌వర్కర్లు ఉన్నారని ఆయన వివరించారు.
112 ఈవీఎంల మార్పిడి..
నగరంలోని పలు పోలింగ్ బూత్‌లలో ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం) మొరాయించడంతో వాటిని మార్చి కొత్త యంత్రాలను ఉపయోగించినట్లు ఎన్నికల అధికారి నీరజ్ భర్తీ తెలిపారు. నగరవ్యాప్తంగా ఇలా 112 ఈవీఎంలను మార్చామన్నారు.
వీవీపీఏటీ విజయవంతం
ఓటరు తాను వేసిన ఓటు సరిగా నమోదయ్యిందా లేదా అని తెలుసుకునేందుకు ఉద్దేశించిన ‘ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయిల్ (వీవీపీఏటీ)’ పద్ధతిని నగరంలో మొదటిసారి న్యూఢిల్లీ నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి షీలాదీక్షిత్, ఆప్ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ నేత విజేందర్ గుప్తా మధ్య ఆసక్తికర పోరు నడుస్తున్న నేపథ్యంలో న్యూఢిల్లీ నియోజకవర్గాన్ని తాము మోడల్‌గా ఎంచుకున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. వీవీపీఏటీ పద్ధతిలో, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రానికి ఒక ప్రింటింగ్ యంత్రాన్ని అనుసంధానిస్తారు. తన ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఓటరు ఈవీఎంలోని బటన్ నొక్కిన తర్వాత ప్రింటింగ్ యంత్రంలో లైట్ వెలుగుతుంది. తర్వాత అందులోంచి బ్యాలెట్ సీరియల్ నంబర్, ఓటరు ఓటేసిన అభ్యర్థి పేరు, పార్టీ గుర్తు తదితరాలతో ప్రింట్ బయటకు వస్తుంది. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా బుధవారం న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఓటరులెవ్వరికీ ప్రింటెండ్ రశీదులను ఇవ్వలేదని అధికారులు పేర్కొన్నారు.
ఓటేశాక ఎవరేమన్నారంటే....
మరోమారు గెలుస్తామన్న నమ్మకం ఉంది. ఈ ఓట్లు కేంద్రానికి రిఫరెండం కావు. రాజకీయాలను నేను వ్యక్తిగతంగా తీసుకోను. పార్టీకే నామొదటి ప్రాధాన్యం. మోడీ ప్రచారం బీజేపీకి కలిసి వస్తుందనుకోను. హజారే లేఖ ప్రభావం ఆమ్ ఆద్మీ పార్టీపై తప్పక ఉంటుంది. - షీలాదీక్షిత్, ముఖ్యమంత్రి
వందశాతం మేమే గెలుస్తామని నమ్మకం ఉంది. ఢిల్లీవాసుల నుంచి మాకు ఎంతో మద్దతు లభిస్తోంది. వారి ఆశీర్వాదాలు లభిస్తున్నాయి. బీజేపీ మిగిలిన రెండు పార్టీలకంటే ఎంతో ముందుంది. విజయం మాదే. మిగిలిన రెండు పార్టీలు రెండో స్థానం కోసం పోటీపడుతున్నాయి. - డాక్టర్ హర్షవర్ధన్
ఎన్నికల ఫలితాలపై నాకు ఎంతో నమ్మకం ఉంది. ఇది నా గెలుపు కాదు. ప్రజల విజయం అవుతుంది. డిసెంబర్ ఎనిమిదిన ఫలితాల తర్వాత కలుద్దాం. - అరవింద్ కేజ్రీవాల్
అత్యధిక సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్న ఢిల్లీవాసులకు కాంగ్రెస్ తరఫున కృతజ్ఞతలు. మరోమారు మేమే అధికారంలోకి రాబోతున్నాం. - జైప్రకాశ్ అగర్వాల్
ప్రత్యర్థి పార్టీలతో పోలిస్తే మేం ఎంతో ముందు ఉన్నాం. ఢిల్లీ ప్రజలను మార్పు కోరుతూ తమ తీర్పు ఇచ్చారు. ప్రత్యర్థులు పంచిన మద్యం, డబ్బు, కానుకలు మాపై ఉంచిన నమ్మకం ముందు వెలవెలబోయాయి. వాటిని కాదని ప్రజలు బీజేపీకే ఓటు వేశారు. - విజయ్ గోయల్
Advertisement
Advertisement