న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా పోటీచేయడానికి
సాక్షి, న్యూఢిల్లీ: న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా పోటీచేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు మాజీ మంత్రి కిరణ్ వాలియా ప్రకటించారు. ఆమె మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తనకు పోటీచేయమని బాధ్యత అప్పగించినట్లయితే స్వీకరించడానికి సుముఖంగా ఉన్నానని ఆమె చెప్పారు. కిరణ్ వాలియా అభ్యర్థిత్వాన్ని గురించి కేజ్రీవాల్ వ్యాఖ్యానిస్తూ.. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడ నుంచైనా పోటీచేయవచ్చన్నారు. న్యూఢిల్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్‌ను ఓడించే సత్తాగల నేతనే బరిలోకి దింపుతామని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ అభ్యర్థుల రెండవ జాబితా బుధవారం వెలువడనుందని తెలియడంతో ఎవరెవరికి ఎక్కడినుంచి పోటీచేయడానికి టికెట్ లభిస్తాయన్న ఊహాగానాలు ఉపందుకున్నాయి.
కిరణ్ వాలియాకు న్యూఢిల్లీ, మాజీ స్పీకర్ యోగానంద్ శాస్త్రికి మాలవీయనగర్, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ట ముఖర్జీకి గ్రేటర్ కైలాష్, చౌదరి ప్రేమ్ సింగ్‌కు అంబేద్కర్‌నగర్ టికెట్ లభించవచ్చని అంటున్నారు.గాంధీనగర్ నుంచి ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ పోటీచేయడం అనుమానాస్పదమేనని, ప్రచార బాధ్యతల కారణంగా ఆయన ఎన్నికల్లో పోటీచేయకపోవచ్చని అంటున్నారు. గాంధీనగర్ నుంచి తన భార్యను ఎన్నికల బరిలోకి దింపనున్నట్లు వచ్చిన వార్తలను లవ్లీ ఖండించారు. మాజీ మంత్రి రమాకాంత గోస్వామి ఎన్నికల్లో పోటీచేయడానికి నిరాకరించారు. అనారోగ్యం కారణంగా పోటీచేయలేమని రమాకాంత్ గోస్వోమి, రాజేష్ జైన్ తెలిపినపార్టీవర్గాలు పేర్కొన్నాయి.