న్యూఢిల్లీ: అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విమర్శల వర్షం కురిపించింది. ఎలాగైనా అధికారంలోకి రావడమే అర్వింద్ కేజ్రీవాల్ లక్ష్యమని ఆరోపించింది. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు పూర్తవుతున్నా చేసింది శూన్యమని దుయ్యబట్టింది. బీజేపీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ ఆదివారం కేజ్రీవాల్ నెల రోజుల పాలనపై విలేకరులతో మాట్లాడారు. ఆప్‌లో నెలకొన్న అంతర్గత పోరుతో పాటు స్టింగ్ ఆపరేషన్ వెలుగు చూడటంతో ఢిల్లీ ప్రజలు తాము కేజ్రీవాల్ చేతిలో మోసపోయామనే భావనలో ఉన్నారని చెప్పారు. మొదటి నుంచి కూడా అధికారం కోసం అర్వింద్ కేజ్రీవాల్ ఆరాటపడ్డారని ఉపాధ్యాయ విమర్శించారు. అంతే కాకుండా ఆప్ మొదటి నెల పాలనతో ఢిల్లీ ప్రజలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని తెలిపారు. గత నెల రోజుల పాలనలో ఆప్ చేసిందేమీ లేదన్నారు. కనెక్షన్ ఉన్న ప్రతి కుటుంబానికి నెలకు 20 వేల లీటర్ల వరకు నీటిని సరఫరా చేస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు. మరి కనెక్షన్ లేని వారి పరిస్థితేంటి అని సతీష్ ఉపాధ్యాయ ప్రశ్నించారు. అలాగే విద్యుత్ రంగంలో ఢిల్లీని మోడల్ స్టేట్‌గా తీర్చిదిద్దుతామని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. అయితే దానికి సంబంధించి ఎలాంటి రోడ్ మ్యాప్‌ను ఆయన ఇప్పటిదాకా ప్రకటించలేదని విమర్శించారు.
నెల రోజుల్లో చేసిందేమీ లేదు
Published Mon, Mar 16 2015 12:29 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement